డీఎస్సీ.. దగా . | DSC .. dishonesty. | Sakshi
Sakshi News home page

డీఎస్సీ.. దగా .

Published Mon, Jan 5 2015 2:08 AM | Last Updated on Fri, May 25 2018 5:44 PM

డీఎస్సీ.. దగా . - Sakshi

డీఎస్సీ.. దగా .

సాధ్యం కాని హామీలతో ఎన్నికల్లో గెలిచిన టీడీపీ నిరుద్యోగ ఉపాధ్యాయులతో చెలగాటమాడుతోంది. ఊరించి.. ఊరించి విడుదల చేసిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలో (టెట్ అండ్ టీఆర్‌టీ) ‘బాబు మార్క్’ కొర్రీల్లో ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. రుణమాఫీని తలపిస్తున్న ఈ డీఎస్సీ నోటిఫికేషన్ అర్హులైన అభ్యర్థుల పాలిట శాపంలా మారింది. తాజాగా ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులకు అర్హతపై సందిగ్ధత నెలకొంది.
 
 నెల్లూరు(విద్య) : నెల్లూరు బాలాజీనగర్‌కు చెందిన రమేష్ చదువు పదో తరగతి వరకు సాఫీగా సాగింది. వేసవి సెలవుల్లో కూలి పని చేసే తండ్రి అకస్మాత్తుగా మరణించాడు. తల్లితోపాటు తాను కూలి పనులకు పోవడం ప్రారంభించాడు. ఇద్దరు చెల్లెళ్లతోపాటు తల్లి బాధ్యత మీద పడింది. దీంతో ఇంటర్మీడియట్ చేరే అవకాశం లేకుండా పోయింది. కూలి పనులు నుంచి వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకుంటూ వచ్చాడు.

చదువు మీద ఆశ చావలేదు. దీంతో దృష్టి ఓపెన్ యూనివర్సిటీపై పడింది. ఇంటర్మీడియట్ లేకుండానే ఓపెన్ యూనివర్సిటీలో చేరి డిగ్రీ పూర్తి చేశాడు. అంతటితో ఆగకుండా అప్పులు చేసి బీఈడీ చదివి పట్టా సాధించాడు. తాజాగా బీఎస్సీ నోటిఫికేషన్ వెలువడంతో కష్టాలు తీరిపోయాయని ఎగిరి గంతేశాడు. తీరా దరఖాస్తు చేసుకునేందుకు వెళ్తే ఓపెన్ యూనివర్సిటీలో చదివిన విద్యార్థులు అర్హులా కాదా అనే అంశంపై అధికారులు తర్జభర్జన పడ్డారు. స్పష్టమైన ఆదేశాలు లేవన్నారు. రెండు రోజుల తర్వాత రమ్మన్నారు.

తీరా రెండు రోజుల తర్వాత వెళ్లిన రమేష్‌కు పిడుగులాంటి వార్త అధికారులు చెప్పారు. ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ చేసినా, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఉంటే డీఎస్సీకి అర్హులని అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు. ఏమి చేయాలో తెలియక రమేష్ దిగాలు పడిపోయాడు. ఇలా రమేష్ ఒక్కడే కాదు. ఓపెన్ యూనివర్సిటీల ద్వారా డిగ్రీ, ఆపై బీఈడీ చేసిన విద్యార్థులకు బాబు ప్రభుత్వం పెట్టిన మెలిక వారిపాలిట శాపంగా మారింది.

అసలు ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులను బీఈడీకి అర్హులను చేయడం తప్పని విద్యాశాఖ అధికారులు కొందరు మాట్లాడుకోవడం వారికి మరింత బాధను కలిగిస్తోంది. ప్రతి ఒక్కరూ చదవాలనే ప్రకటనలు గుప్పించే ప్రభుత్వం కష్టాలుపడి చదుుకున్న వారికి ప్రోత్సహించే తీరు ఇదేనా అని ప్రశ్నను రేకెత్తిస్తోంది.

ప్రయోజనంలేని దూర విద్య విధానాన్ని ప్రవేశపెట్టిన ప్రభుత్వందే తప్పవుతుందని వారు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగానికి పనికిరాని చదువులకోసం తాము పడిన కష్టాన్ని కనబడిన వారందరికీ ఏడుస్తూ వివరిస్తున్నారు.

 బాబు మార్క్ కొర్రీలు...
 నోటిఫికేషన్ వెలువడిన తర్వాత 20 శాతం పోస్టులకు అనధికారికంగా కోత విధించారు. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఒప్పుకోవడంలేదనే సాకు చూపారు.

 బీకాం విద్యార్థులకు సంబంధిత కోర్సులు నాలుగు సబ్జెక్టులు ఉండాలనే నిబంధన, ఇండస్ట్రీయల్ ఆర్గనైజేషన్, బిజినెస్ ఆర్గనైజేషన్ పేపర్లు రెండూ ఒకటేనా లేదా అనే అంశంపై స్పష్టత లేదు.

 బీఎస్సీ విద్యార్థుల్లో రెండు సబ్జెక్టులు సైన్స్‌కు సంబంధించినవి ఉండాలన్నారు. మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, బయోటెక్, డెయిరీ సైన్స్ చదివిన అభ్యర్థుల అర్హతపై స్పష్టత లేదు.

 సోషల్‌లో ఏఈఎస్ (అకౌంట్స్, ఎకనామిక్స్, స్టాటస్టిక్స్) గ్రూప్ అభ్యర్థులకు బీఈడీలో మెథడాలజీకి సంబంధించిన అంశంపై స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు అర్హత కోల్పోయారు.

 ఓపెన్ యూనివర్సిటీ విద్యార్థులు కచ్చితంగా ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఉంటేనే అర్హులని ప్రకటించారు. అదే ఉంటే ఓపెన్ యూనివర్సిటీ ఎందుకు అని వారి వాదన.   

 ఇంటర్ తత్సమాన అర్హత.. గతంలో ఇంటర్మీడియట్‌కు సమాన అర్హతగల బీఓఎల్ (బ్యాచలర్ ఆఫ్  ఓరియంటల్ లాంగ్వేజెస్)ను ఈ నోటిఫికేషన్‌లో ప్రస్తావించలేదు.

 సక్సెస్ స్కూల్‌లో ఇంగ్లిష్ మీడియం నిర్వహిస్తున్నప్పటికీ ఇంగ్లిష్ మాధ్యమ ఉపాధ్యాయుల పోస్టులకు నోటిఫికేషన్‌లో తావు లేకుండా పోవడం.

 గత మూడు డీఎస్సీల్లో ఉర్దూ భాషాపండితులను ఎస్సీ, ఎస్టీ విభాగాలకు కేటాయించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జిల్లాలో 18 ఉర్దూ ఎస్‌జీటీలు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిని డీ రిజర్వ్ చేసి ఓపెన్ కేటగిరి చేయాల్సి ఉంది. ఆ అంశం, నోటిఫికేషన్‌లో లేదు.

 ఇలా ఎన్నికల్లో హామీలిచ్చి కొర్రీలు పెట్టి డీఎస్సీ అభ్యర్థులతో చెలగాటమాడుతున్న క్రమంలో మేలో డీఎస్సీ నిర్వహిస్తారా లేదా అనే నియమాంశ అటు విద్యావేత్తల్లో ఇటు అభ్యర్థుల్లో నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement