కోలీవుడ్ నటుడు విశాల్‌పై(Vishal) దుష్ప్రచారం చేసిన తమిళ యూట్యూబర్ సెగురాపై కేసు నమోదు అయింది. తన యూట్యూబ్ ఛానెల్‌లపై దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడు నాజర్(Nasir) తాజాగా చెన్నైలోని తేనాంపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు పోలీసులు చర్యలు తీసుకోనున్నారు. విశాల్ నటించిన మదగజరాజా థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతోంది. సినిమా విడుదల సమయంలో పాత్రికేయుల సమావేశంలో పాల్గొన్న నటుడు విశాల్ అస్వస్థతకు గురయ్యారు. ‘మదగజరాజ’ (Madha Gaja Raja) ఈవెంట్‌లో ఆయన వణుకుతూ కనిపించారు. దీంతో ఆయనకు ఏమైందోనని అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే.
(ఇదీ చదవండి: ఓటీటీలో రియల్ పొలిటికల్ థ్రిల్లర్ సినిమా.. సడెన్‌గా తెలుగులో స్ట్రీమింగ్)
'మదగజరాజ' సినిమా 11 ఏళ్ల తర్వాత రిలీజ్ విడుదలకు మోక్షం రావడంతో విశాల్ తన అనారోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా ఈవెంట్‌కు వచ్చారు. ఆ రోజు విశాల్ డెంగీ ఫీవర్‌తో బాధపడుతున్నారు. 103 డిగ్రీల జ్వరం కారణంగా వేదికపైనే మైక్ పట్టుకుని ఆయన వణికిపోయారు. అయితే, విశాల్ ఆరోగ్య పరిస్థితి గురించి చెప్పినా కూడా కొంతమంది యూట్యూబర్స్ వ్యూస్ కోసం ఆయన ఆరోగ్యంపై తప్పుడు వార్తలు రాశారు. అందువల్ల అలాంటి వారిపై కేసు నమోదు చేశారు.
విశాల్‌పై యూట్యూబర్స్ చేసిన కామెంట్స్
విశాల్‌పై తప్పుడు ప్రచారం చేసిన యూట్యూబర్స్ మీద నటుడు నాజర్ కేసు పెట్టారు. వారు చేసిన కామెంట్స్ ఇలా ఉన్నాయి. 'నటుడు విశాల్‌కు మద్యానికి బానిస కావడం వల్ల ఆయన శారీరక బలహీనతకు గురయ్యారు. ఆయన చేతులు, కాళ్ళలో వణుకు రావడం వెనుక ఒక బలమైన జబ్బు ఉంది. త్వరలో ఆయన మరింత బలహీనపడుతాడు. భవిష్యత్‌లో చిత్ర పరిశ్రమకు విశాల్ దూరం కావచ్చు. ఆయనతో నటించేందుకు ఎవరూ ఇష్టపడరు.' అని నిరాధారమైన, విశాల్ పరువు నష్టం కలిగించేలా వ్యాఖ్యలు చేశారు. నటుడు నాజర్ ఫిర్యాదుతో పరువు నష్టం, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సహా మూడు సెక్షన్ల కింద సెగురాతో పాటు రెండు యూట్యూబ్ ఛానెల్స్‌పై కేసు నమోదు చేశారు.
తెలుగులో కూడా విడుదల
విశాల్ హీరోగా సుందర్.సి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మదగజరాజ’. సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోలీవుడ్‌లో సంక్రాంతి విన్నర్‌గా ఈ చిత్రం నిలిచింది. బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 100 కోట్ల వరకు ఇప్పటికే కలెక్ట్ చేసింది. అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్ కథానాయికలుగా ఇందులో నటించారు. దాదాపు 11 ఏళ్ల తర్వాత ఈ సినిమా విడుదల కావడంతో ఆయన అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. తెలుగులో కూడా జనవరి 31న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment