ప్రైవేటు స్కూళ్లలో 25% ఉచిత సీట్లు! | 25% free seats in private schools! | Sakshi
Sakshi News home page

ప్రైవేటు స్కూళ్లలో 25% ఉచిత సీట్లు!

Published Sun, Jan 31 2016 4:39 AM | Last Updated on Sun, Sep 3 2017 4:38 PM

ప్రైవేటు స్కూళ్లలో 25% ఉచిత సీట్లు!

ప్రైవేటు స్కూళ్లలో 25% ఉచిత సీట్లు!

♦ లక్ష మంది పేద విద్యార్థులకు వర్తింపు
♦ విద్యా హక్కు చట్టానికి ‘టీఎస్‌ఆర్‌టీఈ రూల్స్’ పేరుతో కొత్త నిబంధనలు
♦ ప్రభుత్వ ఆమోదానికి ఫైలు పంపిన విద్యా శాఖ.. ఒక ట్రెండు రోజుల్లో ఉత్తర్వులు
♦ తొలి ఏడాదే రూ.218 కోట్లు అవసరమని అంచనా..{పాథమిక స్థాయిలో సీసీఈ తప్పనిసరి
♦ ‘పిల్లలు’ నిర్వచనం 6 నుంచి 3 ఏళ్లకు కుదింపు..3 ఏళ్ల వారికి ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ సెంటర్లు
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం(ఆర్‌టీఈ) అమలుకు విద్యా శాఖ కొత్త నిబంధనలను రూపొందించింది. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటిదాకా ఉమ్మడి రాష్ట్ర నిబంధనలనే కొనసాగించారు. తాజాగా రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా, గతంలో పూర్తి వివరణలతో లేని నిబంధనలను సమగ్రపరుస్తూ పలు మార్పుచేర్పులతో తెలంగాణ రాష్ట్ర విద్యా హక్కు చట్టం(టీఎస్‌ఆర్‌టీఈ రూల్స్) పేరుతో రాష్ట్రంలో విద్యా హక్కు చట్టానికి కొత్త నిబంధనలను జారీ చేసేందుకు విద్యా శాఖ సర్వం సిద్ధం చేసింది. సంబంధిత ప్రతిపాదనలను గతంలోనే ఆమోదానికి పంపగా ప్రభుత్వం కొన్ని సవరణలు సూచించింది. వాటిని పొందుపరుస్తూ ప్రభుత్వ ఆమోదానికి మళ్లీ ఫైలును పంపించింది.

రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని పక్కాగా అమలు చేసేందుకు ఒకట్రెండు రోజుల్లో నిబంధనలు వెలువడనున్నాయి. అయితే విద్యాశాఖ పంపిన నిబంధనల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకోనున్నాయి. ప్రైవేటు స్కూళ్లలో ప్రారంభ తరగతిలో చేరే విద్యార్థుల్లో 25 శాతం మందికి ఉచిత విద్యను అందించాలన్న ప్రతిపాదనలతో ఈ నిబంధనలను రూపొందించి ప్రభుత్వ ఆమోదానికి పంపింది. ఇటీవల హైకోర్టు ప్రైవేటు స్కూళ్లలోని ప్రారంభ తరగతిలో(1వ తరగతిలో) చేరే విద్యార్థుల్లో 25 శాతం మందికి విద్యా హక్కు ప్రకారం ఉచిత విద్యను అందించాల్సిందేనని స్పష్టం చేయడంతో ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే కొత్త నిబంధనల జారీకి సిద్ధమైంది.

ఆవాస ప్రాంతంలో కిలోమీటర్ పరిధిలో ఉన్న పాఠశాలల్లోని 25 శాతం సీట్లలో ఉచిత విద్యను అందించేందుకు నోటిఫికేషన్ ద్వారా విద్యాశాఖ దరఖాస్తులు స్వీకరిస్తుంది. రిజర్వేషన్ల ఆధారంగా పేద పిల్లలను గుర్తించి నిర్ణీత రిజర్వేషన్ల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తారు. అందుకయ్యే మొత్తాన్ని విద్యాశాఖ పాఠశాల యాజమాన్యానికి రీయింబర్స్ చేస్తుంది. ప్రైవేటు స్కూళ్లలో విద్యా హక్కు చట్టాన్ని లక్ష మంది విద్యార్థులకు విద్యాశాఖ వర్తింప చేయనుంది. ఇందులో ఒక్కో విద్యార్థికి ఏటా రూ. 21 వేల చొప్పున ఖర్చవుతుంది. ఇలా మొత్తంగా తొలి ఏడాదే రూ. 218 కోట్లు వెచ్చించాల్సి వస్తుందని లెక్కలు వేసి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది.
 
 విశ్వసనీయ సమాచారం ప్రకారం రూల్స్‌లో ఉండనున్న మరిన్ని ప్రధాన అంశాలు..
 ► గత నిబంధనల్లో లేని నిరంతర సమగ్ర మూల్యాంకనాన్ని(సీసీఈ) ప్రాథమిక స్థాయిలో తప్పనిసరిగా అమలు చేయాలి.
 ► ఇప్పటివరకు పిల్లలు అంటే 6 నుంచి 14 ఏళ్ల వయసు వారు. ఏటా సెప్టెంబర్ 1 నాటికి 5 ఏళ్ల వయసు పూర్తయిన వారినే స్కూళ్లలో చేర్చుకుంటున్నారు. కానీ ప్రైవేటు పాఠశాలల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ విధానం ఉంది. మూడేళ్ల వయసులోనే స్కూల్ కు వెళ్తున్నారు. కాబట్టి పిల్లలు అంటే 3 నుంచి 14 ఏళ్ల వయస్సు వారిగా పేర్కొనాలి.
 ► చట్టంలోని సెక్షన్-12(1)(సి) ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో ప్రారంభ తరగతిలో(1వ తరగతిలో) చేరే వారిలో 25 శాతం మందికి ఉచిత విద్యను అందించాలి.
 ► 25 శాతం సీట్లను సామాజికంగా వెనుకబడిన వర్గాలకు కల్పించాలి. ఇందులో గతం లో లేని వర్గాలను చేర్చింది. గతంలో వికలాంగులు, హెచ్‌ఐవీ బాధిత పిల్లలు, ఎస్సీ, ఎస్టీ వంటి కేటగిరీలు ఉండగా తెల్ల రేషన్ కార్డు కలిగిన బీసీల పిల్లలను(తండ్రి/గార్డియన్) ప్రతిపాదనల్లో చేర్చినట్లు తెలిసింది.
 ► ఎకనామిక్ వీకర్ సెక్షన్ కేటగిరీలో మైనారిటీలు, ఓసీల్లో తెల్ల రేషన్ కార్డు కలిగిన వారిని చేర్చింది.
 ► 3-5 ఏళ్ల వయస్సు వారికి ప్రాథమిక పాఠశాలల ఆవరణలో ఎస్‌ఎస్‌ఏ ఆధ్వర్యంలో ఎర్లీ చైల్డ్ హుడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్న నిబంధనను కొనసాగిస్తున్నట్లు తెలిసింది.
 ► మండల రీసోర్స్ పర్సన్ వ్యవస్థను తొలగించింది.
 ► పాత నిబంధనల్లో మండల పరిషత్తు అనే పదాన్ని ఎక్కడా చేర్చలేదు. తాజాగా నిబంధనల్లో మండల పరిషత్తులను చేర్చింది. దీంతో స్థానిక సంస్థలకు ప్రాధాన్యం కల్పిస్తోంది. అలాగే జిల్లా పరిషత్తు పదాన్ని చేర్చింది.
 ► నర్సరీ, ఎల్‌కేజీ, మాంటిస్సోరీ, అంగన్‌వాడీ, బాల్వాడి, ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్(ఈసీఈ) కేంద్రాలు అన్నింటిని ప్రీప్రైమరీ ఎడ్యుకేషన్‌గా పరిగణిస్తారు.
 ► టీచర్ కావాలనుకునే వారు కచ్చితంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)లో అర్హత సాధించి ఉండాల్సిందే.
 ► ప్రైవేటు స్కూళ్ల అనుమతుల్లో ఎలిమెంటరీ స్కూల్ అంటే ఎల్‌కేజీ, యూకేజీ వంటివి కలిపే ఉండాలి. 8వ తరగతి వరకు డీఈవో అనుమతి ఇవ్వాలి.
 ► ఒక సెక్షన్‌లో కనీసంగా 20 మంది విద్యార్థులుండాలి. గిరిజన ప్రాంతాల్లో 15 మంది ఉంటే చాలు. ప్రభుత్వ పాఠశాలల్లో 60 మంది దాటితే మరొక సెక్షన్ ఏర్పాటు చేయాలి. అదే ప్రైవేటు పాఠశాలల్లో 40 మందికి మించకూడదు.
 ► బడి బయటి పిల్లలను గుర్తించి ముందుగా సమీపంలోని స్కూళ్లలో చేర్చాలి. ఆ తరువాత ప్రత్యేక శిక్షణకు పంపించాలి.
 ► విద్యార్థులను శిక్షించడం, మానసికంగా వేధించడం నిషేధం. వాటికి పాల్పడిన వారిపై సర్వీసు రూల్స్ ప్రకారం చర్యలు ఉంటాయి. దీనిని తాజాగా నిబంధనల్లో చేర్చుతున్నారు.
 ► పాఠశాలల వారీగా ఉండాల్సిన స్టాఫ్ ప్యాటర్న్‌ను కూడా నిబంధనల్లో చేర్చుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement