Corporate institutions
-
విద్యాహక్కు.. ఇక ఉండదు చిక్కు
సాక్షి, అమరావతి : గత ప్రభుత్వాలు విద్యాహక్కు చట్టాన్ని నిర్వీర్యం చేశాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, ఈబీసీ విద్యార్థులను బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, కార్పొరేట్ కాలేజీల్లో చేర్పించేందుకు ప్రభుత్వం ఇప్పటివరకు సొమ్ము చెల్లిస్తూ వస్తోంది. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విద్యాహక్కు చట్టం ప్రకారం కార్పొరేట్ స్కూళ్లలో ఎస్సీ, ఎస్టీలకు చెందిన పిల్లలు, పేదలకు 25 శాతం సీట్లు ఉచితంగా ఇవ్వాలి. కానీ.. రాష్ట్రంలో ఎక్కడా ఈ చట్టం అమలు కావడం లేదు. ఎస్సీ, ఎస్టీ, పేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలను కార్పొరేట్ కాలేజీలు చేర్చుకోవడం లేదు. చేర్చుకున్నా పూర్తిస్థాయిలో ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవల నిర్వహించిన విద్యాశాఖ సమీక్షలో ఎస్సీ, ఎస్టీలు, పేద విద్యార్థులకు కార్పొరేట్ స్కూళ్లలో 25 శాతం సీట్లు ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేసి తనకు నివేదించాలని ఆదేశించారు. విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులకు నిర్దేశించారు. ఐదేళ్లలో రూ.591.50 కోట్ల నష్టం బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం ఏటా రూ.103.26 కోట్ల చొప్పున చెల్లిస్తోంది. ఒక్కసారి స్కూల్లో చేరిన విద్యార్థులు పదో తరగతి వరకు అక్కడే విద్యనభ్యసిస్తారు. ఇలా గడచిన ఐదేళ్లలో ప్రభుత్వం రూ.520 కోట్ల వరకు చెల్లించింది. 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో అడ్మిషన్లు ఇప్పటికే పూర్తయ్యాయి. 34,421 మంది విద్యార్థులకు వాటిల్లో చదువు చెప్పించేందుకు ఎంపిక చేశారు. వీరిలో ఎస్సీలు 22,814 మంది, ఎస్టీలు 11,580 మంది, ఇతరులు 27 మంది ఉన్నారు. ఒక్కో విద్యార్థికి ఏటా రూ.30 వేల చొప్పున ప్రభుత్వం ఫీజు చెల్లిస్తోంది. ఇదిలావుంటే.. కార్పొరేట్ కాలేజీల్లో ఉచిత విద్య పొందేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, దివ్యాంగ, ఈబీసీ విద్యార్థులు అర్హులు. పదో తరగతి పాసైన వారిని ఇంటర్మీడియెట్‌లో చేర్పించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తోంది. 2019–20 సంవత్సరానికి 3,765 మంది విద్యార్థులను కార్పొరేట్ కాలేజీల్లో చేర్చారు. ఒక్కొక్కరికి రూ.35 వేల ఫీజు, రూ.3 వేల పాకెట్ మనీ కలిపి మొత్తం రూ.38 వేల చొప్పున ప్రభుత్వం కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలకు చెల్లిస్తోంది. ఏటా రూ.14.30 కోట్ల చొప్పున ఐదేళ్లకు రూ.71.50 కోట్లు వెచ్చిస్తోంది. ఈ ఏడాది కార్పొరేట్ కళాశాలల్లో ఎస్సీలు 1,795 మంది, ఎస్టీలు 582 మంది, బీసీలు 1,050 మంది, మైనార్టీలు 189 మంది, కాపులు 83, ఈబీసీలు 65 మంది, దివ్యాంగుల్లో ఒకరిని ప్రభుత్వం ఎంపిక చేసింది. బెస్ట్ అవైలబుల్ స్కూళ్లు, కార్పొరేట్ కాలేజీల్లో పేద విద్యార్థులను చదివిస్తున్నందుకు గడచిన ఐదేళ్లలో సుమారు రూ.591.50 కోట్లను ప్రభుత్వం చెల్లించాల్సి వచ్చింది. విద్యాహక్కు చట్టం సక్రమంగా అమలు చేసి ఉంటే ప్రభుత్వానికి ఈ భారం తగ్గేది. ఇకపై కార్పొరేట్ స్కూళ్లు, కార్పొరేట్ కాలేజీల్లో విద్యాహక్కు చట్టం కింద ఆయా వర్గాల్లోని పేదలకు 25 శాతం సీట్లు విధిగా ఇచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలివ్వడంతో అధికారులు ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రానున్న రోజుల్లో విద్యాహక్కు చట్టం అమలుకు చిక్కు ఉండదని, పేదవర్గాల వారికి మేలు కలుగుతుందని విద్యారంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు విద్యాశాఖ అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
