
కొత్త బడి గంటలు
- ఉదయం 9 గంటలకే తరగతులు ప్రారంభం
- అమలు కావల్సింది రాష్ట్ర పరిధి పాఠశాలల్లోనే..
మంచిర్యాల సిటీ : కేంద్ర ప్రభుత్వం 2009లో అమలు చేసిన విద్యాహక్కు చట్ట ప్రకారం బడిగంటలు మారనున్నాయి. ప్రస్తుతం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల పనివేళలు ఒక్కో రకంగా ఉన్నాయి. కొత్తగా అన్నిపాఠశాలలు ఒకే సమయానికి ప్రారంభమై ఒకే సమయానికి విద్యార్థులను విడుదల చేయాలనే నిబంధనలు రాబోతున్నాయి. ఉదయం 9 గంటలకే తరగతులు ప్రారంభించి సాయంత్రం 4.30 గంటలకు విద్యార్థులను విద్యాహక్కు చట్టం ప్రకారం విడుదల చేయాలి.
ఈ సవృయాన్ని ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర పరిధిలోని కేంద్రీయ విద్యాలయం, నవోదయ, ఆదర్శ, సాంఘీక సంక్షేమ, గురుకుల పాఠశాలలతోపాటృ ప్రైవేటు పాఠశాలలు అమలు చేస్తున్నాయి. కేవలం రాష్ట్రప్రభుత్వం పరిధిలోని మండల, జిల్లా పరిషత్ పాఠశాలలు అమలు చేయడం లేదు. తరగతుల నిర్వహణ సమయాల్లో మార్పులు జరగాల్సి ఉన్నప్పటికీ నేటికి విద్యాహక్కు నిబంధనలు అమలు కావడం లేదు. బడి వేళలను మార్చాల్సిందే అంటూ విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలను కొన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తుండగా, మరికొన్ని సమర్థిస్తున్నాయి.
బోధన
ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థులకు తరగతులు బోధించడానికి రోజుకు ఏడున్నర గంటల చొప్పున వారానికి 45 గంటల సమయాన్ని కేటాయించాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. ప్రాథమిక పాఠశాలల్లో బోధించడానికి ఏడాదికి 800 గంటలు, ఉన్నత పాఠశాలల్లో ఒక 1000 గంటలు కేటాయించాలని చట్టం చెబుతోంది.
ఇబ్బందులు
కొత్త సమయసారిణి అమలు అయితే విద్యార్థులకు మేలు జరుగుతుంది. కొత్త బడిగంటల ప్రకారం ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఏడున్నర గంటలు పనిచేయనున్నాయి. ఉపాధ్యాయులు సమయాన్ని పాటించినచో విద్యార్థులకు మేలు చేసినవారవుతారు. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం కూడా బోధన, బోధనేతర సిబ్బందితోపాటు విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఉండాల్సిన మౌలిక వసతులను ఏర్పాటు చేసినపుడే కొత్త బడి గంటలకు న్యాయం జరుగుతుంది.
ప్రధానంగా రవాణా సౌకర్యాలు మెరుగుపర్చాలి. అన్ని రూట్లకు బస్ సౌకర్యం కల్పిస్తే ప్రభుత్వం అనుకున్నట్లు లక్ష్యం నెరవేరుతుంది. కొన్ని రూట్లలో కార్పొరేట్ పాఠశాలు బస్ సౌకర్యం కల్పిస్తున్నాయి. రహదారులు మెరుగ్గా ఉన్న ప్రాంతాలకు కనీసం ఆర్టీసీ బస్ వేయిస్తే సులువవుతుంది.