పేపర్-1లో 73.92 శాతం మందికి అర్హత
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. మార్చి 16న జరిగిన ఈ పరీక్ష ఫలితాలను టెట్ వెబ్‌సైట్ www.aptet.cgg.gov.in లో పొందుపరిచారు. పేపర్-1కు 56,929 మంది, పేపర్-2కు 3,40,561 మంది అభ్యర్థులు హాజరయ్యారు. డీఎడ్ అభ్యర్థులు రాసిన పేపర్-1లో 42,086 మంది (73.92 శాతం) మంది అర్హత సాధించారు. బీఎడ్ అభ్యర్థులు రాసిన పేపర్-2లో 1,10,099 మంది (32.32 శాతం) అర్హత మార్కులు సంపాదించారు. టెట్‌లో అర్హత సంపాదించడానికి మొత్తం 150 మార్కుల్లో జనరల్ అభ్యర్థులకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 40 శాతం మార్కులు రావాలి. ఈసారి నలుగురు విద్యార్థులకు గరిష్టంగా 135 మార్కులొచ్చాయి. మార్కుల జాబితాలను మే 15 నుంచి వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికార వర్గాలు చెప్పాయి.
అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను కూడా వెబ్‌సైట్‌లో చూసుకోవడానికి అవకాశం కల్పించామన్నాయి. ఇవి జూన్ 15 దాకా సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నాయి. పలుమార్లు ఆలస్యమయ్యాక చివరికి మార్చి 16న టెట్ జరగడం తెలిసిందే. విద్యా శాఖ ప్రకటించిన ‘కీ’ మీద దాదాపు 25 వేల అభ్యంతరాలు రావడం, విద్యా శాఖ కమిషనర్ జగదీశ్వర్ ఎన్నికల విధులపై ఇతర రాష్ట్రాలకు వెళ్లడం తదితర కారణాల వల్ల ఫలితాల వెల్లడి కూడా ఆలస్యమైంది.