బల్లకట్టు చదువులు
బల్లకట్టుపై ప్రయాణం...ఒకే గదిలో ఐదు తరగతులకు విద్యా బోధన...అరకొర వసతులు..ఇవీ సంగం జాగర్లమూడి ఎస్టీ కాలనీ మండల పరిషత్ పాఠశాల విద్యార్థుల కష్టాలు... ఎన్ని చట్టాలు చేసినా..ఎందరు పాలకులు మారినా వీరి కష్టాలు మాత్రం తొలగిపోవటం లేదు.
►బడికి పోవాలంటే కాలువ దాటాల్సిందే
►ఐదు తరగతులకు ఓకే ఒక్క గది
►ఇవీ సంగం జాగర్లమూడి ఎస్టీ కాలనీ విద్యార్థుల కష్టాలు
తెనాలి మారీసుపేట :
►తెనాలి మండలం సంగం జాగర్లమూడిలోని కాలువ కట్టపై మూడు దశాబ్దాలుగా దాదాపు 70 ఎస్టీ కుటుంబాలు జీవిస్తున్నాయి.
►ప్రభుత్వం వీరికి ఆసరా చూపించనప్పటికీ,అక్కడి చిన్నారుల కోసం 2001 లో ప్రాథమిక పాఠశాలను ఏర్పాటు చేసింది.
►అప్పటి నుంచి పాఠశాలకు రావాలంటే బల్లకట్టుపై కొమ్మమూరు కాలువ దాటాల్సిందే. నిత్యం విద్యార్థులు సంగమేశ్వర స్వామి దేవస్థానం రోడ్డు నుంచి బల్లకట్టు ఎక్కి ఇవతల ఒడ్డుకు చేరుకుంటున్నారు.
►బల్లకట్టుతో ఇబ్బంది వస్తే మరో నాలుగు కిలోమీ టర్లు చుట్టు తిరిగి గరువుపాలెం మీదుగా పాఠశాలకు చేరుకోవాలి.
►ఇక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకూ ఈ పరిస్థితి ప్రాణసంకటంగానే ఉంది.
►పూరిపాకలో ఏర్పాటు చేసిన పాఠశాలలో రికార్డు లకు భద్రత లేకపోవటంతో తెనాలి-వైకుంఠపురం రోటరీ క్లబ్ ప్రతినిధులు 2013లో స్పందించి రేకులతో ఓ గదిని నిర్మించారు.
►ఈ ఒక్క గదిలోనే 1 నుంచి 5 వరకు చదివే చిన్నారులకు విద్యాబోధన చేయాల్సిన పరిస్థితి.
►గతంలో ఈ పాఠశాలకు గ్రామంలోనే స్థలం కేటాయించి భవన నిర్మాణం చేపడతామని అధికారులు చేసిన ప్రకటన ప్రకటనగానే మిగిలిపోయింది.
►పాఠశాలలో మొత్తం 33 మంది విద్యార్థులు ఉన్నారు. ఒకటి నుంచి ఐదు తరగతులకు ఇద్దరే ఉపాధ్యాయులు.
►విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలలో మరుగు దొడ్లు, రక్షిత మంచినీరు, గాలి, వెలుతురు ఉండేలా చూడాలి.
►విద్యార్థులకు ఆరోగ్య సమస్యలు లేకుండా వాతావరణం పరిశుభ్రంగా ఉండేలా చూడాలి.
►విద్యాశాఖ వద్ద నిధులున్నా ఇక్కడి విద్యార్థుల సంక్షేమంపై దృష్టి సారించటం లేదనే విమర్శలు వున్నాయి.
► గతంలో దాతల సహకారంతో నిర్మించిన ఒకే ఒక మరుగుదొడ్డి విద్యార్థులు, ఉపాధ్యాయుల అవసరాలు తీరుస్తోంది.
►ఇప్పటికైనా విద్యాశాఖాధికారులు స్పందించాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారు.