‘పోలీస్‌ బోర్డు’ ద్వారా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల ఎంపిక   | Selection of RTC Driver and Conductor by Police Board | Sakshi
Sakshi News home page

‘పోలీస్‌ బోర్డు’ ద్వారా ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ల ఎంపిక  

Published Wed, May 1 2024 4:50 AM | Last Updated on Wed, May 1 2024 4:50 AM

Selection of RTC Driver and Conductor by Police Board

మూడు వేల ఖాళీల భర్తీకి ఇటీవల ఆర్టీసీ ప్రతిపాదన  

ఆర్థికశాఖ వద్ద ఫైల్‌.. త్వరలో ముఖ్యమంత్రి పరిశీలనకు 

ఆయన ఆమోదముద్ర వేయగానే ప్రక్రియ ప్రారంభం 

దశాబ్దాలుగా ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నియామకాలు  

సాక్షి, హైదరాబాద్‌: ‘పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు’ ద్వారా ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లను ఎంపిక చేయనున్నారు. ఆర్టీసీలో మూడు వేల ఖాళీల భర్తీకి ఇటీవల ఆ సంస్థ ప్రతిపాదించింది. ఆర్థికశాఖ వద్ద ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఆ ప్రతిపాదన ఎన్నికల కోడ్‌ ముగిశాక సీఎం పరిశీలనకు వెళుతుంది.

 దానికి ఆయన ఆమోదముద్ర వేయగానే ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు కు ఆర్టీసీ ఉద్యోగుల ఎంపిక బాధ్యత అప్పగించటంపై ఆయన ఎలాంటి అభ్యంతర్థిరం వ్యక్తం చేయకపోతే ఈ నియామకాలు చకచకా జరుగుతాయి.  

టీఎస్‌పీఎస్‌సీ అనాసక్తితో.. 
దశాబ్దాలుగా అంతర్గత ఉద్యోగాల నియామకా లను సొంతంగా ఆర్టీసీనే చూస్తూ వచ్చింది. కానీ గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ఓ దశలో దీనిని ప్రశ్నించింది. ప్రభుత్వ సంస్థల్లో అన్ని రకాల నియామకాలను టీఎస్‌పీఎస్‌సీ పర్యవేక్షిస్తుండగా, ఆర్టీసీలో ఆ సంస్థ చేపట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీలో అప్పటి వరకు నియామకాలు లేకపోవటం, తొలిసారి ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన తరుణంలో ఈ ప్రశ్న ఉత్పన్నమైంది. దీంతో ఆర్టీసీ ఉద్యోగాల ఎంపిక కూడా టీఎస్‌పీఎస్‌సీనే చూడాలని ఆదేశించింది. 

తొలుత ఆర్టీసీ ఫైనాన్స్, పర్సనల్‌ విభాగాల్లో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టింది. కానీ అప్పట్లో వాటి నియామకాలు జరగలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక నియామక ఉత్తర్వులు జారీ అయ్యాయి. డ్రైవర్ల నియామక ప్రక్రియ వరకు వచ్చేసరికి టీఎస్‌పీఎస్‌సీ చేతులెత్తేసింది. ఇతర ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో బిజీగా ఉండగా, వీటిని చేపట్టడం సాధ్యం కాదని పేర్కొంది. దీంతో విషయం నాటి ప్రభుత్వ చివరిదశలో మరోసారి ప్రభుత్వ పరిశీలనకు వెళ్లింది. మళ్లీ దీనిపై సమాలోచనలు చేసి పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డుకు అప్పగించింది. 

ఈలోపు ఎన్నికలు రావటం, ప్రభుత్వం మారిపోవటంతో ఆ ప్రక్రియ అలాగే ఆగిపోయింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి కలి్పంచటంతో బస్సుల సంఖ్య భారీగా పెంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ఉద్యోగుల కొరత ఉన్న సమయంలో కొత్త బస్సులు సమకూర్చుకుంటే వాటి నిర్వహణ అసాధ్యంగా మారే పరిస్థితి ఉంది. దీంతో 8 వేల మంది డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకోవాలని నిర్ణయించి ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదించింది.

 అన్ని నియామకాలు వద్దని ఆర్థికశాఖ మౌఖికంగా సూచించంతో 3 వేల పోస్టుల భర్తీకి మళ్లీ ప్రతిపాదించింది. ఇందులో 2 వేల మంది డ్రైవర్లు ఉండగా శ్రామిక్‌లు, డిపో మేనేజర్లు ఇలా మిగతా విభాగాలకు చెందిన మరో వెయ్యి మంది ఉన్నారు. సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇస్తే పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు మూడు వేల ఆర్టీసీ ఖాళీల భర్తీ ప్రక్రియ చేపడతారు.

డ్రైవర్ల డబుల్‌ డ్యూటీ రూ.వెయ్యికి పెంపు  
ప్రస్తుతం ఆర్టీసీలో ‘లక్షే లక్ష్యం’ పేరుతో ప్రత్యేక డ్రైవ్‌ కొనసాగుతోంది. 2017 నాటి వేతన సవరణ అమలు చేయనుండటంతో ఆర్టీసీపై రోజువారీగా రూ.కోటి చొప్పున భారం పడుతుంది. ఆ భారాన్ని పూడ్చుకునేందుకు సంస్థ, రోజువారీ ఆదాయాన్ని రూ.కోటి మేర అదనంగా పెంచుకోవాలని నిర్ణయించింది.

 ఇందుకుగాను ప్రతి డిపో రోజుకు రూ.లక్ష చొప్పున ఆదాయాన్ని పెంచుకునే కసరత్తు ప్రారంభించింది. లక్షే లక్ష్యం పేరుతో దీనిని చేపట్టింది. కానీ, ఈ రూపంలో డ్రైవర్లపై భారం మరింత పెరిగిందంటూ ఇటీవల డిపో మేనేజర్లు ఎండీ దృష్టికి తెచ్చారు. తీవ్ర ఎండలున్న ప్రస్తుత తరుణంలో ఇది ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు.

 దీంతో మే, జూన్‌ నెలలకు సంబంధించి డ్రైవర్ల డబుల్‌ డ్యూటీ మొత్తాన్ని రూ.వెయ్యికి పెంచాలని తాజాగా ఆర్టీసీ నిర్ణయించి ఆదేశాలు జారీ చేసింది. ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేలా డ్రైవర్ల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement