‘కార్పొరేట్’పై నియంత్రణ ఉండాలి: కోదండరాం
హైదరాబాద్: కార్పొరేట్ సంస్థలపై నియంత్రణ ఉంటేనే సామాన్యులకు నాణ్యమైన విద్య అందుతుందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కార్పొరేట్ సంస్థల గుత్తాధిపత్య పోకడలపై పోరాట సన్నాహక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ కార్పొరేట్ విద్యా సంస్థలు తమకు వచ్చిన కొద్ది ర్యాంకులతో ప్రచారం చేస్తూ విద్యార్ధులు వారి తల్లిదండ్రులను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
అధికారులు ప్రైవేట్ సంస్థల మాదిరిగా కార్పొరేట్ సంస్థలపై నిఘా పెట్టడం లేదని, ఇష్టం వచ్చినట్లు వారికి అనుమతులు ఇస్తున్నారని అన్నారు. నే డు పేదలకు విద్య భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అధ్యక్షడు(ట్రెస్మా) ఎస్.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విద్యావిధానాన్ని పటిష్టం చేయాలని అప్పుడే అందరికి విద్య అందుతుందన్నారు.
కార్పొరేట్ సంస్థలను నియంత్రించేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో డాక్టర్ విద్యాసాగర్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల లెక్చరర్స్ సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్. రమేశ్, ఫార్మసీ కళాశాల యాజమాన్య సంఘం ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డి, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్స్ సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.