1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌లకు ఉద్యోగాలివ్వాలి  | 1998 DSC Qualified to be employed | Sakshi
Sakshi News home page

1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌లకు ఉద్యోగాలివ్వాలి 

Published Mon, Jul 10 2023 3:01 AM | Last Updated on Mon, Jul 10 2023 7:35 AM

1998 DSC Qualified to be employed - Sakshi

పంజగుట్ట (హైదరాబాద్‌): వచ్చే ఆగస్టు 15వ తేదీ లోపు 1998 డీఎస్సీ క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చి, స్వాతంత్య్ర వేడుకలను పాఠశాలల్లో నిర్వహించుకునేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ చొరవచూపాలని 1998 డీఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక సార్లు తమను ఉద్యోగాల్లోకి తీసుకుంటామని స్పష్టమైన హామీ ఇచ్చారని పేర్కొన్నారు.

ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి 4,567 మంది డీఎస్సీ–1998 క్వాలిఫైడ్‌ అభ్యర్థులకు ఎమ్‌టీఎస్‌ పద్ధతిలో ఉద్యోగాలు ఇస్తూ.. అభ్యర్థులనుంచి అంగీకార పత్రాలు కూడా తీసుకున్నారని గుర్తుచేశారు. అయితే తెలంగాణలో 1,500 మంది అభ్యర్థులు ఉద్యోగాలు పొందలేకపోయామని, ఇప్పటికే మానసిక వేదనతో సుమారు 100 మంది మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు.

2016 జనవరిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమను పిలిపించుకుని సుమారు రెండున్నర గంటలు చర్చించారని, న్యాయ, సాంకేతిక సమస్యలు ఏమున్నా సరిదిద్ది, సూపర్‌ న్యూమరరీ పోస్టులు సృష్టించి అయినా న్యాయం చేస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.

కాగా, ముఖ్యమంత్రి హామీ మేరకు సాధారణ ఎన్నికలు మొదలు, జీహెచ్‌ఎంసీ, ఎమ్మెల్సీ అన్ని ఎన్నికల్లో సంపూర్ణ మద్దతు ఇచ్చామని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సమితి గౌరవాధ్యక్షుడు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement