సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. ప్రధాన ప్రభుత్వ శాఖలన్నింటినీ సమన్వయపరుస్తోంది. బాలల హక్కుల పరిరక్షణకు వచ్చే నెలలో ప్రత్యేకంగా ‘కంప్లైంట్ మానిటరింగ్ సెల్ (సీఎంఎస్)’ ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా వచ్చే విజ్ఞాపనలు, ఫిర్యాదులను పరిశీలించి సమన్వయం చేసేందుకు రాష్ట్రస్థాయిలో ఒక సమన్వయకర్త (కోఆర్డినేటర్)ను నియమిస్తారు. ప్రతి గ్రామ, పట్టణాల్లోని వార్డు స్థాయిల్లో అధికారులకు బాధ్యతలు అప్పగిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, మహిళా పోలీస్, వలంటీర్‌లను సైతం భాగస్వాముల్ని చేస్తారు. ఇందుకోసం ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రత్యేక కసరత్తు ప్రారంభించింది.
ప్రాథమికంగా దృష్టి సారించిన కీలక అంశాలు, చర్యలు
► విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయనున్నారు.
► బాలలపై లైంగిక వేధింపులు, లైంగిక దాడులు తదితర నేరాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా పోలీస్ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తారు. పోక్సో చట్టంతోపాటు బాలల హక్కులపైన పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
► బాలల అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపనుంది. పేదరికం, ఆర్థిక సమస్యలు, కోవిడ్ నేపథ్యంలో చితికిపోయిన కుటుంబాలకు చెందిన బాలలు అక్రమ రవాణా బారిన పడుతున్నారు. గ్రామాలు, పట్టణాల్లో తేలిగ్గా డబ్బు సంపాదన మరిగిన కొందరు బ్రోకర్లు బాలలను కార్మికులుగా, బలవంతపు వ్యభిచారానికి, కిరాయి యాచక వృత్తిలోకి దింపుతున్నారు. బాలలపై ఈ క్రూరత్వాన్ని కట్టడి చేసేలా చర్యలు చేపట్టింది.
► ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బాల్య వివాహాలు, డ్రాపవుట్స్ (బడి మానేయడం) వంటి వాటిని నివారించేందుకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లను భాగస్వాముల్ని చేయనున్నారు.
► దత్తత పేరుతో జరుగుతున్న దగాను నివారించడంపై దృష్టి పెట్టారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దత్తత రిజిస్ట్రేషన్ చెల్లదనే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పిల్లల దత్తతకు కేంద్ర, రాష్ట్ర మార్గదర్శకాలు కచ్చితంగా పాటించేలా ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కఠినంగా అమలు చేయనున్నారు.
► భ్రూణ హత్యలకు దారితీసే లింగ నిర్ధారణ పరీక్షలు, ఆడ శిశువులను వదిలించుకునేలా రోడ్డు, చెత్త కుప్పల్లో వదిలేసే దారుణాలు, సరోగసి (అద్దె గర్భాల) మాఫియాలపైనా దృష్టి పెట్టారు. ప్రభుత్వ యంత్రాంగం జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులు, పోలీసులను సమన్వయపరిచి ఈ మాఫియాపై కఠిన చర్యలు చేపడుతున్నారు.
► బాలల స్వీయ రక్షణకు తోడ్పడే దిశ అప్లికేషన్ (యాప్)పై ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతోంది. పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టి రోడ్డుపైన, విద్యాలయాల్లో బాలల మొబైల్ ఫోన్లలో దిశ యాప్‌ను ఇన్‌స్టాల్ చేయిస్తున్నారు. ఈ యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆపద సమమంలో దిశ యాప్ రక్షణ కవచంలా ఉంటుందని బాలలు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పది ప్రభుత్వ శాఖలతో సమన్వయం
బాలల హక్కులు, సమస్యలపై పది ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నాం. ప్రధానంగా వైద్య ఆరోగ్య, విద్య, పోలీస్, కార్మిక, పంచాయతీరాజ్, మహిళా శిశు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలతోపాటు లీగల్ సర్వీసెస్ అథారిటీ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమన్వయంతో బాలల సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతోంది.
– డాక్టర్ కేసలి అప్పారావు, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment