Nasir
-
ప్రముఖ పాటల రచయిత కన్నుమూత
బాలీవుడ్ ప్రముఖ సినీ పాటల రచయిత నాసిర్ ఫరాజ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. గతంలో ఆయనకు ఏడేళ్ల క్రితం సర్జరీ కూడా జరిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ఛాతినొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సింగర్ ముజాబా అజీజ్ తెలిపారు. బాలీవుడ్ సినిమాలు కైట్స్, క్రిష్, బాజీరావ్ మస్తానీ, కాబిల్ వంటి సినిమాలకు సూపర్ హిట్ సాంగ్స్ రాశారు. ఆయన మృతితో బాలీవుడ్ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పించారు. -
రిక్రూట్మెంట్ సెల్ నడుపుతున్నాడా?
నసీర్ కార్యకలాపాలపై పోలీసుల అనుమానం పాస్‌పోర్టుల కోసం లక్షలు చెల్లించిన వైనం వాచ్‌మన్‌గా ఉంటూ గుట్టుచప్పుడు కాకుండా దందా నసీర్తో పాటు ఐదుగురి కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్ సాక్షి, హైదరాబాద్ (సిటీబ్యూరో): నిషేధిత ఉగ్రవాద సంస్థ హర్కత్ ఉల్ జీహాది అల్ ఇస్లామి(హుజీ) సంస్థ సభ్యుల నియామకం హైదరాబాద్ కేంద్రంగా జరుగుతోందని పోలీసులు నిర్థారణకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈనెల 14న నగర పోలీసులకు చిక్కిన పాకిస్తానీ మహమ్మద్ నసీరే...దీనికి కర్త, క్రియ అని భావిస్తున్నారు. చంచల్‌గూడ జైలు సమీపంలోని ఎంఎం జిరాక్స్ సెంటర్ వద్ద దొరికిన డాక్యుమెంట్ల ఆధారంగా ఇతను 15 మందికి పాస్‌పోర్టులు ఇప్పించి దేశం దాటించాడని తేలడంతో పోలీసులు ఈ విధంగా అనుమానిస్తున్నారు. వీరికి భారీ మొత్తంలో డబ్బు ఎరజూపడమే కాకుండా...లక్షలు వెచ్చించి మరీ పాస్‌పోర్టులు ఇప్పించాడు. ఉద్యోగ వీసాలపై దుబాయ్‌కు పంపిస్తున్నట్టు చెబుతున్నా...వారిని అక్కడి నుంచి పాకిస్తాన్‌కు తరలించినట్టు పోలీసులు భావిస్తున్నారు. హుజీ సంస్థలో వీరిని చేర్చుకునేందుకు...చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడేందుకు 'ఉగ్ర' తరహాలో శిక్షణ ఇస్తున్నట్టుగా భావిస్తున్నారు. వాచ్‌మన్ అవతారం... ఐదు నెలల క్రితం నగరానికి వచ్చిన నసీర్.. తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు...పోలీసు నిఘా లేని ప్రాంతాలను ఎంచుకున్నాడు. ఈ సమయంలోనే బాలాపూర్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సొహైల్ పర్వేజ్ ఖాన్‌తో పరిచయమైంది. అక్కడి యునాని ఆస్పత్రిలో వాచ్‌మన్ ఉద్యోగం ఉందని తెలుసుకున్న నసీర్...