పాదయాత్రలో వైఎస్ జగన్‌ను కలిసి తమ సమస్యలు విన్నవించుకుంటున్న పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్లు (ఫైల్)
సాక్షి, విశాఖపట్నం: విద్యా హక్కు చట్టం ప్రకారం నియమించిన ఆర్ట్, క్రాఫ్ట్ ఉపాధ్యాయుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించి సర్వీసుల్ని క్రమబద్ధీకరిస్తుందని వీరంతా ఆశగా ఎదురు చూస్తున్నారు. పాదయాత్ర సమయంలో పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్లను క్రమబద్ధీకరిస్తామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీని నెరవేర్చాలని ఆర్ట్, క్రాఫ్ట్ ఉపాధ్యాయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. విద్యార్థి మానసిక ఒత్తిడి నుంచి బయటపడేందుకు ఆర్ట్ (చిత్రలేఖనం), క్రాఫ్ట్ (హస్తకళలు) విద్యలు దోహదపడతాయి. ఈ విషయంలో కొఠారి కమిషన్, యూజీసీ, ఎన్‌సీఈఆర్‌టీ ప్రతిపాదనల్ని అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఆర్ట్, క్రాఫ్ట్ ఉపాధ్యాయుల్ని 1995లో అప్పటి సీఎం చంద్రబాబు నిషేధించడంతో ఆర్ట్, క్రాఫ్ట్ టీచర్ల జాడ లేకుండా పోయింది.
కాంట్రాక్టు పద్ధతిలో: విద్యా హక్కు చట్టంలో సూచించిన మేరకు 2012–13 విద్యా సంవత్సరంలో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ విద్యను మళ్లీ పాఠశాలల్లో ప్రవేశపెట్టేందుకు పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్ల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 3,000 పోస్టుల్ని భర్తీ చేసింది. క్రమంగా వీరి సంఖ్య 5 వేలకు చేరింది. పూర్తి కాంట్రాక్ట్ బేసిక్ అంటూ సర్వశిక్షా అభియాన్ ద్వారా నియామకాలు చేపట్టింది. ప్రస్తుతం వీరికి గౌరవ వేతనంగా రూ.14,203 చెల్లిస్తున్నారు. ఏటేటా ఉద్యోగులు ప్రభుత్వానికి ఒప్పంద పత్రం (బాండ్)ని ఇస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో వీరంతా ఉద్యోగ క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
పాదయాత్రలో హామీతో ఆశలు: గత ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించినా సానుకూలంగా స్పందించకపోవడంతో ప్రతిపక్ష నేత హోదాలో పాదయాత్ర చేసిన వైఎస్ జగన్‌ని వీరంతా పలుమార్లు కలిసి తమ గోడును విన్నవించుకున్నారు. అర్హతలు ఆధారంగా ఎక్కువ మందిని క్రమబద్ధీకరిస్తానని వీరికి జగన్ హామీ ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2009 ఫిబ్రవరి 13న జీవో నం.31, 38, 84లను విడుదల చేస్తూ రాష్ట్రంలోని 1,030 మంది ఒకేషనల్ పార్ట్ టైమ్ ఇన్‌స్ట్రక్టర్లను రెగ్యులర్ చేశారు. వీరంతా అప్పట్లో ఆపరేషన్ బ్లాక్ బోర్డు పథకంలో విధులు నిర్వర్తించేవారు. వారి లాగానే పార్ట్‌టైమ్ ఇన్‌స్ట్రక్టర్లుగా విధులు నిర్వహిస్తున్న తమ జీవితాల్లోకి రాజన్న తనయుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వెలుగు తీసుకొస్తారని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఉపాధ్యాయులు ఆశగా ఎదురుచూస్తున్నారు.
ముఖ్యమంత్రిపై పూర్తి ఆశలు పెట్టుకున్నాం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైనే మేము పూర్తి ఆశలు పెట్టుకున్నాం. పాదయాత్రలో పలుమార్లు ఆయన్ను కలిసి మా బాధలు విన్నవించుకున్నాం. మేమంతా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏడేళ్లుగా పనిచేస్తున్నాం. గతంలో ఉండే రెగ్యులర్ డ్రాయింగ్, క్రాఫ్ట్ టీచర్ల స్థానంలో మేము పనిచేస్తున్నా వేతనాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దివంగత సీఎం వైఎస్సార్ మాదిరిగా ఆయన తనయుడు జగన్ ముఖ్యమంత్రిగా మా జీవితాలకు దారి చూపిస్తారని కోరుతున్నాం.
– ఎస్.శివకుమారిరెడ్డి, రాష్ట్ర ఆర్ట్, క్రాఫ్ట్, పీఈటీ అసోసియేషన్ అధ్యక్షురాలు
Comments
Please login to add a commentAdd a comment