D ed students
-
ఏప్రిల్‌లో డీఎడ్ వార్షిక పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) విద్యార్థులకు ఏప్రిల్‌లో వార్షిక పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. డీఎడ్ ప్రథమ సంవత్సర విద్యార్థులు వచ్చేనెల 1లోగా పరీక్ష ఫీజు చెల్లించాలని పేర్కొంది. రూ.50 ఆలస్య రుసుముతో వచ్చేనెల 7 లోగా ఫీజు చెల్లించవచ్చంది. 2015–17 బ్యాచ్ నుంచి కొత్త సిలబస్‌లో చదువుకొని ఒకసారి ఫెయిలైన వారు మాత్రమే ఈ పరీక్షలకు అర్హులని పేర్కొంది. రెగ్యులర్ విద్యార్థులకు రూ.150 పరీక్ష ఫీజుగా నిర్ణయించినట్లు తెలిపింది. ఫెయిలైన విద్యార్థులు 4 లేదా అంతకంటే ఎక్కువ సబ్జెక్టులకు రూ.150 చెల్లించాలని పేర్కొంది. మూడు సబ్జెక్టులకు రూ.140, రెండు సబ్జెక్టులకు రూ.120, ఒక సబ్జెక్టుకు రూ.100 చెల్లించాలని పేర్కొంది. డీఎడ్ రెండో ఏడాది విద్యార్థులు ఈ నెల 24లోగా ఫీజు చెల్లించాలని పేర్కొంది. రూ.50 ఆలస్య రుసుముతో ఈ నెల 28లోగా ఫీజు చెల్లించవచ్చంది. ఓల్డ్ సిలబస్ వారికి ఇదే ఆఖరి చాన్స్ అని, సష్టం చేసింది. విద్యార్థులు నాలుగు లేదా ఐదు సబ్జెక్టులకు రూ.250, మూడు సబ్జెక్టులకు రూ.175, రెండు సబ్జెక్టులకు రూ.150, ఒక సబ్జెక్టుకు రూ.125 చెల్లించాలని తెలిపింది. ఆన్లైన్లో దరఖాస్తులు అప్లోడ్ చేసే లింక్‌ను ఈ నెల 24వ తేదీ నుంచి అందుబాటులోకి తెస్తామని వివరించింది. -
డీఎడ్ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్..!
మైదుకూరు టౌన్ : ఉపాధ్యాయ ఎంపిక కోసం డీఎడ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే డీఎస్సీ పరీక్ష రాసేందుకు అర్హులౌతారు. తమ సొంత పనులు చేసుకుంటూ డీఎడ్ చదివినట్లు సర్టిఫికెట్లు పుట్టించేందుకు అభ్యర్థులు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇదే అదునుగా భావించిన యాజమాన్యాలు అభ్యర్థుల దగ్గర భారీగా డబ్బులు తీసుకుని కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. మైదుకూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో రెండు రోజులు నుంచి డీఎడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష కేంద్రానికి చాపాడు మండలంలోని చాపాడు, చిన్నగులవలూరు, మైదుకూరు బాలశివా డీఎడ్ కళాశాల విద్యార్థులు 305మందికి గాను శుక్రవారం 284 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసే విద్యార్థులు కళాశాలకు వెళ్లకుండా ఫీజులు పరీక్షలు రాస్తామని ముందే యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకుంటారు. దీంతో పరీక్ష సమయంలో ఆ కళాశాలల యాజమాన్యమే విద్యార్థుల వద్ద డబ్బును వసూలు చేసి ఎవరైతే చీఫ్‌గా ఉంటారో, వారిని స్క్వాడ్‌తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంటారు. దీంతో పరీక్ష రాసే విద్యార్థులు యాజమాన్యాలను నమ్మి వారికి లక్షల రూపాయలు కట్టబెడుతున్నారు. అధికారుల కనుసన్నల్లో కాపీయింగ్... డీఎడ్ పరీక్ష ఉదయం 9.30గంటలకు ప్రారంభమై 12గంటలకు ముగుస్తుంది. అయితే పరీక్ష ప్రారంభం కొద్ది సేపు ముందు భాగంలో గేటుకు తాళం వేయించి ఏ ఒక్కరూ లోపలికి రాకుండా అధికారులే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వారికి పుస్తకాలను, మైక్రోజిరాక్స్‌లను అందిస్తున్నారు. పరీక్ష కేంద్రంలో బిట్స్‌ను చెప్పేందుకు అధికారి సమీపం వారైన ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా వేయించి వారిచేత బిట్స్, చీటీలను అందిస్తున్నారు. డబ్బులు కట్టిన వారికి ఒక విధంగా, కట్టనివారికి ఒక విధంగా పరీక్ష హాల్లో జరుగుతున్నట్లు పరీక్ష రాసే విద్యార్థులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. కిటీకిల వద్ద పరీక్షకు సంబంధించిన చీటీలు, పుస్తకాలు అక్కడే ఉన్నాయని పరీక్ష అధికారి వివరణ కోరగా అవేమో తెలియదు.. పరీక్షలు మాత్రం పూర్తి నిఘాతో నిర్వహిస్తున్నామని అధికారులు నమ్మబలుకుతున్నారు. భావి తరాల ఉపాధ్యాయులే పరీక్ష సమయంలో ఇలా మాస్ కాపీయింగ్ పాల్పడితే రాబోవు విద్యార్థులు ఏవిధంగా పరీక్షలు నిర్వహిస్తారో అట్లే అర్థం అవుతుంది. నిస్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పరీక్ష అధికారులే ఇలా అవినీతికి పాల్పడటం సరైన పద్దతికాదు. కాపీలు కొట్టించడం లేదు పరీక్ష కేంద్రం చీఫ్ సత్యనారాయణను కాపీయింగ్‌పై వివరణ కోరగా గట్టి నిఘాలో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు విషయాన్ని డీఈఓకు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సిట్టింగ్ స్క్వాడ్ ఎంఈఓ పద్మలతను వివరణ కోరగా కాపీలు జరగడం లేదన్నారు. -
అయోమయం..ఆందోళన
కడప, బద్వేలు : డిప్లొమో ఇన్ ఎడుకేష్యన్ (డీఎడ్) పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఈ ఏడాది విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 2016–17 ఏడాదిలో మొదటి సంవత్సరం అభ్యసించిన విద్యార్థులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆయోమయానికి గురవుతున్నారు. ఈ ఏడాది వారికి నిర్వహించాల్సిన వార్షిక పరీక్షలు చేపట్టలేదు. ప్రస్తుతం వారంతా రెండవ సంవత్సరం చదువుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17 నుంచి మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరు కావాల్సి వస్తోంది. ఇవి ముగిసిన మరో మూడు నెలల్లోనే రెండవ సంవత్సరం పరీక్షలు రాయాల్సి ఉంది. దీనికి తోడు ప్రస్తుతం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నోటిఫికేషన్ విడుదల చేశారు. మొదటి సంవత్సరం వార్షిక పరీక్షల అనంతరం టెట్‌కు చదవాలా.. రెండవ సంవత్సరం పరీక్షలకు సన్నద్ధం కావాలా.. అనే సందేహంలో విద్యార్థులు ఉన్నారు డీఎడ్ ప్రవేశాలు 2016–17 విద్యా సంవత్సరంలో ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. సాధారణంగా జూన్ నెలలో జరగాల్సిన అడ్మిషన్లు నవంబరులో జరగడంతో విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో వారికి వార్షిక పరీక్షలు కూడా ఆలస్యంగానే నిర్వహిస్తున్నారు. రెండవ సంవత్సరం పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇలా చదవి పరీక్షలు రాయడం వల్ల ఫలితాల్లో ప్రభావం పడుతుందని విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో 78 డీఎడ్ కళాశాలలుండగా, వీటిలో 6,500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు. విద్యార్థుల్లో ఆందోళన.. 2017–18 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం చేరిన విద్యార్థులు తమకు ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారో అని ఎదురు చూస్తున్నారు. తమ కంటే ముందు చేరిన విద్యార్థులే ప్రస్తుతం మొదటి ఏడాది పరీక్షలు రాస్తున్నారని, తమకు ఎప్పుడు నిర్వహిస్తారో అని ప్రశ్నిస్తున్నారు. తాము కూడా వీరిలానే ఒకే ఏడాది రెండు పరీక్షలు రాయాల్సి వస్తుందేమోనని వారిలో ఆందోళన నెలకొంది. రెండవ సంవత్సరం తరగతులు జరుగుతుండగా.. తాము చదివి వదిలేసిన మొదటి సంవత్సరం పరీక్షలు రాయాల్సి రావడంతో సన్నద్ధానికి సమయం సరిపోదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే రెండవ సంవత్సరం ప్రాక్టికల్స్ పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉందని వాపోతున్నారు. మండే ఎండలోనే సన్నద్ధం.. సరైన ప్రణాళిక లేకుండా పరీక్షల షెడ్యూల్ ప్రకటిం చడం.. వాటిని కూడా వేసవిలో నిర్వహించడం వి ద్యార్థులకు ఇబ్బందిగా మారింది. మండుటెండల్లో ç పరీక్షలు రాయడం ఫలితాలపై ప్రతికూల ప్రభా వం చూపుతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెట్ ఎలా..! ప్రస్తుతం రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులకు గతంలో టెట్ అవకాశం కల్పించారు. ప్రస్తుతమూ కల్పించాలని వారంతా కోరుతున్నారు. అవకాశం కల్పిస్తే టెట్‌కు ఎలా సన్నద్ధం కావాలో తెలియక ఆయోమయంలో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం విద్యా సంవత్సరం ప్రారంభించి పరీక్షలు నిర్వహించి ఉంటే ఈ ఇబ్బందులు వచ్చేవి కావని వారు పేర్కొంటున్నారు. -
ఏప్రిల్ 27 నుంచి దూరవిద్య డీఎడ్ పరీక్షలు
సాక్షి, హైదరాబాద్: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సు మొదటి సెమిస్టర్ పరీక్షలు ఏప్రిల్ 27 నుంచి ప్రారంభం కానున్నాయి. పరీక్షలు 3 రోజులు జరుగుతాయని ఎన్ఐఓఎస్ రీజనల్ డైరెక్టర్ అనిల్‌కుమార్ తెలిపారు. ఫీజు చెల్లించినా స్టడీ సెంటర్లు కేటాయిం చని వారు, 75% హాజరు లేని వారు జిల్లా విద్యాశాఖ అధికారులను సం ప్రదించి వారికి కేటాయించిన స్టడీ సెంటర్లలో రిపోర్టు చేయాలన్నారు. -
ఇదేం ‘శిక్ష’ణ గురువా
ఏలూరు సిటీ :దేశ భవిష్యత్ తరగతి గదిలో రూపు దిద్దుకుంటుందంటారు. అటువంటి తరగతి గదుల నిర్వాహకులైన ఉపాధ్యాయులను తీర్చిదిద్దవలసిన శిక్షణ కేంద్రంలో బోధించేవారు కరువయ్యారు. గురువులే లేని చదువులతో ఉపాధ్యాయులుగా మారుతున్న వీరంతా విద్యార్థులకు ఎలాంటి దిశా నిరేశం చేస్తారో. పాలకులు, అధికారులకే తెలియాలి. జిల్లాలోని దూబచర్లలోని డైట్ కాలేజీలో పరిస్థితి చూస్తే పాలకులకు విద్యావ్యవస్థపై ఎంతటి గౌరవం ఉందో అర్థమౌతుంది. కనీస సౌకర్యాలను పక్కనబెడితే అసలు అక్కడి డీఎడ్ విద్యార్థులకు ఇస్తున్న శిక్షణ దారుణంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ డైట్ కాలేజీలో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చదువుతున్న విద్యార్థులు 300మంది ఉన్నారు. తెలుగు మీడియంలో రెండు సంవత్సరాలకు 200 మంది, ఉర్దూ మీడియంలో రెండేళ్లకు 100 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి విద్యాబోధన చేసేందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 25 మంది అధ్యాపకులు పనిచేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం పని చేస్తున్నది ఐదుగురు మాత్రమే. అంటే ఈ విద్యార్థులకు ఏ మేరకు నాణ్యమైన విద్య అందుతుంతో ఇట్టే అవగతం అవుతోంది. లెక్కకు ఐదుగురున్నా బోధించేది ముగ్గురే! దూబచర్లలోని డైట్ కాలేజీలో ప్రిన్సిపాల్‌తో కలిపి ఇద్దరు రెగ్యులర్ అధ్యాపకులు, ఇద్దరు డెప్యుటేషన్‌పై వచ్చిన అధ్యాపకులు, ఒకరు ట్యూటర్ స్థాయి అధ్యాపకులు ఉన్నారు. ఈ ఐదుగురులోనూ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న కె.చంద్రకళ గోపన్నపాలెంలోని వ్యాయామ కళాశాలకు ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ మరో రెగ్యులర్ అధ్యాపకులుగా ఉన్న ఏడీవీ ప్రసాద్ జిల్లా పరిషత్ ఉప విద్యాధికారిగా అదనపు బాధ్యతలు మోస్తున్నారు. వీరిద్దరూ ఏ మేరకు విద్యార్థులకు పాఠాలు చెప్పగలరో ఇట్టే తెలిసిపోతోంది. ఇక సైకాలజీ సబ్జెక్టు బోధిస్తున్న ఎన్.సుబ్రహ్మణ్యం డైట్ కాలేజీలోని స్టూడెంట్ హాస్టల్‌కు వార్డెన్గానూ పనిచేస్తున్నారు. ఉర్దూ మీడియం విషయానికి వస్తే రెండు సంవత్సరాలకు కలిపి ఒక్కరే 100 మందికి పాఠాలు బోధిస్తున్నారు. తెలుగు సబ్జెక్టుకు ఒక అధ్యాపకురాలుడెప్యుటేషన్పై పనిచేస్తున్నారు. ట్యూటర్ స్థాయి వ్యక్తితో పాఠాలు చెప్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాఠాలు నేర్చుకుంటున్న డీఎడ్ విద్యార్థులు కోర్సులు పూర్తిచేసుకుని డీఎస్సీ రాసేసి ఉపాధ్యాయులుగా వచ్చేస్తే ఎలాంటి విద్యాబోధన జరుగుతుందో అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్పందించని అధికారులు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం.. నాణ్యమైన విద్యను అందిస్తామని తరచూ వల్లె వేసే పాలకులు వీటిపై దృష్టి సారించకపోవటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ నిబంధనల మేరకు అధ్యాపకులను నియమించి, నాణ్యమైన విద్యను అందించాలని కోరుతున్నారు. కనీసం డెప్యుటేషన్‌పైన అయినా అధ్యాపకులను నియమించాలని కోరుతున్నారు. విద్యార్థులు గైడ్లను ఆశ్రయించటం మినహా గత్యంతరం లేని స్థితిలో ఉన్నారు. తాము గొప్పగా చదవాలని ఆశగా డీఎడ్ కోర్సులో చేరితే ఇక్కడ తమకు అన్నీ కష్టాలేనని విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
టెట్ ఫలితాలు విడుదల
పేపర్-1లో 73.92 శాతం మందికి అర్హత సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. మార్చి 16న జరిగిన ఈ పరీక్ష ఫలితాలను టెట్ వెబ్సైట్ www.aptet.cgg.gov.in లో పొందుపరిచారు. పేపర్-1కు 56,929 మంది, పేపర్-2కు 3,40,561 మంది అభ్యర్థులు హాజరయ్యారు. డీఎడ్ అభ్యర్థులు రాసిన పేపర్-1లో 42,086 మంది (73.92 శాతం) మంది అర్హత సాధించారు. బీఎడ్ అభ్యర్థులు రాసిన పేపర్-2లో 1,10,099 మంది (32.32 శాతం) అర్హత మార్కులు సంపాదించారు. టెట్‌లో అర్హత సంపాదించడానికి మొత్తం 150 మార్కుల్లో జనరల్ అభ్యర్థులకు 60 శాతం, బీసీలకు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు 40 శాతం మార్కులు రావాలి. ఈసారి నలుగురు విద్యార్థులకు గరిష్టంగా 135 మార్కులొచ్చాయి. మార్కుల జాబితాలను మే 15 నుంచి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికార వర్గాలు చెప్పాయి. అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లను కూడా వెబ్సైట్లో చూసుకోవడానికి అవకాశం కల్పించామన్నాయి. ఇవి జూన్ 15 దాకా సైట్లో అందుబాటులో ఉంటాయని పేర్కొన్నాయి. పలుమార్లు ఆలస్యమయ్యాక చివరికి మార్చి 16న టెట్ జరగడం తెలిసిందే. విద్యా శాఖ ప్రకటించిన ‘కీ’ మీద దాదాపు 25 వేల అభ్యంతరాలు రావడం, విద్యా శాఖ కమిషనర్ జగదీశ్వర్ ఎన్నికల విధులపై ఇతర రాష్ట్రాలకు వెళ్లడం తదితర కారణాల వల్ల ఫలితాల వెల్లడి కూడా ఆలస్యమైంది.