సొహైల్ సహాకారంతో అక్కడ విధుల్లో చేరాడు. ఆస్పత్రి నిర్వాహకులు అతడికి అక్కడే చిన్నపాటి గది కేటాయించడంతో మూడు నెలల పాటు సాఫీగా ప్రయాణం సాగింది. ఉదయం వేళలో కొన్ని గంటల పాటు బయటకు వెళ్లి 'సొంత' పని చేసుకునేవాడు. అందరితో మర్యాదపూర్వకంగా మెలిగి ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా చూసుకున్నాడు. నెలక్రితం సోహైల్, అతని బావ మహమ్మద్ మసూద్ అలీ ఖాన్ సహకారంతో చంచల్‌గూడ సమీపంలోని ఒక ఫ్లాట్‌కు మారాడు. ఇక్కడికొచ్చి నెలకూడా గడవకముందే పోలీసులకు దొరికిపోయాడు. ఏజెంట్ సహకారంతో పాస్‌పోర్టు... వాచ్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న నసీర్‌కు హవాలా ద్వారా లక్షల రూపాయాలు అందేవి. ఇతర దేశాల నుంచి అక్రమంగా వలసవచ్చి కడుబీదరికంలో బతుకుతున్న వారిని లక్ష్యంగా చేసుకునేవాడు. నసీర్‌కు బంగ్లాదేశ్‌కు చెందిన నూర్, హషీమ్‌తో పరిచయం ఏర్పడింది. వీరంతా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో యువకులను జీహాది సాహిత్యం నూరిపోయడంతో పాటు దుబాయ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికేవారు. తాము కొంచెం ప్రోత్సహిస్తే చాలు...హుజీ సంస్థలో సభ్యులుగా చేరిపోతారని అనుకున్న వాళ్లకు పాస్‌పోర్టులు ఇప్పించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, నసీర్ పాస్‌పోర్టు కోసం తొలిసారి దరఖాస్తు చేసినప్పుడు హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు తిరస్కరించారు. పాస్‌పోర్టు ఏజెంట్ మహమ్మద్ మసూద్ అలీ సహకారంతో మరోసారి దరఖాస్తు చేస్తే క్లియరెన్స్ వచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. పాస్‌పోర్టు వెరిఫికేషన్ సెల్‌లోని కొంతమంది అధికారులు లంచం తీసుకుని నసీర్ పాస్‌పోర్టును క్లియర్ చేసినట్టుగా దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో పాత్ర ఉన్న ఇద్దరు పాస్‌పోర్టు అధికారులపై పోలీసులు మరో రెండు రోజుల్లో చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఎస్బీ సిబ్బందిని కూడా సీసీఎస్ పోలీసులు సోమవారం పిలిచి మాట్లాడారు. కస్టడీ కోరుతూ పిటిషన్... నసీర్తో సహా పట్టుబడిన ఆరుగురు అనుమానితుల్నీ లోతుగా విచారించాలని సీసీఎస్ ఆధీనంలోని సిట్ అధికారులు నిర్ణయించారు. ఇందు కోసం వారిని తమ కస్టడీలోకి తీసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండు వారాలా పాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది. కాగా, నసీర్ భార్య హబియా కటూన్ను కూడా సీసీఎస్ పోలీసులు విచారించినట్టు తెలుస్తోంది. అసాంఘిక కార్యకలాపాల్లో ఆమె పాత్ర ఉందా? లేదా? అనేది నిర్థారించడంపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు. -
సదువైన బందు చేస్త గాని, బాసరకు పొయ్యేది లేదు..
వర్ధెల్లి అరుణాకృష్ణ, సాక్షి, సూర్యాపేట తండ్రి రోజు కూలీగా పని చేశాడు... కొడుకు మాత్రం మట్టిలో మాణిక్యంలా మెరిశాడు. తాను తెచ్చుకున్న మార్కులకు ట్రిపుల్ ఐటీలో ఉచిత సీటు వస్తుందన్నా వద్దన్నాడు. ఇష్టపడి చదివి మరీ, ఐఐటీలో అఖిల భారత స్థాయిలో 229వ ర్యాంకు సాధించాడు. చదువు పూర్తి అయ్యీ కాకుండానే క్యాంపస్ సెలక్షన్లో ఒరాకిల్ కంపెనీ దాదాపు ఎనభై లక్షల రూపాయల వార్షిక వేతనంతో ఆస్ట్రేలియాలోని తన సంస్థలో ఉద్యోగమిచ్చేలా చేసుకున్నాడు నసీర్. అక్షర కృషీవలుడైన నసీర్‌ను ప్రయోజకుడిని చేసేందుకు తల్లితండ్రులు జమాలుద్దీన్- రహిమున్నీసాలు తాము పడ్డ కష్టాలను వివరించారిలా... ‘‘మాది నల్గొండ జిల్లా అర్వపల్లి మండలం కోడూరు. ఊరిలో కొద్దిగా కొండ్ర ఉంది. కాని, అందుల పంట తీసే పరిస్థితి లేదు. అందుకే 1992లో పొట్ట చేతబట్టుకుని సూర్యాపేట చేరుకున్నాం. నేను, నా భార్య, ముగ్గురు పిల్లలమూ కలిసి ఒక చిన్న ఇంట్లో కిరాయికి ఉన్నం. దినసరి కూలీగా ఓ పూట పస్తులుంటూ, మరో పూట పెడుతూ, మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదని వాళ్లని ఎట్లాగో అట్లా బళ్లో వేశా. నసీర్ చిన్నప్పటి సంది బాగా సదివేటోడు. గది చూసి వాడి ఇస్కూలు మేస్టర్లే వాడిని నవోదయ ఇస్కూల్లో ఏసిండ్రు. కష్టపడి సదివి పదో తర్గతిల 587 మార్కులు తెచ్చుకున్నడు. ఆ మార్కుల్కి బాసర ఐఐటీ కాలేజీల ఉచిత సీటు వస్తదన్నరు సార్లు. కాని, ఆడు అందుకు ఒప్పుకోలా. సదువైన బందు చేస్త గాని, బాసరకు పొయ్యేది లేదన్నడు. మొదుల్నించి ప్రోత్సహిస్తా వచ్చిన లింగారెడ్డి సారే ఆడిని తీస్కపోయి, హైదరాబాద్ శ్రీచైతన్య కాలేజీల చేర్పించిండు. వాళ్లు సుతా నసీరుకు సానా టెస్టులయ్యీ పెట్టి, అందులో నె గ్గినంక ఇంటర్ నుంచి ఐఐటీ-జేయీయీల ఫిరీ సీటిచ్చిన్రు. నసీరు ఏనాడూ నాకు అవ్వి కావాలనీ, ఇవ్వి కావాలనీ సతాయించెటోడు కాదు. ఆస్టల్ల ఏది పెడితే అది తినెటోడు. లింగారెడ్డి సారే, ఆడికి కావలసిన కితాబులు కొనిచ్చెటోడు. కష్టపడి సద్వి ఇంటర్ల 969 మార్కులు దెచ్చుకుండు. అది అయిపోతల్నే, ఐఐటీ టెస్టు రాసి, అందుల సుత మంచి ర్యాంకు తెచ్చుకున్నడు. కాని, సదివిపిచ్చేటందుకు సమచ్చరాన్కి లక్షా ఇర్వై వేలు అయితదన్నడు. నా కాడ అన్ని పైసల్లేవని చేతులెత్తేసిన. లింగారెడ్డి సారు వచ్చి, మీడియా ద్వారా దాతల సాయం కోరేందుకు ప్రయత్నిస్తనని చెప్పిండు. గట్లనే నాల్గు సంవత్సరాలు దాతల సాయంతోనే ఐఐటీ కాన్పూర్‌ల సద్వు పూర్తి చేసిండు. అంద్ల కూడ మంచి ర్యాంకు తెచ్చుకుండు. క్యాంపస్ సెలక్షన్ల గదేదో ఒరాకిలు కంపెనీ అంట. అంద్ల సమచ్చరానికి డెబ్బయి తొమ్మిది లక్షల జీతమిచ్చే నౌకరి దెచ్చుకుండు. అంతా వాడి కష్టం.. భగమంతుని దయ! ప్రతిభ ఉన్నవారికి పేదరికం ప్రతిబంధకం కాదన్నది నా నమ్మకం. దాన్ని రుజువు చేస్తూ నన్ను మొదటినుంచీ ప్రోత్సహిస్తూ వచ్చారు నవోదయ స్కూలు కరస్పాండెంటు మారం లింగారెడ్డి సార్, మరికొందరు మంచి మనుషులు. వారికి జీవితాంతం రుణపడి ఉంటా! ఈ సమాజం నాకిచ్చిన సహకారాన్ని గుర్తుచేసుకొని తిరిగి సమాజానికిస్తా. ప్రతిభ ఉండీ పేదరికంతో ఉన్నత చదువులకు దూరం అవుతున్న నాలాంటి పేద విద్యార్థులకు తప్పక సాయం చేస్తా! - షేక్ నసీర్