ఇదేం ‘శిక్ష’ణ గురువా
ఏలూరు సిటీ :దేశ భవిష్యత్ తరగతి గదిలో రూపు దిద్దుకుంటుందంటారు. అటువంటి తరగతి గదుల నిర్వాహకులైన ఉపాధ్యాయులను తీర్చిదిద్దవలసిన శిక్షణ కేంద్రంలో బోధించేవారు కరువయ్యారు. గురువులే లేని చదువులతో ఉపాధ్యాయులుగా మారుతున్న వీరంతా విద్యార్థులకు ఎలాంటి దిశా నిరేశం చేస్తారో. పాలకులు, అధికారులకే తెలియాలి. జిల్లాలోని దూబచర్లలోని డైట్ కాలేజీలో పరిస్థితి చూస్తే పాలకులకు విద్యావ్యవస్థపై ఎంతటి గౌరవం ఉందో అర్థమౌతుంది. కనీస సౌకర్యాలను పక్కనబెడితే అసలు అక్కడి డీఎడ్ విద్యార్థులకు ఇస్తున్న శిక్షణ దారుణంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ డైట్ కాలేజీలో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చదువుతున్న విద్యార్థులు 300మంది ఉన్నారు. తెలుగు మీడియంలో రెండు సంవత్సరాలకు 200 మంది, ఉర్దూ మీడియంలో రెండేళ్లకు 100 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి విద్యాబోధన చేసేందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 25 మంది అధ్యాపకులు పనిచేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం పని చేస్తున్నది ఐదుగురు మాత్రమే. అంటే ఈ విద్యార్థులకు ఏ మేరకు నాణ్యమైన విద్య అందుతుంతో ఇట్టే అవగతం అవుతోంది.
లెక్కకు ఐదుగురున్నా బోధించేది ముగ్గురే!
దూబచర్లలోని డైట్ కాలేజీలో ప్రిన్సిపాల్‌తో కలిపి ఇద్దరు రెగ్యులర్ అధ్యాపకులు, ఇద్దరు డెప్యుటేషన్‌పై వచ్చిన అధ్యాపకులు, ఒకరు ట్యూటర్ స్థాయి అధ్యాపకులు ఉన్నారు. ఈ ఐదుగురులోనూ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న కె.చంద్రకళ గోపన్నపాలెంలోని వ్యాయామ కళాశాలకు ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ మరో రెగ్యులర్ అధ్యాపకులుగా ఉన్న ఏడీవీ ప్రసాద్ జిల్లా పరిషత్ ఉప విద్యాధికారిగా అదనపు బాధ్యతలు మోస్తున్నారు. వీరిద్దరూ ఏ మేరకు విద్యార్థులకు పాఠాలు చెప్పగలరో ఇట్టే తెలిసిపోతోంది. ఇక సైకాలజీ సబ్జెక్టు బోధిస్తున్న ఎన్.సుబ్రహ్మణ్యం డైట్ కాలేజీలోని స్టూడెంట్ హాస్టల్‌కు వార్డెన్‌గానూ పనిచేస్తున్నారు. ఉర్దూ మీడియం విషయానికి వస్తే రెండు సంవత్సరాలకు కలిపి ఒక్కరే 100 మందికి పాఠాలు బోధిస్తున్నారు. తెలుగు సబ్జెక్టుకు ఒక అధ్యాపకురాలుడెప్యుటేషన్‌పై పనిచేస్తున్నారు. ట్యూటర్ స్థాయి వ్యక్తితో పాఠాలు చెప్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాఠాలు నేర్చుకుంటున్న డీఎడ్ విద్యార్థులు కోర్సులు పూర్తిచేసుకుని డీఎస్సీ రాసేసి ఉపాధ్యాయులుగా వచ్చేస్తే ఎలాంటి విద్యాబోధన జరుగుతుందో అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్పందించని అధికారులు
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం.. నాణ్యమైన విద్యను అందిస్తామని తరచూ వల్లె వేసే పాలకులు వీటిపై దృష్టి సారించకపోవటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ నిబంధనల మేరకు అధ్యాపకులను నియమించి, నాణ్యమైన విద్యను అందించాలని కోరుతున్నారు. కనీసం డెప్యుటేషన్‌పైన అయినా అధ్యాపకులను నియమించాలని కోరుతున్నారు. విద్యార్థులు గైడ్లను ఆశ్రయించటం మినహా గత్యంతరం లేని స్థితిలో ఉన్నారు. తాము గొప్పగా చదవాలని ఆశగా డీఎడ్ కోర్సులో చేరితే ఇక్కడ తమకు అన్నీ కష్టాలేనని విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.