సోమవారం బంద్‌కు పిలుపునిచ్చిన ఏబీవీపీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పలు కార్పొరేట్ విద్యాసంస్థల్లో జరుగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలకు నిరసనగా సోమవారం ఏబీవీపీ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. విద్యార్ధుల ఆత్మహత్యలపై రాష్ట్రం మొద్దునిద్ర పోతోందని విద్యార్ధి సంఘాల నాయకులు మండిపడ్డారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో విద్యార్థులు పిట్టల్లా రాలుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లుగా కూడా లేదని విమర్శించారు. ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా మూడున్నర ఏళ్లలో వందలాది మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారని తెలంగాణ ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి అయ్యప్ప ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్పొరేట్లకు తొత్తుల్లా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా రాష్ట్ర వ్యాప్త బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. -
30న కార్పొరేట్ విద్యా సంస్థల బంద్
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : ఈ నెల 30వ తేదీన ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కార్పొరేట్ విద్యా సంస్థల బంద్‌ను పాటించనున్నట్లు ఆ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి.రాజ్‌కుమార్ తెలిపారు. ఈ బంద్‌కు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యాజమన్యాలు సహకరించాలని కోరారు. శుక్రవారం కార్మిక, కర్షక భవన్లో ఎస్ఎఫ్ఐ ముఖ్య కార్యకర్తల సమావేశం నగర కమిటీ ఉపాధ్యక్షుడు శివ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్‌కుమార్ మాట్లాడుతూ..కార్పొరేట్ విద్యా సంస్థల్లో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఫీజులను వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఎక్కడా నోటీసు బోర్డుల్లో ఫీజుల వివరాలను పెట్టడంలేదన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీకి నిరసనగా బంద్ చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు రవి, శంకర్, ఆర్.శంకర్, అక్బర్, వీరేంద్ర, చంద్ర, ప్రకాష్, వెంకటేశ్, నాగరాజు, సురేష్ పాల్గొన్నారు. -
‘కార్పొరేట్’పై నియంత్రణ ఉండాలి: కోదండరాం
హైదరాబాద్: కార్పొరేట్ సంస్థలపై నియంత్రణ ఉంటేనే సామాన్యులకు నాణ్యమైన విద్య అందుతుందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్పొరేట్ సంస్థల గుత్తాధిపత్య పోకడలపై పోరాట సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలు తమకు వచ్చిన కొద్ది ర్యాంకులతో ప్రచారం చేస్తూ విద్యార్ధులు వారి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. అధికారులు ప్రైవేట్ సంస్థల మాదిరిగా కార్పొరేట్ సంస్థలపై నిఘా పెట్టడం లేదని, ఇష్టం వచ్చినట్లు వారికి అనుమతులు ఇస్తున్నారని అన్నారు. నే డు పేదలకు విద్య భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షడు(ట్రెస్మా) ఎస్.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యావిధానాన్ని పటిష్టం చేయాలని అప్పుడే అందరికి విద్య అందుతుందన్నారు. కార్పొరేట్ సంస్థలను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ విద్యాసాగర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్స్ సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్. రమేశ్, ఫార్మసీ కళాశాల యాజమాన్య సంఘం ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించాలి’
హైదరాబాద్: ప్రజలందరికీ ఉచితవిద్యను అందించాలనే సదాశయంతో ఉన్న తెలంగాణ ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. బుధవారం ఇక్కడ తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ‘కార్పొరేట్ విద్య-తల్లిదండ్రులు, ప్రభుత్వ కర్తవ్యం’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కోదండరాం మాట్లాడుతూ కార్పొరేట్ విద్యాసంస్థల వల్ల ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు బతకలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఈ వ్యవస్థను నియంత్రించాలని కోరారు. అధిక ఫీజుల నియంత్రణతోపాటుగా పర్మిషన్లను నియంత్రించాలని కోరా రు. ట్రస్మా అధ్యక్షుడు ఎస్.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా విధానాన్ని పటిష్టం చేయాలని కోరారు. తెలంగాణ విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు గురజాల రవీందర్రావు, ఆర్గనైజేషన్ అధ్యక్షురాలు సొగర బేగం, శ్రావణ్‌కుమార్ పాల్గొన్నారు.