Protection of Children from Sexual Offences Act
-
రక్షణ లేని బాల భారతం!
న్యూఢిల్లీ: దేశంలో బాలలపై నేరాల సంఖ్య ప్రతిఏటా పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2021లో 53,874 పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) కేసులు నమోదైనట్లు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో(ఎన్సీఆర్బీ) గణాంకాలను బట్టి స్పష్టమవుతోంది. బాలలపై జరిగే నేరాల్లో ప్రతి మూడింటిలో ఒకటి లైంగిక నేరమే కావడం గమనార్హం. ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం.. దేశంలో బాలలపై నేరాలకు సంబంధించి 2020లో 1,28,531 కేసులు, 2021లో 1,49,404 కేసులు నమోదయ్యాయి. అంటే ఏడాదిలోనే కేసులు 16.2 శాతం పెరిగాయి. 2021లో పోక్సో చట్టం సెక్షన్ 4, 6 కింద 33,348 కేసులు నమోదయ్యాయి. వీటిలో 33,036 కేసులు బాలికలపై జరిగిన అఘాయిత్యాలకు, 312 కేసులు బాలురపై జరిగిన అఘాయిత్యాలకు సంబంధించినవి. దేశవ్యాప్తంగా బాలల అపహరణలకు సంబంధించి గతేడాది 67,245 కేసులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోనే అత్యధిక నేరాలు బాలలపై నేరాల వ్యవహారంలో కేంద్ర పాలిత ప్రాంతాల పరంగా చూస్తే ఢిల్లీలో అత్యధికంగా 7,783 కేసులు రిజిస్టరయ్యాయి. 2021లో 140 మంది చిన్నారులు అత్యాచారం, ఆపై హత్యకు గురయ్యారు. మరో 1,402 మంది కేవలం హత్యకు గురయ్యారు. అత్యధిక నేరాలు ఉత్తరప్రదేశ్‌లోనే బయటపడ్డాయి. గర్భంలోనే శిశువులను చిదిమేసినట్లు గతేడాది 121 కేసులు రిజిస్టరయ్యాయి. వీటిలో మధ్యప్రదేశ్‌లో 23, గుజరాత్లో 23 నమోదయ్యాయి. ఆత్మహత్య చేసుకొనేలా బాలలను ప్రేరేపించినట్లు 359 కేసులు వచ్చాయి. గత ఏడాది 49,535 మంది చిన్నపిల్లలు కనిపించకుండా పోయారు. గతేడాది బాల కార్మిక చట్టం కింద 982 కేసులు నమోదు చేశారు. వీటిలో అత్యధికంగా 305 కేసులు తెలంగాణ రాష్ట్రంలోనే నమోదు కావడం గమనార్హం. బాల్యవివాహ నిషేధ చట్టం కింద గతేడాది 1,062 కేసులు పెట్టగా, ఇందులో ఎక్కువ కేసులు కర్ణాటక, తమిళనాడు, అస్సాంలో నమోదయ్యాయి. -
బాలలకు భద్రత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బాలల హక్కుల పరిరక్షణ, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. ప్రధాన ప్రభుత్వ శాఖలన్నింటినీ సమన్వయపరుస్తోంది. బాలల హక్కుల పరిరక్షణకు వచ్చే నెలలో ప్రత్యేకంగా ‘కంప్లైంట్ మానిటరింగ్ సెల్ (సీఎంఎస్)’ ఏర్పాటు చేస్తోంది. దీని ద్వారా వచ్చే విజ్ఞాపనలు, ఫిర్యాదులను పరిశీలించి సమన్వయం చేసేందుకు రాష్ట్రస్థాయిలో ఒక సమన్వయకర్త (కోఆర్డినేటర్)ను నియమిస్తారు. ప్రతి గ్రామ, పట్టణాల్లోని వార్డు స్థాయిల్లో అధికారులకు బాధ్యతలు అప్పగిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, మహిళా పోలీస్, వలంటీర్లను సైతం భాగస్వాముల్ని చేస్తారు. ఇందుకోసం ఏపీ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ప్రత్యేక కసరత్తు ప్రారంభించింది. ప్రాథమికంగా దృష్టి సారించిన కీలక అంశాలు, చర్యలు ► విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయనున్నారు. ► బాలలపై లైంగిక వేధింపులు, లైంగిక దాడులు తదితర నేరాలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకునేలా పోలీస్ యంత్రాంగాన్ని సమన్వయం చేస్తారు. పోక్సో చట్టంతోపాటు బాలల హక్కులపైన పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ► బాలల అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపనుంది. పేదరికం, ఆర్థిక సమస్యలు, కోవిడ్ నేపథ్యంలో చితికిపోయిన కుటుంబాలకు చెందిన బాలలు అక్రమ రవాణా బారిన పడుతున్నారు. గ్రామాలు, పట్టణాల్లో తేలిగ్గా డబ్బు సంపాదన మరిగిన కొందరు బ్రోకర్లు బాలలను కార్మికులుగా, బలవంతపు వ్యభిచారానికి, కిరాయి యాచక వృత్తిలోకి దింపుతున్నారు. బాలలపై ఈ క్రూరత్వాన్ని కట్టడి చేసేలా చర్యలు చేపట్టింది. ► ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో బాల్య వివాహాలు, డ్రాపవుట్స్ (బడి మానేయడం) వంటి వాటిని నివారించేందుకు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లను భాగస్వాముల్ని చేయనున్నారు. ► దత్తత పేరుతో జరుగుతున్న దగాను నివారించడంపై దృష్టి పెట్టారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దత్తత రిజిస్ట్రేషన్ చెల్లదనే విషయంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. పిల్లల దత్తతకు కేంద్ర, రాష్ట్ర మార్గదర్శకాలు కచ్చితంగా పాటించేలా ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ కఠినంగా అమలు చేయనున్నారు. ► భ్రూణ హత్యలకు దారితీసే లింగ నిర్ధారణ పరీక్షలు, ఆడ శిశువులను వదిలించుకునేలా రోడ్డు, చెత్త కుప్పల్లో వదిలేసే దారుణాలు, సరోగసి (అద్దె గర్భాల) మాఫియాలపైనా దృష్టి పెట్టారు. ప్రభుత్వ యంత్రాంగం జిల్లాల వైద్య ఆరోగ్య అధికారులు, పోలీసులను సమన్వయపరిచి ఈ మాఫియాపై కఠిన చర్యలు చేపడుతున్నారు. ► బాలల స్వీయ రక్షణకు తోడ్పడే దిశ అప్లికేషన్ (యాప్)పై ప్రభుత్వ యంత్రాంగం పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతోంది. పోలీస్ శాఖ ప్రత్యేక కార్యాచరణ చేపట్టి రోడ్డుపైన, విద్యాలయాల్లో బాలల మొబైల్ ఫోన్లలో దిశ యాప్‌ను ఇన్స్టాల్ చేయిస్తున్నారు. ఈ యాప్ వినియోగంపై అవగాహన కల్పిస్తున్నారు. ఆపద సమమంలో దిశ యాప్ రక్షణ కవచంలా ఉంటుందని బాలలు సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారు. పది ప్రభుత్వ శాఖలతో సమన్వయం బాలల హక్కులు, సమస్యలపై పది ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తున్నాం. ప్రధానంగా వైద్య ఆరోగ్య, విద్య, పోలీస్, కార్మిక, పంచాయతీరాజ్, మహిళా శిశు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖలతోపాటు లీగల్ సర్వీసెస్ అథారిటీ, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమన్వయంతో బాలల సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతోంది. – డాక్టర్ కేసలి అప్పారావు, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ -
‘స్కిన్ టు స్కిన్’ కాకపోయినా నేరమే: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్(పోక్సో) చట్టం కింద చిన్నారులపై లైంగిక వేధింపుల నేరాన్ని బాధితుల దృష్టి కోణం నుంచి నిర్వచించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగానే లైంగికంగా వేధించినట్లు భావిస్తే.. శరీరానికి శరీరం (స్కిన్ టు స్కిన్) తాకకపోయినా నేరంగానే నిర్ధారించాలని పేర్కొంది. లైంగిక నేరాన్ని నిర్ధారించడంలో స్కిన్ టు స్కిన్ కాంటాక్టు తప్పనిసరి అని చెబితే ఫలితాలు చాలా దారుణంగా ఉంటాయని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు.యు.లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం వెల్లడించింది. లైంగిక నేరం వెనుక ఉద్దేశాన్ని కచ్చితంగా గుర్తించాలని సూచించింది. బాధితురాలికి, నిందితుడికి మధ్య స్కిన్ టు స్కిన్ కాంటాక్టు జరగలేదు కాబట్టి పోక్సో చట్టం కింద లైంగిక నేరంగా నిర్ధారించలేమంటూ బాంబే హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ రెండు పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానం తన తీర్పును రిజర్వ్ చేసింది. పోక్సో చట్టంలోని సెక్షన్ 7ను ధర్మాసనం క్షుణ్నంగా పరిశీలించింది. లైంగిక వాంఛతో చిన్నారుల శరీర భాగాలను తాకితే.. దాన్ని లైంగిక వేధింపులుగానే భావించాలని ఈ సెక్షన్ చెబుతోంది. -
బాలికలపై లైంగిక నేరాలను ఉపేక్షించేదిలేదు
ముంబై : లైంగిక నేరాలను అదుపు చేయడానికి మహా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడే వారిని ఉపేక్షించేది లేదు, ఇలాంటి కేసులను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత గుర్తిస్తోందని సీనియర్ అధికారి పేర్కొన్నారు. లైంగిక నేరాల అదుపు చేయడంలో భాగం గా రాష్ట్ర బాలల అభివృద్ధి విభాగం, బాలల హక్కు ల పరిరక్షణ కమిషన్, యూనిసెఫ్ సంయుక్తంగా బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడకుండా నిరోధించే పోక్సో చట్టం(20012)పై ఆదివారం సాయంత్రం అవగాహన సదస్సును నిర్వహించింది. రాష్ట్ర ప్రభుత్వం లైంగికనేరాలను జీరోస్థాయికి తీసుకొని రావడమే ధ్యేయంగా ప్రకటించింది. చట్టంపై అవగాహనతోపాటు, లైంగిక నేరాల అదుపునకు అవసరమైన ప్రతిపాదనలు, సూచనలను రూపొం దించడం కోసం నిర్వహించిన ఈ సదస్సు చేసే తీర్మానాలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని అమలు చేయాల ని నిర్ణయించిందని సీనియర్ అధికారి తెలిపారు. మహిళా-బాలికల అభివృద్ధి విభాగం ప్రిన్సిపల్ సెక్రటరీ ఉజ్వల్ ఉకే ఈ సదస్సులో మాట్లాడుతూ బాలికలపై నేరాలకు పాల్పడే కేసుల పట్ల ప్రభుత్వం తక్షణమే స్పందిస్తూ చర్యలు తీసుకొంటుందని చెప్పారు. పోక్సో చట్టం పట్ల అత్యధిక ప్రజల్లో అవగాహన లేదని, అందుకే చట్టం దుర్వినియోగం అవుతోందని, నేరస్తులు సులువుగా తప్పించుకొంటున్నారని చెప్పారు. గత ఐదేళ్లకాలంలో బాలిక పట్ల లైంగిక నేరాల కేసులు అత్యధికంగా నమోదు అయ్యాయని, దీనికి కారణం చట్టం పట్ల అవగాహన లేకపోవడమే కారణమని అన్నారు. బాలికలకు జరిగిన ఘోరాన్ని చెప్పుకోవడం కత్తిమీదసాములా మారిందని, ఇది నిందితులకు అవకాశంగా మారుతోందని అన్నారు. ఈ చట్టం కింది నిందితులకు సరైన శిక్ష పడుతుందని తల్లిదండ్రులు తెసుకోవాలని, తద్వారా నిందితులపై ఫిర్యాదు చేయడానికి ముందుకు రావాలని సూచించారు. అత్యధిక సంఖ్యలో ప్రజల్ని ఈ చట్టం పట్ల చైత్యన్యం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని, దీని ద్వారా నిందితులను శిక్షించే అవకాశం ఉంటుందని అన్నారు. బాధితులు సహకరిస్తేనే బాలికలపై లైంగిక నేరాల సంఖ్య తగ్గుతుందని అన్నారు. చారిటబుల్ ఆర్గనైజేషన్ల ద్వారా బాలికలపై లైంగిక నేరాలకు పాల్పడేవారికి వ్యతిరేకంగా గళం వినిపించాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఈ సదస్సులో ప్రముఖ న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, బాలనేరస్తుల న్యాయవిభా గం జస్టిస్, బాలికల సంక్షేమ కమిటీల స భ్యులు అభిప్రాయాలను వెల్లడించారు. బాలికలపై లైంగిక నేరాలను సహించవద్దని ముక్తకంఠంగా తీర్మానించారు.