= సీట్లు భర్తీకాని వైనం
= తల్లిదండ్రుల్లో అవగాహనలేమి
= అడ్డంకులు సృష్టిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలు
= ఆర్టీఈ టాస్క్‌ఫోర్స్ సర్వేలో తేలిన నిజాలు
సాక్షి, బెంగళూరు : విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) అమల్లోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా పూర్తి స్థాయిలో ఫలితాలు దక్కడం లేదు. ఇందుకు ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యవైఖరితో పాటు ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యం స్వార్థపూరిత విధానాలే కారణమని ఆర్టీఈ టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన సర్వేలో తేలింది. ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో అన్‌ఎయిడెడ్ పాఠశాలల్లోని సీట్లలో 25 శాతం సీట్లను కేటాయించడం ఆర్టీఈలోని ముఖ్యమైన నిబంధన. దీని ప్రకారం రాష్ట్రంలో 1.50 లక్షల సీట్లు ఆర్టీఈ కింద అందుబాటులో ఉన్నాయి.
అయితే ఆర్టీఈ చట్టం అమల్లోకి వచ్చి రెండు ఏళ్లు పూర్తి కావస్తున్నా ఈ సీట్లూ పూర్తి స్థాయిలో భర్తీ కావడం లేదు. 2012-13 విద్యా ఏడాది 59 వేల సీట్లు, 2013-14 ఏడాది 37 వేల ఆర్టీఈ సీట్లలో పిల్లలు ఎవరూ చేరలేదు. ఇందుకు విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన లేకపోవడం కారణమని సర్వేలో తేలింది. స్థానిక బ్లాక్ ఎడ్యుకేషన్ అధికారి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని సర్వే తేల్చి చెప్పింది. ఇక ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యం కూడా విద్యార్థులను చేర్చుకునేందుకు సవాలక్ష అడ్డంకులుృష్టిస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఉపాధి కోసం వలస వచ్చివారి పిల్లలను నివాస ధ్రువీకరణ పత్రం లేదనే నెపంతో ఆర్టీఈ కింద తమ సంస్థలో చేర్చుకోవడానికి ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యం నిరాకరిస్తోందని సర్వేలో తేలింది. అయితే ఆర్టీఈ మూల సూత్రానికి ఇది విరుద్ధమని అధికారులు పేర్కొంటుండటం గమనార్హం. మరోవైపు ఆర్టీఈ కింద చేర్చుకున్న విద్యార్థులపై వివక్ష చూపుతూ పిల్లలను శారీరకంగా, మానసికంగా హింసించడం మూలంగా విద్యార్థులు మధ్యలోనే పాఠశాలను మానేస్తున్నట్లు సర్వేలో తేలింది. ఈ విధంగా ప్రవర్తించిన యాజమాన్యంపై న్యాయపరమైన చర్యలు చేపట్టడానికి అవసరమైన నిబంధనలు ‘ఆర్టీఈ’ చట్టం స్పష్టంగా పేర్కొన లేక పోవడం ప్రధాన లోపమని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు.
మెరుగు పడని మౌలిక సదుపాయాలు
ఆర్టీఈ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు ఆశించిన స్థాయిలో మెరుగు పడలేదని, అవసరమైన పరిమాణంలో ఉపాధ్యాయులు కూడా లేదని సర్వే తేల్చి చెప్పింది. ‘మౌలిక సదుపాయాలు, మానవవనరుల’ పరిశీలన కోసం సర్వేలో పాల్గొన్న అధికారులు బెంగళూరు అర్బన్, రూరల్, కోలారు, చిక్కబళాపుర, తుమకూరు, రామనగరం, శివమొగ్గ, దావణగెరె, చిత్రదుర్గ జిల్లాల్లో 83 పాఠశాలలను ఎంపిక చేసుకున్నాయి. ఇందులో 54 పాఠశాలలు ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యా అందడం లేదని సర్వే నివేదిక తేల్చి చెప్పింది.
36 స్కూళ్లల్లో స్కూల్ డెవలప్‌మెంట్, మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు కాలేదని సర్వేలో తేలింది. 23 పాఠశాలలకు ఆట స్థలాలు లేవని, తొమ్మిది పాఠశాలలు అమ్మాయిల కోసం ప్రత్యేక శౌచాలయాలను నిర్మించలేదని సర్వేలో తేలింది. ఈ విషయమై సర్వే కన్వీనర్ జీ. నరసింహారావు మాట్లాడుతూ... ‘రాష్ట్రంలో ఆర్టీఈ పకడ్బంధీగా అమలు కావడానికి చేపట్టాల్సిన విధానాలపై ఓ నివేదిక రూపొందించాం. దీనిని త్వరలోనే ప్రభుత్వానికి అందజేస్తాం. మౌలిక సదుపాయాల కొరత కూడా ఆర్టీఈ ఫలాలు పూర్తిస్థాయిలో అందకపోవడానికి కారణం’ అని పేర్కొన్నారు.
ఆర్టీఈ అభాసుపాలు
Published Thu, Dec 26 2013 4:33 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM
Advertisement
Advertisement