మైదుకూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో పరీక్ష రాసేవారికి పుస్తకాలను అందించి పడేసిన ఇన్విజిలేటర్లు, సిబ్బంది
మైదుకూరు టౌన్ : ఉపాధ్యాయ ఎంపిక కోసం డీఎడ్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే డీఎస్సీ పరీక్ష రాసేందుకు అర్హులౌతారు. తమ సొంత పనులు చేసుకుంటూ డీఎడ్ చదివినట్లు సర్టిఫికెట్లు పుట్టించేందుకు అభ్యర్థులు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ఇదే అదునుగా భావించిన యాజమాన్యాలు అభ్యర్థుల దగ్గర భారీగా డబ్బులు తీసుకుని కాపీయింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. మైదుకూరు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో రెండు రోజులు నుంచి డీఎడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష కేంద్రానికి చాపాడు మండలంలోని చాపాడు, చిన్నగులవలూరు, మైదుకూరు బాలశివా డీఎడ్ కళాశాల విద్యార్థులు 305మందికి గాను శుక్రవారం 284 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష రాసే విద్యార్థులు కళాశాలకు వెళ్లకుండా ఫీజులు పరీక్షలు రాస్తామని ముందే యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకుంటారు. దీంతో పరీక్ష సమయంలో ఆ కళాశాలల యాజమాన్యమే విద్యార్థుల వద్ద డబ్బును వసూలు చేసి ఎవరైతే చీఫ్‌గా ఉంటారో, వారిని స్క్వాడ్‌తో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుంటారు. దీంతో పరీక్ష రాసే విద్యార్థులు యాజమాన్యాలను నమ్మి వారికి లక్షల రూపాయలు కట్టబెడుతున్నారు.
అధికారుల కనుసన్నల్లో కాపీయింగ్...
డీఎడ్ పరీక్ష ఉదయం 9.30గంటలకు ప్రారంభమై 12గంటలకు ముగుస్తుంది. అయితే పరీక్ష ప్రారంభం కొద్ది సేపు ముందు భాగంలో గేటుకు తాళం వేయించి ఏ ఒక్కరూ లోపలికి రాకుండా అధికారులే ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ వారికి పుస్తకాలను, మైక్రోజిరాక్స్‌లను అందిస్తున్నారు. పరీక్ష కేంద్రంలో బిట్స్‌ను చెప్పేందుకు అధికారి సమీపం వారైన ఉపాధ్యాయులను ఇన్విజిలేటర్లుగా వేయించి వారిచేత బిట్స్, చీటీలను అందిస్తున్నారు. డబ్బులు కట్టిన వారికి ఒక విధంగా, కట్టనివారికి ఒక విధంగా పరీక్ష హాల్‌లో జరుగుతున్నట్లు పరీక్ష రాసే విద్యార్థులే బహిరంగంగా చర్చించుకుంటున్నారు. కిటీకిల వద్ద పరీక్షకు సంబంధించిన చీటీలు, పుస్తకాలు అక్కడే ఉన్నాయని పరీక్ష అధికారి వివరణ కోరగా అవేమో తెలియదు.. పరీక్షలు మాత్రం పూర్తి నిఘాతో నిర్వహిస్తున్నామని అధికారులు నమ్మబలుకుతున్నారు. భావి తరాల ఉపాధ్యాయులే పరీక్ష సమయంలో ఇలా మాస్ కాపీయింగ్ పాల్పడితే రాబోవు విద్యార్థులు ఏవిధంగా పరీక్షలు నిర్వహిస్తారో అట్లే అర్థం అవుతుంది. నిస్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పరీక్ష అధికారులే ఇలా అవినీతికి పాల్పడటం సరైన పద్దతికాదు.
కాపీలు కొట్టించడం లేదు
పరీక్ష కేంద్రం చీఫ్ సత్యనారాయణను కాపీయింగ్‌పై వివరణ కోరగా గట్టి నిఘాలో పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎప్పటికప్పుడు విషయాన్ని డీఈఓకు తెలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సిట్టింగ్ స్క్వాడ్ ఎంఈఓ పద్మలతను వివరణ కోరగా కాపీలు జరగడం లేదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment