సదువైన బందు చేస్త గాని, బాసరకు పొయ్యేది లేదు.. | Nasir Campus Selection of Oracle Company | Sakshi
Sakshi News home page

సదువైన బందు చేస్త గాని, బాసరకు పొయ్యేది లేదు..

Published Fri, Dec 5 2014 10:39 PM | Last Updated on Tue, Aug 27 2019 4:36 PM

సదువైన బందు చేస్త గాని, బాసరకు పొయ్యేది లేదు.. - Sakshi

సదువైన బందు చేస్త గాని, బాసరకు పొయ్యేది లేదు..

వర్ధెల్లి అరుణాకృష్ణ, సాక్షి, సూర్యాపేట   తండ్రి రోజు కూలీగా పని చేశాడు... కొడుకు మాత్రం మట్టిలో మాణిక్యంలా మెరిశాడు. తాను తెచ్చుకున్న మార్కులకు ట్రిపుల్ ఐటీలో ఉచిత సీటు వస్తుందన్నా వద్దన్నాడు. ఇష్టపడి చదివి మరీ, ఐఐటీలో అఖిల భారత స్థాయిలో 229వ ర్యాంకు సాధించాడు. చదువు పూర్తి అయ్యీ కాకుండానే క్యాంపస్ సెలక్షన్‌లో ఒరాకిల్ కంపెనీ దాదాపు ఎనభై లక్షల రూపాయల వార్షిక వేతనంతో ఆస్ట్రేలియాలోని తన సంస్థలో ఉద్యోగమిచ్చేలా చేసుకున్నాడు నసీర్. అక్షర కృషీవలుడైన నసీర్‌ను ప్రయోజకుడిని చేసేందుకు తల్లితండ్రులు జమాలుద్దీన్- రహిమున్నీసాలు తాము పడ్డ కష్టాలను వివరించారిలా...

‘‘మాది నల్గొండ జిల్లా అర్వపల్లి మండలం కోడూరు. ఊరిలో కొద్దిగా కొండ్ర ఉంది. కాని, అందుల పంట తీసే పరిస్థితి లేదు. అందుకే 1992లో పొట్ట చేతబట్టుకుని సూర్యాపేట చేరుకున్నాం. నేను, నా భార్య, ముగ్గురు పిల్లలమూ కలిసి ఒక చిన్న ఇంట్లో కిరాయికి ఉన్నం. దినసరి కూలీగా ఓ పూట పస్తులుంటూ, మరో పూట పెడుతూ, మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదని వాళ్లని ఎట్లాగో అట్లా బళ్లో వేశా. నసీర్ చిన్నప్పటి సంది బాగా సదివేటోడు. గది చూసి వాడి ఇస్కూలు మేస్టర్లే వాడిని నవోదయ ఇస్కూల్లో ఏసిండ్రు. కష్టపడి సదివి పదో తర్గతిల 587 మార్కులు తెచ్చుకున్నడు. ఆ మార్కుల్కి బాసర ఐఐటీ కాలేజీల ఉచిత సీటు వస్తదన్నరు సార్లు. కాని, ఆడు అందుకు ఒప్పుకోలా. సదువైన బందు చేస్త గాని, బాసరకు పొయ్యేది లేదన్నడు. మొదుల్నించి ప్రోత్సహిస్తా వచ్చిన లింగారెడ్డి సారే ఆడిని తీస్కపోయి, హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీల చేర్పించిండు. వాళ్లు సుతా నసీరుకు సానా టెస్టులయ్యీ పెట్టి, అందులో నె గ్గినంక ఇంటర్ నుంచి ఐఐటీ-జేయీయీల ఫిరీ సీటిచ్చిన్రు.

నసీరు ఏనాడూ నాకు అవ్వి కావాలనీ, ఇవ్వి కావాలనీ సతాయించెటోడు కాదు. ఆస్టల్ల ఏది పెడితే అది తినెటోడు.  లింగారెడ్డి సారే, ఆడికి కావలసిన కితాబులు కొనిచ్చెటోడు. కష్టపడి సద్వి ఇంటర్ల 969 మార్కులు దెచ్చుకుండు. అది అయిపోతల్నే, ఐఐటీ టెస్టు రాసి, అందుల సుత మంచి ర్యాంకు తెచ్చుకున్నడు. కాని, సదివిపిచ్చేటందుకు సమచ్చరాన్కి లక్షా ఇర్వై వేలు అయితదన్నడు. నా కాడ అన్ని పైసల్లేవని చేతులెత్తేసిన. లింగారెడ్డి సారు వచ్చి, మీడియా ద్వారా దాతల సాయం కోరేందుకు ప్రయత్నిస్తనని చెప్పిండు. గట్లనే నాల్గు సంవత్సరాలు దాతల సాయంతోనే ఐఐటీ కాన్పూర్ల సద్వు పూర్తి చేసిండు. అంద్ల కూడ మంచి ర్యాంకు తెచ్చుకుండు. క్యాంపస్ సెలక్షన్ల గదేదో ఒరాకిలు కంపెనీ అంట. అంద్ల సమచ్చరానికి డెబ్బయి తొమ్మిది లక్షల జీతమిచ్చే నౌకరి దెచ్చుకుండు. అంతా వాడి కష్టం.. భగమంతుని దయ!
    
ప్రతిభ ఉన్నవారికి పేదరికం ప్రతిబంధకం కాదన్నది నా నమ్మకం. దాన్ని రుజువు చేస్తూ నన్ను మొదటినుంచీ ప్రోత్సహిస్తూ వచ్చారు నవోదయ స్కూలు కరస్పాండెంటు మారం లింగారెడ్డి సార్, మరికొందరు మంచి మనుషులు. వారికి జీవితాంతం రుణపడి ఉంటా! ఈ సమాజం నాకిచ్చిన సహకారాన్ని గుర్తుచేసుకొని తిరిగి సమాజానికిస్తా. ప్రతిభ ఉండీ పేదరికంతో ఉన్నత చదువులకు దూరం అవుతున్న నాలాంటి పేద విద్యార్థులకు తప్పక సాయం చేస్తా!
 
- షేక్ నసీర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement