కౌన్సెలింగ్ ఊసేది
ఏలూరు సిటీ :డిప్లొమో ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) కౌన్సెలింగ్ కోసం అభ్యర్థులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. విద్యా సంవత్సరం ముగుస్తున్నా సర్కారు కౌన్సెలింగ్ ఊసెత్తకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. మూడేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. దీనివల్ల డీఎడ్ కోర్సుల్లో చేరే అభ్యర్థులు విద్యా సంవత్సరాన్ని నష్టపోతున్నారు. కౌన్సెలింగ్ అంశాన్ని పట్టించుకోని ప్రభుత్వం కొత్తగా డీఎడ్ కళాశాలలకుఅనుమతులు మంజూరు చేయడం విమర్శలకు తావిస్తోంది. విద్యార్థుల భవిష్యత్‌నుదృష్టిలో పెట్టుకుని వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
5వేల మంది ఎదురుచూపు
జిల్లాలోని దూబచర్లలో ప్రభుత్వ డైట్ కళాశాల ఉండగా, మరో 29 కళాశాలలు ప్రైవేటు యూజమాన్యాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటిలో ఏటా 1,800 నుంచి 2వేల మంది అభ్యర్థులు డీఎడ్ కోర్సులను అభ్యసిస్తున్నారు. ఈ ఏడాది మరో నాలుగైదు డీఎడ్ కళాశాలలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వనున్నట్టు సమాచారం. ఎప్పుడో పరీక్షలు రాసి కోర్సుల్లో చేరేందుకు ఆశగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వ నిర్వాకం వల్ల నిరాశే మిగులుతోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 5 వేల మంది డీఎడ్ ప్రవేశ పరీక్ష రాసి కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. విద్యా సంవత్సరం ఆధారంగా డీఎడ్ కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంతో డీఎస్సీ ప్రకటించే నాటికి కోర్సులు పూర్తికాక అభ్యర్థులు ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు దీనిపై దృష్టి సారించాలని అభ్యర్థులు కోరుతున్నారు.