గురుకులాల్లో టీచర్ల భర్తీ విషయంలో అస్పష్టత
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు వెయిటేజీ ఉంటుందా, ఉండదా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) ఉత్తర్వుల ప్రకారం ఒకటి నుంచి 8వ తరగతి వరకు బోధించే వారు టెట్ అర్హత సాధించి ఉంటేనే ఉపాధ్యాయ పోస్టుల్లో నియామకాలు పొందేందుకు అర్హులు. అయితే ఇటీవల గురుకులాల్లోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీకి జారీ చేసిన మార్గదర్శకాల్లో ప్రభుత్వం టెట్ ప్రస్తావనే చేయలేదు.
దీనిపై ప్రభుత్వానికి లేఖ రాసిన విద్యా శాఖ.. ఎన్‌సీటీఈ ఆదేశాల ప్రకారం 8వ తరగతిలోపు బోధించే టీచర్ కచ్చితంగా టెట్ అర్హత సాధించి ఉండాలన్న విషయాన్ని స్పష్టం చేసింది. దీంతో గురుకుల విద్యాలయాల సొసైటీలు టెట్‌ను అర్హత పరీక్షగా తీసుకుంటామని పేర్కొన్నాయి. మరోవైపు టెట్ స్కోర్‌కు ప్రాధాన్యం, కొంత వెయిటేజీ ఇవ్వాలని ఎన్‌సీటీఈ అదే మార్గదర్శకాల్లో పేర్కొంది.
దీంతో ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులిచ్చింది. విద్యా శాఖ ఈ నిబంధనను పాటిస్తూ, టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ, రాత పరీక్ష స్కోర్‌కు 80 శాతం వెయిటేజీ ఇచ్చి నియామకాలు చేపడుతోంది. కాని దీనిపై గురుకుల సొసైటీలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
టెట్‌ను అర్హత పరీక్షగా పరిగణనలోకి తీసుకుంటామన్నాయే తప్ప టెట్ స్కోర్ వెయిటేజీ విషయంపై నిర్ణయానికి రాలేదు. ప్రస్తుతం టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ కసరత్తు చేస్తోంది. టెట్ స్కోర్‌కు వెయిటేజీ ఇవ్వాలా, వద్దా అన్న అంశంపై గురుకుల సొసైటీలను స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నట్లు తెలిసింది. సొసైటీలు నిర్ణయాన్ని తెలిపిన వెంటనే టీఎస్‌పీఎస్సీ 2,500కు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది.
‘టెట్’ వెయిటేజీపై తొలగని సందిగ్ధం
Published Wed, Aug 17 2016 1:49 AM | Last Updated on Mon, Sep 4 2017 9:31 AM
Advertisement
Advertisement