విద్యా ‘హక్కు’ ఉత్తదేనా?
యాచారం : విద్యా హక్కు చట్టం కాగితాలకే పరిమితమైంది. ప్రతి పిల్లవాడికీ చదువును హక్కుగా చేస్తూ రూపొందించిన చట్టం, దాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు క్షేత్రస్థాయిలో అధికారుల అశ్రద్ధతో అమలు కావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేకపోగా, చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలన్న నిబంధన అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందని ద్రాక్షగానే మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో లేక చదువులు అంతంతమాత్రంగా సాగుతున్నాయి. కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిద్దామంటే ఫీజులు దడ పుట్టిస్తున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు.
ఉచిత ప్రవేశాలు లేవు...
ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థలో యూకేజీ నుంచి పదో తరగతి వరకూ 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలని విద్యాహక్కు చట్టం నిర్దేశించింది. ఈ మేరకు పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు కల్పించాలని గతేడాది సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఈ నెల 12నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఒక్క విద్యార్థికి కూడ ఉచితంగా సీటు ఇచ్చిన దాఖలాల్లేవు.
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి కార్పొరేట్ స్కూల్‌లో 25 శాతం సీట్లు కేటాయిస్తే మండలంలో వివిధ గ్రామాల్లోని వెయ్యిమందికి పేద విద్యార్థులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మండలంలోని యాచారం, మాల్, నందివనపర్తి, నక్కర్తమేడి పల్లి, గునుగల్ తదితర గ్రామాల్లో పదికి పైగా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో కనీసం 300మంది నుంచి 500కి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీకిలో వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.