రిక్రూట్‌మెంట్ సెల్ నడుపుతున్నాడా? | police investigates nasir had any recrutement cell in hyderabad | Sakshi
Sakshi News home page

రిక్రూట్‌మెంట్ సెల్ నడుపుతున్నాడా?

Published Tue, Aug 18 2015 7:53 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 AM

రిక్రూట్‌మెంట్ సెల్ నడుపుతున్నాడా?

రిక్రూట్‌మెంట్ సెల్ నడుపుతున్నాడా?

  •     నసీర్ కార్యకలాపాలపై పోలీసుల అనుమానం
  •      పాస్‌పోర్టుల కోసం లక్షలు చెల్లించిన వైనం
  •      వాచ్‌మన్‌గా ఉంటూ గుట్టుచప్పుడు కాకుండా దందా
  •      నసీర్‌తో పాటు ఐదుగురి కస్టడీ కోరుతూ కోర్టులో పిటిషన్
  • సాక్షి, హైదరాబాద్ (సిటీబ్యూరో): నిషేధిత ఉగ్రవాద సంస్థ హర్కత్ ఉల్ జీహాది అల్ ఇస్లామి(హుజీ) సంస్థ సభ్యుల నియామకం హైదరాబాద్ కేంద్రంగా జరుగుతోందని పోలీసులు నిర్థారణకు వచ్చినట్టు తెలుస్తోంది. ఈనెల 14న నగర పోలీసులకు చిక్కిన పాకిస్తానీ మహమ్మద్ నసీరే...దీనికి కర్త, క్రియ అని భావిస్తున్నారు.

    చంచల్‌గూడ జైలు సమీపంలోని ఎంఎం జిరాక్స్ సెంటర్ వద్ద దొరికిన డాక్యుమెంట్ల ఆధారంగా ఇతను 15 మందికి పాస్‌పోర్టులు ఇప్పించి దేశం దాటించాడని తేలడంతో  పోలీసులు ఈ విధంగా అనుమానిస్తున్నారు. వీరికి భారీ మొత్తంలో డబ్బు ఎరజూపడమే కాకుండా...లక్షలు వెచ్చించి మరీ పాస్‌పోర్టులు ఇప్పించాడు. ఉద్యోగ వీసాలపై దుబాయ్‌కు పంపిస్తున్నట్టు చెబుతున్నా...వారిని అక్కడి నుంచి పాకిస్తాన్‌కు తరలించినట్టు పోలీసులు భావిస్తున్నారు. హుజీ సంస్థలో వీరిని చేర్చుకునేందుకు...చట్ట వ్యతిరేక కార్యకలాపాలు పాల్పడేందుకు 'ఉగ్ర' తరహాలో శిక్షణ ఇస్తున్నట్టుగా భావిస్తున్నారు.  

     వాచ్‌మన్  అవతారం...
     ఐదు నెలల క్రితం నగరానికి వచ్చిన నసీర్.. తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు...పోలీసు నిఘా లేని ప్రాంతాలను ఎంచుకున్నాడు. ఈ సమయంలోనే బాలాపూర్‌లో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న సొహైల్ పర్వేజ్ ఖాన్‌తో పరిచయమైంది. అక్కడి యునాని ఆస్పత్రిలో వాచ్‌మన్ ఉద్యోగం ఉందని తెలుసుకున్న నసీర్...సొహైల్ సహాకారంతో అక్కడ విధుల్లో చేరాడు.

    ఆస్పత్రి నిర్వాహకులు అతడికి అక్కడే చిన్నపాటి గది కేటాయించడంతో మూడు నెలల పాటు సాఫీగా ప్రయాణం సాగింది. ఉదయం వేళలో కొన్ని గంటల పాటు బయటకు వెళ్లి 'సొంత' పని చేసుకునేవాడు. అందరితో మర్యాదపూర్వకంగా మెలిగి ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా చూసుకున్నాడు. నెలక్రితం సోహైల్, అతని బావ మహమ్మద్ మసూద్ అలీ ఖాన్  సహకారంతో చంచల్‌గూడ సమీపంలోని ఒక ఫ్లాట్‌కు మారాడు. ఇక్కడికొచ్చి నెలకూడా గడవకముందే పోలీసులకు దొరికిపోయాడు.

     ఏజెంట్ సహకారంతో పాస్‌పోర్టు...
     వాచ్‌మన్‌గా విధులు నిర్వహిస్తున్న నసీర్‌కు హవాలా ద్వారా లక్షల రూపాయాలు అందేవి. ఇతర దేశాల నుంచి అక్రమంగా వలసవచ్చి కడుబీదరికంలో బతుకుతున్న వారిని లక్ష్యంగా చేసుకునేవాడు. నసీర్‌కు బంగ్లాదేశ్‌కు చెందిన నూర్, హషీమ్‌తో పరిచయం ఏర్పడింది. వీరంతా ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లో యువకులను జీహాది సాహిత్యం నూరిపోయడంతో పాటు దుబాయ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికేవారు. తాము కొంచెం ప్రోత్సహిస్తే చాలు...హుజీ సంస్థలో సభ్యులుగా చేరిపోతారని అనుకున్న వాళ్లకు పాస్‌పోర్టులు ఇప్పించినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

    కాగా, నసీర్ పాస్‌పోర్టు కోసం తొలిసారి దరఖాస్తు చేసినప్పుడు హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్ అధికారులు తిరస్కరించారు.  పాస్‌పోర్టు ఏజెంట్ మహమ్మద్ మసూద్ అలీ సహకారంతో మరోసారి దరఖాస్తు చేస్తే క్లియరెన్స్ వచ్చినట్టు పోలీసుల విచారణలో తేలింది. పాస్‌పోర్టు వెరిఫికేషన్ సెల్‌లోని కొంతమంది అధికారులు లంచం తీసుకుని నసీర్ పాస్‌పోర్టును క్లియర్ చేసినట్టుగా దర్యాప్తు అధికారులు అనుమానిస్తున్నారు. ఇందులో పాత్ర ఉన్న ఇద్దరు పాస్‌పోర్టు అధికారులపై పోలీసులు మరో రెండు రోజుల్లో చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అలాగే ఎస్‌బీ సిబ్బందిని కూడా సీసీఎస్ పోలీసులు సోమవారం పిలిచి మాట్లాడారు.

     కస్టడీ కోరుతూ పిటిషన్...
     నసీర్‌తో సహా పట్టుబడిన ఆరుగురు అనుమానితుల్నీ లోతుగా విచారించాలని సీసీఎస్ ఆధీనంలోని సిట్ అధికారులు నిర్ణయించారు. ఇందు కోసం వారిని తమ కస్టడీలోకి తీసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని సోమవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రెండు వారాలా పాటు కస్టడీకి ఇవ్వాలని కోరింది. కాగా, నసీర్ భార్య హబియా కటూన్‌ను కూడా సీసీఎస్ పోలీసులు విచారించినట్టు తెలుస్తోంది. అసాంఘిక కార్యకలాపాల్లో ఆమె పాత్ర ఉందా? లేదా? అనేది నిర్థారించడంపై దర్యాప్తు అధికారులు దృష్టి పెట్టారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement