free seat
-
అట్టడుగు నుంచి ఐఐటీ... దాతలు కరుణిస్తే మేటి
ఆత్మకూర్ (ఎస్): తల్లిదండ్రులు పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూసిన ఓ విద్యార్థి.. వారిని కష్టాల నుంచి గట్టెక్కించాలనుకున్నాడు. అందుకు ఉత్తమ మార్గం చదువుకోవడమే అని భావించి ఉన్నతంగా చదివాడు. ఫలితంగా ఐఐటీ ఖరగ్‌పూర్‌లో సీటు సాధించాడు. అయితే చదువుకోవడానికి డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నాడు. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండల పరిధిలోని తుమ్మలపెన్‌పహాడ్ గ్రామానికి చెందిన పిడమర్తి ప్రసాద్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆయన కుమారుడు అనిల్‌కుమార్‌కు ఖరగ్‌పూర్ ఐఐటీ కాలేజీలో ఉచిత సీటు లభించింది. అయితే, అందులో చదువుకోడానికి ప్రతి సెమిస్టర్‌కు రూ.35 వేల చొప్పున ఏడాదికి రూ.70 వేల వరకు ఖర్చు అవుతుంది. మొత్తం నాలుగేళ్ల కోర్సులో అంతమొత్తం ఖర్చులు భరించలేమని కాలేజీలో జాయిన్ కావడానికి ఇబ్బంది పడుతున్నాడు. కోవిడ్ కారణంగా ప్రస్తుతం ఆన్లైన్ క్లాస్‌లు జరుగుతున్నందున.. కనీసం ల్యాప్‌టాప్ కూడా కొనలేని పరిస్థితిలో ఉన్నాడు. తండ్రి పారిశుద్ధ్య కార్మికుడిగా చాలీచాలని జీతంతో పనిచేస్తుండడంతో చదువు కొనసాగడానికి అనిల్ దాతల సహాయాన్ని కోరుతున్నాడు. దాతలు సహకరిస్తే తన కుమారుడిని ఉన్నత చదువులు చదివిస్తానని ప్రసాద్ అంటున్నాడు. 9014154250 నంబర్‌కు గూగుల్‌పే ద్వారా గానీ, 40537593456 అకౌంట్‌కు (ఎస్బీఐఎన్ 0008810) గానీ ఆర్థిక సహాయం అందించాలని కోరుతున్నారు. -
సదువైన బందు చేస్త గాని, బాసరకు పొయ్యేది లేదు..
వర్ధెల్లి అరుణాకృష్ణ, సాక్షి, సూర్యాపేట తండ్రి రోజు కూలీగా పని చేశాడు... కొడుకు మాత్రం మట్టిలో మాణిక్యంలా మెరిశాడు. తాను తెచ్చుకున్న మార్కులకు ట్రిపుల్ ఐటీలో ఉచిత సీటు వస్తుందన్నా వద్దన్నాడు. ఇష్టపడి చదివి మరీ, ఐఐటీలో అఖిల భారత స్థాయిలో 229వ ర్యాంకు సాధించాడు. చదువు పూర్తి అయ్యీ కాకుండానే క్యాంపస్ సెలక్షన్లో ఒరాకిల్ కంపెనీ దాదాపు ఎనభై లక్షల రూపాయల వార్షిక వేతనంతో ఆస్ట్రేలియాలోని తన సంస్థలో ఉద్యోగమిచ్చేలా చేసుకున్నాడు నసీర్. అక్షర కృషీవలుడైన నసీర్‌ను ప్రయోజకుడిని చేసేందుకు తల్లితండ్రులు జమాలుద్దీన్- రహిమున్నీసాలు తాము పడ్డ కష్టాలను వివరించారిలా... ‘‘మాది నల్గొండ జిల్లా అర్వపల్లి మండలం కోడూరు. ఊరిలో కొద్దిగా కొండ్ర ఉంది. కాని, అందుల పంట తీసే పరిస్థితి లేదు. అందుకే 1992లో పొట్ట చేతబట్టుకుని సూర్యాపేట చేరుకున్నాం. నేను, నా భార్య, ముగ్గురు పిల్లలమూ కలిసి ఒక చిన్న ఇంట్లో కిరాయికి ఉన్నం. దినసరి కూలీగా ఓ పూట పస్తులుంటూ, మరో పూట పెడుతూ, మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదని వాళ్లని ఎట్లాగో అట్లా బళ్లో వేశా. నసీర్ చిన్నప్పటి సంది బాగా సదివేటోడు. గది చూసి వాడి ఇస్కూలు మేస్టర్లే వాడిని నవోదయ ఇస్కూల్లో ఏసిండ్రు. కష్టపడి సదివి పదో తర్గతిల 587 మార్కులు తెచ్చుకున్నడు. ఆ మార్కుల్కి బాసర ఐఐటీ కాలేజీల ఉచిత సీటు వస్తదన్నరు సార్లు. కాని, ఆడు అందుకు ఒప్పుకోలా. సదువైన బందు చేస్త గాని, బాసరకు పొయ్యేది లేదన్నడు. మొదుల్నించి ప్రోత్సహిస్తా వచ్చిన లింగారెడ్డి సారే ఆడిని తీస్కపోయి, హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీల చేర్పించిండు. వాళ్లు సుతా నసీరుకు సానా టెస్టులయ్యీ పెట్టి, అందులో నె గ్గినంక ఇంటర్ నుంచి ఐఐటీ-జేయీయీల ఫిరీ సీటిచ్చిన్రు. నసీరు ఏనాడూ నాకు అవ్వి కావాలనీ, ఇవ్వి కావాలనీ సతాయించెటోడు