* జిల్లాకు 907 పోస్టులు మంజూరు
* డీఎస్సీ ప్రక్రియను టెట్ కంటీఆర్‌టీగా మార్పు
* డిసెంబర్ 3 నుంచి దరఖాస్తుల స్వీకరణ
* వచ్చే ఏడాది మేలో రాత పరీక్షలు
గుంటూరు ఎడ్యుకేషన్ : ఎన్నాళ్లుగానో ఊరిస్తూ వచ్చిన ఉపాధ్యాయుల నియూమకానికి ఎట్టకేలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గత సెప్టెంబర్ ఐదో తేదీన డీఎస్సీ-2014 ప్రక్రియ రెండున్నరల నెలల అనంతరం మొదలుకాబోతోంది. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఇప్పటి వరకూ కొనసాగించిన టెట్, డీఎస్సీ ప్రక్రియలను రద్దుచేసిన ప్రభుత్వం వాటి స్థానంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కం రిక్రూట్‌మెంట్ టెస్ట్(టెట్ కం టీఆర్‌టీ)ను ప్రవేశ పెట్టింది.
ఇందులో భాగంగా జిల్లాలో 907 పోస్టులు భర్తీ కానున్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పరిమితమైన బీఈడీ అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పిస్తామని గత సెప్టెంబర్ 5న జారీ చేయాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియను వాయిదా వేసిన ప్రభుత్వం దీనిపై ఎటూ తేల్చలేదు. బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టుల్లో అర్హత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో చివరికి పాత విధానంలోనే బీఈడీలతో స్కూల్ అసిస్టెంట్స్, డీఈడీలతో ఎస్జీటీ పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించి జీవో విడుదల చేసింది.
ఇందులో భాగంగా డిసెంబర్ 3వ తేదీ నుంచి జనవరి 17వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరించనుంది. వచ్చే ఏడాది మే 9, 10, 11 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించి జూన్ 28న ఫలితాలు విడుదల చేయనుంది. ఎస్జీటీ పోస్టులకు 180 మార్కులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 200 మార్కులుగా ఖరారు చేశారు.
కేటగిరీల వారీగా పోస్టులు.. జిల్లాకు మంజూరైన పోస్టుల్లో ఎస్జీటీ తెలుగు-672, ఉర్ధూ-10, స్కూల్ అసిస్టెంట్ విభాగంలో తెలుగు-51, గణితం-16, భౌతికశాస్త్రం-4, జీవశాస్త్రం-17, ఇంగ్లిష్-10, సాంఘికశాస్త్రం-52, సంస్కృతం-1, భాషా పండిట్ ఉర్దూ-1, తెలుగు-15, సంస్కృతం ఒక పోస్టు, పీఈటీలు 23 పోస్టుల చొప్పున ఉన్నాయి.
టీచర్‌పోస్టుల జాతర
Published Fri, Nov 21 2014 1:44 AM | Last Updated on Sat, Sep 2 2017 4:49 PM
Advertisement
Advertisement