అయోమయం..ఆందోళన | D ed Students Confusion With Exams Notifications | Sakshi
Sakshi News home page

అయోమయం..ఆందోళన

Published Thu, May 17 2018 12:09 PM | Last Updated on Mon, May 28 2018 1:30 PM

D ed Students Confusion With Exams Notifications - Sakshi

తరగతి గదిలో పాఠాలు వింటున్న డీఎడ్‌ విద్యార్థినులు

కడప, బద్వేలు : డిప్లొమో ఇన్‌ ఎడుకేష్యన్‌ (డీఎడ్‌) పరీక్షలు రాస్తున్న విద్యార్థులు ఈ ఏడాది విచిత్ర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. 2016–17 ఏడాదిలో మొదటి సంవత్సరం అభ్యసించిన విద్యార్థులు ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆయోమయానికి గురవుతున్నారు. ఈ ఏడాది వారికి నిర్వహించాల్సిన వార్షిక పరీక్షలు చేపట్టలేదు. ప్రస్తుతం వారంతా రెండవ సంవత్సరం చదువుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 17 నుంచి మొదటి సంవత్సరం పరీక్షలకు హాజరు కావాల్సి వస్తోంది. ఇవి ముగిసిన మరో మూడు నెలల్లోనే రెండవ సంవత్సరం పరీక్షలు రాయాల్సి ఉంది. దీనికి తోడు ప్రస్తుతం ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) నోటిఫికేషన్‌ విడుదల చేశారు. మొదటి సంవత్సరం వార్షిక పరీక్షల అనంతరం టెట్‌కు చదవాలా.. రెండవ సంవత్సరం పరీక్షలకు సన్నద్ధం కావాలా.. అనే సందేహంలో విద్యార్థులు ఉన్నారు

డీఎడ్‌ ప్రవేశాలు 2016–17 విద్యా సంవత్సరంలో ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. సాధారణంగా జూన్‌ నెలలో జరగాల్సిన అడ్మిషన్లు నవంబరులో జరగడంతో విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో వారికి వార్షిక పరీక్షలు కూడా ఆలస్యంగానే నిర్వహిస్తున్నారు. రెండవ సంవత్సరం పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. ఇలా చదవి పరీక్షలు రాయడం వల్ల ఫలితాల్లో ప్రభావం పడుతుందని విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాలో 78 డీఎడ్‌ కళాశాలలుండగా, వీటిలో 6,500 మందికి పైగా విద్యార్థులు చదువుతున్నారు.

విద్యార్థుల్లో ఆందోళన..
2017–18 విద్యా సంవత్సరంలో మొదటి సంవత్సరం చేరిన విద్యార్థులు తమకు ఎప్పుడు పరీక్షలు నిర్వహిస్తారో అని ఎదురు చూస్తున్నారు. తమ కంటే ముందు చేరిన విద్యార్థులే ప్రస్తుతం మొదటి ఏడాది పరీక్షలు రాస్తున్నారని, తమకు ఎప్పుడు నిర్వహిస్తారో అని ప్రశ్నిస్తున్నారు. తాము కూడా వీరిలానే ఒకే ఏడాది రెండు పరీక్షలు రాయాల్సి వస్తుందేమోనని వారిలో ఆందోళన నెలకొంది. రెండవ సంవత్సరం తరగతులు జరుగుతుండగా.. తాము చదివి వదిలేసిన మొదటి సంవత్సరం పరీక్షలు రాయాల్సి రావడంతో సన్నద్ధానికి సమయం సరిపోదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే రెండవ సంవత్సరం ప్రాక్టికల్స్‌ పరీక్షలకు సిద్ధం కావాల్సి ఉందని వాపోతున్నారు.

మండే ఎండలోనే సన్నద్ధం..
సరైన ప్రణాళిక లేకుండా పరీక్షల షెడ్యూల్‌ ప్రకటిం చడం.. వాటిని కూడా వేసవిలో నిర్వహించడం వి ద్యార్థులకు ఇబ్బందిగా మారింది. మండుటెండల్లో ç  పరీక్షలు రాయడం ఫలితాలపై ప్రతికూల ప్రభా వం చూపుతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టెట్‌ ఎలా..!
ప్రస్తుతం రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులకు గతంలో టెట్‌ అవకాశం కల్పించారు. ప్రస్తుతమూ కల్పించాలని వారంతా కోరుతున్నారు. అవకాశం కల్పిస్తే టెట్‌కు ఎలా సన్నద్ధం కావాలో తెలియక ఆయోమయంలో ఉన్నారు. షెడ్యూల్‌ ప్రకారం విద్యా సంవత్సరం ప్రారంభించి పరీక్షలు నిర్వహించి ఉంటే ఈ ఇబ్బందులు వచ్చేవి కావని వారు పేర్కొంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement