టెట్‌కు.. సెట్ కావాలిలా..
ప్రభుత్వ టీచర్ ఉద్యోగం సాధించాలనుకునే వారికి టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)లో అర్హత తప్పనిసరి. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే కాదు. ఇందులో సాధించిన ప్రతి 15 మార్కులకు డీఎస్సీలో 2 మార్కుల వెయిటేజీ ఉంటుంది. అందువల్ల డీఎస్సీ ద్వారా ఉద్యోగం సాధించాలనుకునే అభ్యర్థులు టెట్‌ను కూడా అంతే సీరియస్‌గా తీసుకోవాలి. తెలంగాణ టెట్‌ను మే 22న నిర్వహించనున్నారు.పరీక్షకు ఇంకా కొద్ది రోజులే ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు అన్ని అంశాలను మరోసారి మననంచేసుకోవడంతోపాటు.. కష్టతరంగా ఉన్న విషయాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
టైంటేబుల్ రూపొందించుకుని..
పరీక్షకు ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు అన్ని అంశాలను రివిజన్ చేసుకునేందుకు ప్రత్యేకంగా టైంటేబుల్ రూపొందించుకోవాలి. దీన్ని కచ్చితంగా అనుసరిస్తూ రోజూ అన్ని సబ్జెక్టులను చదివేలా చూసుకోవాలి. క్లిష్టమైన అంశాలను షార్‌టనోట్స్ రూపంలో రాసుకుని వీలైన సమయాల్లో ఎక్కువసార్లు చదువుకుంటూ ఉండాలి. దీనివల్ల అవి బాగా గుర్తుంటాయి.
ముఖ్యాంశాలకు ప్రాధాన్యం..
అభ్యర్థులు పాఠ్యపుస్తకాల్లోని ప్రతి పాఠం చివర ఉండే ‘ముఖ్యాంశాలు’ను తప్పకుండా చదవాలి. దీనివల్ల మొత్తం పాఠాన్ని మరోసారి చదివినట్లవుతుంది. ఏవైనా సందేహాలుంటే నివృత్తి అవుతాయి. అన్ని అంశాలపై స్పష్టత వస్తుంది. టెట్ పేపర్-2లో లాంగ్వేజ్ 1, 2; మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్‌లో ప్రశ్నల క్లిష్టత ఇంటర్ స్థాయి వరకు ఉంటుంది. అందువల్ల అభ్యర్థులు ఆయా అంశాలపై ఇంటర్ స్థాయి వరకు లోతైన అవగాహన కలిగి ఉండాలి.
వీలైనన్ని మోడల్ పేపర్లు..
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో వీలైనన్ని మోడల్ పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ప్రిపరేషన్ పరంగా లోటుపాట్లు తెలుస్తాయి. వాటిని సరిదిద్దుకునేందుకు వీలవుతుంది. ఇంకా ఏవైనా సందేహాలుంటే ఫ్యాకల్టీ సహాయంతో నివృత్తి చేసుకోవాలి.
చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీలో..
టెట్ పేపర్-1, 2ల్లో చైల్డ్ డెవలప్‌మెంట్ అండ్ పెడగాజీకి 30 మార్కులు కేటాయించారు. మిగిలిన వాటితో పోలిస్తే ఇది కొంచెం కష్టమైన సబ్జెక్టు. పరీక్షలో ఈ అంశానికి సంబంధించి ప్రశ్నలు కొంచెం తికమకగా ఉండే అవకాశం ఉంది. డెవలప్‌మెంట్ ఆఫ్ చైల్డ్, అండర్‌స్టాండింగ్ లెర్నింగ్, పెడగాజికల్ కన్సర్న్స్ తదితరాలను ఈ విభాగంలో పేర్కొన్నారు. ముఖ్యంగా ఇందులో ప్రాథమిక భావనలను అర్థం చేసుకుంటూ చదవడం వల్ల అన్ని అంశాలపై పట్టు ఏర్పడుతుంది. ఎక్కువ మార్కులు సాధించేందుకు అవకాశం ఉంటుంది. పరీక్షకు ఉన్న ఈ కొద్ది సమయంలో అభ్యర్థులు వీటిని చదివేందుకు రోజూ కొంత సమయం కేటాయించాలి. అవసరమైతే ముఖ్యమైన అంశాలను ఒక పుస్తకంలో రాసుకుని రోజులో వీలైనన్ని ఎక్కువసార్లు చదవడం వల్ల బాగా గుర్తుంటాయి.
లాంగ్వేజ్‌లలో..
టెట్ పేపర్-1, 2ల్లో లాంగ్వేజ్ 1, 2 (తెలుగు, ఇంగ్లిష్)కు 30 మార్కుల చొప్పున కేటాయించారు. ముఖ్యంగా తెలుగు సబ్జెక్టు కొంత తేలిగ్గా అనిపించినా... వ్యాకరణం, సంధులు, సమాసాలు వంటివి కొంత తికమకకు గురిచేస్తాయి. అందువల్ల అభ్యర్థులు ఈ అంశాలపై దృష్టి సారించాలి. అలాగే ఇంగ్లిష్‌లో కూడా కష్టతరంగా భావించే అంశాలను రోజూ మననం చేసుకుంటూ ఉండాలి.
బోధనాపద్ధతుల్లో..
లాంగ్వేజ్‌లతో పాటు ఇతర అంశాలకు సంబంధించి బోధనాపద్ధతులకు కూడా మార్కులు కేటాయించారు. ఇది కూడా అభ్యర్థులకు కొంత కష్టంగా అనిపించేదే. ఇందులో ఎక్కువ మార్కులు సాధించాలంటే.. బోధన పద్ధతులు, బోధనోపకరణాలు, మూల్యాంకనం, కరిక్యులంపై ఎక్కువ దృష్టిసారించాలి.
ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్‌లో..
టెట్ పేపర్ 1లో ఈ అంశానికి 30 మార్కులు కేటాయించారు. ఇందులో మై ఫ్యామిలీ, వర్క్ అండ్ ప్లే, ప్లాంట్స్ అండ్ యానిమల్స్, అవర్ ఫుడ్, ఎనర్జీ, వాటర్, అవర్ కంట్రీ తదితర అంశాలను పేర్కొన్నారు. ఇందులో ఎక్కువ మార్కులు సాధించాలంటే.. ఇటీవలి కాలంలో వాతావరణంలో సంభవిస్తున్న మార్పులు, నీటి కొరత, వర్షాభావం, తెలంగాణలో కరువు మండలాలు తదితర అంశాలపై దృష్టి సారించాలి. రోజూ దినపత్రికలు చదివేవారికి ఈ అంశాలపై ఎక్కువ పట్టు ఉంటుంది.