నిజామాబాద్‌అర్బన్, న్యూస్‌లైన్ : బడి బయట ఉన్న పిల్లలందరినీ పాఠశాలకు పంపి, చదివించాల్సిందేనని విద్యాహక్కు చట్టం ద్వారా ప్రభుత్వం స్పష్టంచేసింది. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించి, పిల్లలను బడిబాట పట్టించాలనీ చెప్పింది. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేకపోవడం, పర్యవేక్షణ లోపంతో ఈ లక్ష్యం నీరుగారుతోంది.
లెక్కింపులో నిర్లక్ష్యం
జిల్లాలో బడిఈడు పిల్లల లెక్కింపులో అధికారుల నిర్లక్ష్య వైఖరి స్పష్టమవుతోంది. పిల్లల సంఖ్యకు తగ్గట్లు ఏర్పాట్లు చేసి, వారికి సరైన విద్యనందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంటే అధికారులు మాత్రం అంతగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. పిల్లల లెక్కింపు కోసం తూతూమంత్రంగా సర్వేలు చేపట్టి చేతులు దులుపుకున్నారు. బాలకార్మిక నిర్మూలన ప్రాజెక్టు అధికారులు, రాజీవ్ విద్యామిషన్(ఆర్‌వీఎం) అధికారులు సర్వే లోపాలపై తమ తప్పు లేదని, మరోసారి చేపడతామని చెబుతున్నారు.
తూతూ మంత్రంగా
జిల్లాలో బడిబయట ఉన్న పిల్లలను గుర్తించడానికి ఆర్‌వీఎం అధికారులు మూడు నెలలుగా సర్వేచేయించారు. రాష్ట్ర ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో లెక్కింపును మూడు స్వచ్ఛంద సంస్థలకు, మున్సిపాలిటీలను మెప్మా అధికారులకు అప్పగించారు. జిల్లాలో 718 గ్రామ పంచాయతీలు, మూడు మున్సిపాలిటీల్లో సర్వే చేపట్టారు. ఈ సర్వే లెక్కల ప్రకారం 1401 మంది బాల కార్మికులు జిల్లాలో ఉన్నట్లు తేలింది.
ఇందులో 123 మంది చిన్నారులు అతి పేదరికంలో ఉన్న బాలలుగా గుర్తించారు. ఈ సర్వే ఫలితాలపై ఆర్‌వీఎం అధికారులే నివ్వెరపోయారు. గతంలోనే జిల్లాలో రెండువేల వరకు బాల కార్మికులు ఉండగా, ప్రస్తుత సర్వేలో తక్కువ రావడంపై అనుమానాలు వ్యక్తంచేశారు. దీంతో ఈ సర్వే సక్రమంగా లేదంటూ మళ్లీ చేపట్టాలని ఆర్‌వీఎం పీఓ భిక్షునాయక్ నిర్ణయించారు. ఈ లెక్కింపులో భాగస్వామంగా ఉన్న బాలకార్మిక నిర్మూలన అధికారులు సర్వేలో తమ తప్పు లేదని చెబుతున్నారు.
అసంపూర్తి సర్వేతోనే
బడిబయట పిల్లల లెక్కింపునకు సంబంధించిన అసంపూర్తి సర్వే ఆధారంగానే జిల్లాలో మూడు ఆర్‌బీసీ సెంటర్లను ప్రారంభించారు. నిజామాబాద్ మండలం మోపాల్, డిచ్‌పల్లి మండలం నడిపల్లి, ఆర్మూర్ మండలం ఇస్సాపల్లి , మాక్లూర్ మండలం మామిడిపల్లి, సక్రినాయక్‌తండాల్లో వీటిని ఏర్పాటు చేశారు.
ఆయా ప్రాంతాల్లో ఇటుక బట్టీల్లో పనిచేసే బాల కార్మికుల కోసం ఈ సెంటర్లను ప్రారంభించారు. అలాగే విద్యార్థులకు, విద్యాబోధనకు సంబంధించి అతి తక్కువ ఆర్థికమొత్తం అందిస్తున్నారు. నెలకు 600 మాత్రమే ఒక్కో విద్యార్థిపై ఖర్చు చేస్తున్నారు. ఇందులోనే టీచర్ మెటీరియల్, వేతనం అందించాల్సి ఉంటుంది. జిల్లా అధికారులు మరిన్ని నిధుల కోసం ఉన్నతాధికారులకు విన్నవిస్తున్నారు.
‘బడిఈడు’ సర్వేల్లో లోపాలు
Published Fri, Feb 7 2014 1:50 AM | Last Updated on Thu, Jul 11 2019 7:48 PM
Advertisement
Advertisement