కాదు. ఆస్టల్ల ఏది పెడితే అది తినెటోడు. లింగారెడ్డి సారే, ఆడికి కావలసిన కితాబులు కొనిచ్చెటోడు. కష్టపడి సద్వి ఇంటర్ల 969 మార్కులు దెచ్చుకుండు. అది అయిపోతల్నే, ఐఐటీ టెస్టు రాసి, అందుల సుత మంచి ర్యాంకు తెచ్చుకున్నడు. కాని, సదివిపిచ్చేటందుకు సమచ్చరాన్కి లక్షా ఇర్వై వేలు అయితదన్నడు. నా కాడ అన్ని పైసల్లేవని చేతులెత్తేసిన. లింగారెడ్డి సారు వచ్చి, మీడియా ద్వారా దాతల సాయం కోరేందుకు ప్రయత్నిస్తనని చెప్పిండు. గట్లనే నాల్గు సంవత్సరాలు దాతల సాయంతోనే ఐఐటీ కాన్పూర్‌ల సద్వు పూర్తి చేసిండు. అంద్ల కూడ మంచి ర్యాంకు తెచ్చుకుండు. క్యాంపస్ సెలక్షన్ల గదేదో ఒరాకిలు కంపెనీ అంట. అంద్ల సమచ్చరానికి డెబ్బయి తొమ్మిది లక్షల జీతమిచ్చే నౌకరి దెచ్చుకుండు. అంతా వాడి కష్టం.. భగమంతుని దయ! ప్రతిభ ఉన్నవారికి పేదరికం ప్రతిబంధకం కాదన్నది నా నమ్మకం. దాన్ని రుజువు చేస్తూ నన్ను మొదటినుంచీ ప్రోత్సహిస్తూ వచ్చారు నవోదయ స్కూలు కరస్పాండెంటు మారం లింగారెడ్డి సార్, మరికొందరు మంచి మనుషులు. వారికి జీవితాంతం రుణపడి ఉంటా! ఈ సమాజం నాకిచ్చిన సహకారాన్ని గుర్తుచేసుకొని తిరిగి సమాజానికిస్తా. ప్రతిభ ఉండీ పేదరికంతో ఉన్నత చదువులకు దూరం అవుతున్న నాలాంటి పేద విద్యార్థులకు తప్పక సాయం చేస్తా! - షేక్ నసీర్ -
విద్యా ‘హక్కు’ ఉత్తదేనా?
యాచారం : విద్యా హక్కు చట్టం కాగితాలకే పరిమితమైంది. ప్రతి పిల్లవాడికీ చదువును హక్కుగా చేస్తూ రూపొందించిన చట్టం, దాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్న సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలు క్షేత్రస్థాయిలో అధికారుల అశ్రద్ధతో అమలు కావడం లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో కనీస వసతులు లేకపోగా, చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ప్రైవేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలన్న నిబంధన అమలుకు నోచుకోవడం లేదు. ఫలితంగా పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందని ద్రాక్షగానే మారింది. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో లేక చదువులు అంతంతమాత్రంగా సాగుతున్నాయి. కార్పొరేట్ స్కూళ్లలో చేర్పిద్దామంటే ఫీజులు దడ పుట్టిస్తున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఉచిత ప్రవేశాలు లేవు... ప్రతి ప్రైవేట్ విద్యా సంస్థలో యూకేజీ నుంచి పదో తరగతి వరకూ 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించాలని విద్యాహక్కు చట్టం నిర్దేశించింది. ఈ మేరకు పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో ఉచిత ప్రవేశాలు కల్పించాలని గతేడాది సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఈ నెల 12నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు ఒక్క విద్యార్థికి కూడ ఉచితంగా సీటు ఇచ్చిన దాఖలాల్లేవు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రతి కార్పొరేట్ స్కూల్లో 25 శాతం సీట్లు కేటాయిస్తే మండలంలో వివిధ గ్రామాల్లోని వెయ్యిమందికి పేద విద్యార్థులు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. మండలంలోని యాచారం, మాల్, నందివనపర్తి, నక్కర్తమేడి పల్లి, గునుగల్ తదితర గ్రామాల్లో పదికి పైగా ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయి. ఒక్కో పాఠశాలలో కనీసం 300మంది నుంచి 500కి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. వీకిలో వ్యవసాయ కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారు.