సాక్షి, అమరావతి : గత ప్రభుత్వాలు విద్యాహక్కు చట్టాన్ని నిర్వీర్యం చేశాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, ఈబీసీ విద్యార్థులను బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు సొమ్ము చెల్లిస్తూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విద్యాహక్కు చట్టం ప్రకారం కార్పొరేట్ స్కూళ్లలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన పిల్లలు, పేదలకు 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలి. కానీ.. రాష్ట్రంలో ఎక్కడా ఈ చట్టం అమలు కావడం లేదు. ఎస్సీ, ఎస్టీ, పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలను కార్పొరేట్ కాలేజీలు చేర్చుకోవడం లేదు. చేర్చుకున్నా పూర్తిస్థాయిలో ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో ఎస్సీ, ఎస్టీలు, పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసి తనకు నివేదించాలని ఆదేశించారు. విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులకు నిర్దేశించారు.
ఐదేళ్లలో రూ.591.50 కోట్ల నష్టం
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం ఏటా రూ.103.26 కోట్ల చొప్పున చెల్లిస్తోంది. ఒక్కసారి స్కూల్‌లో చేరిన విద్యార్థులు పదో తరగతి వరకు అక్కడే విద్యనభ్యసిస్తారు. ఇలా గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం రూ.520 కోట్ల వరకు చెల్లించింది. 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో అడ్మిషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి. 34,421 మంది విద్యార్థులకు వాటిల్లో చదువు చెప్పించేందుకు ఎంపిక చేశారు. వీరిలో ఎస్సీలు 22,814 మంది, ఎస్టీలు 11,580 మంది, ఇతరులు 27 మంది ఉన్నారు. ఒక్కో విద్యార్థికి ఏటా రూ.30 వేల చొప్పున ప్రభుత్వం ఫీజు చెల్లిస్తోంది. ఇదిలావుంటే.. కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత విద్య పొందేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, దివ్యాంగ, ఈబీసీ విద్యార్థులు అర్హులు. పదో తరగతి పాసైన వారిని ఇంటర్మీడియెట్‌లో చేర్పించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. 2019–20 సంవత్సరానికి 3,765 మంది విద్యార్థులను కార్పొరేట్ కాలేజీల్లో చేర్చారు.
ఒక్కొక్కరికి రూ.35 వేల ఫీజు, రూ.3 వేల పాకెట్ మనీ కలిపి మొత్తం రూ.38 వేల చొప్పున ప్రభుత్వం కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలకు చెల్లిస్తోంది. ఏటా రూ.14.30 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.71.50 కోట్లు వెచ్చిస్తోంది. ఈ ఏడాది కార్పొరేట్ కళాశాలల్లో ఎస్సీలు 1,795 మంది, ఎస్టీలు 582 మంది, బీసీలు 1,050 మంది, మైనార్టీలు 189 మంది, కాపులు 83, ఈబీసీలు 65 మంది, దివ్యాంగుల్లో ఒకరిని ప్రభుత్వం ఎంపిక చేసింది. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, కార్పొరేట్ కాలేజీల్లో పేద విద్యార్థులను చదివిస్తున్నందుకు గడచిన ఐదేళ్లలో సుమారు రూ.591.50 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చింది. విద్యాహక్కు చట్టం సక్రమంగా అమలు చేసి ఉంటే ప్రభుత్వానికి ఈ భారం తగ్గేది. ఇకపై కార్పొరేట్ స్కూళ్లు, కార్పొరేట్ కాలేజీల్లో విద్యాహక్కు చట్టం కింద ఆయా వర్గాల్లోని పేదలకు 25 శాతం సీట్లు విధిగా ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలివ్వడంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రానున్న రోజుల్లో విద్యాహక్కు చట్టం అమలుకు చిక్కు ఉండదని, పేదవర్గాల వారికి మేలు కలుగుతుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు విద్యాశాఖ అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.
విద్యాహక్కు.. ఇక ఉండదు చిక్కు
Published Mon, Jul 1 2019 4:04 AM | Last Updated on Mon, Jul 1 2019 4:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment