diploma in education
-
బీఈడీ అభ్యర్థులకూ పేపర్–1 అవకాశం
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)లో తీసుకొచ్చిన మార్పులు తమకు నష్టం చేస్తాయని డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యాయ నియామకాల్లో పోటీ తీవ్రంగా ఉంటుందనే భావన వ్యక్తం చేస్తున్నారు. డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థులు టెట్ పేపర్–1 రాస్తారు. వీరు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులకు (ఎస్జీటీ) అర్హులవుతారు. బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు సాధారణంగా పేపర్–2 రాస్తారు. వీరు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హత కలిగి ఉంటారు. కానీ ఇప్పుడు బీఈడీ అభ్యర్థులు కూడా పేపర్–2తో పాటు, పేపర్–1 కూడా రాసే అవకాశం కల్పించారు. దీంతో వారు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకే కాకుండా, ఎస్జీటీ పోస్టులకూ పోటీ పడే వీలుంది. దీంతో తమకు అవకాశాలు తగ్గుతాయని డీఎడ్ అభ్యర్థులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల నియామకం చేపడితే.. 6,500 ఎస్జీటీ, 3 వేలపైన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. డీఎడ్ నాణ్యతపైనే సందేహాలు... వాస్తవానికి కొన్నేళ్లుగా డీఎడ్ కాలేజీల్లో ప్రమాణాలు అంతంత మాత్రంగానే ఉన్నాయని ఆ అభ్యర్థులు చెబుతున్నారు. సరైన ఆదరణ లేక ప్రైవేటు కాలేజీలు పెద్దగా దృష్టి పెట్టలేదంటున్నారు. నిజానికి ఐదేళ్లుగా రాష్ట్రంలో సగం డీఎడ్ కాలేజీలు మూతపడ్డాయి. 2016–17లో రాష్ట్రంలో 212 డీఎడ్ కాలేజీలుండగా, ప్రస్తుతం ఆ సంఖ్య వందకు చేరింది. గతేడాది వంద కాలేజీల్లో 6,250 సీట్లకు గానూ 2,828 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో కాలేజీలు సరైన ఫ్యాకల్టీని నియమించడం లేదనే ఆరోపణలున్నాయి. మారుతున్న బోధనా విధానాలు, విద్యార్థుల సైకాలజీ తెలుసుకుని బోధించే మెళకువలు, ప్రాజెక్టు వర్క్‌లు అసలే ఉండటం లేదని డీఎడ్ అభ్యర్థులు అంటున్నారు. మాకు అన్యాయమే... ఉపాధ్యాయ పోస్టుకు బీఈడీ అభ్యర్థులతో సమానంగా మేమెలా పోటీపడగలం. ఎస్జీటీ పోస్టులను డీఎడ్ వారికే పరిమితం చేస్తే బాగుండేది. చిన్న తరగతులకు బోధించే విధానాలే డీఎడ్‌లో ఉంటాయి. పెద్ద తరగతులకు బీఈడీ సరిపోతుంది. బీఈడీ అభ్యర్థులు తేలికగా మా స్థాయి పోస్టులు సాధిస్తే, మాకు అన్యాయం జరుగుతుంది. – ప్రవీణ్ కుమార్ (డీఎడ్ పూర్తి చేసిన అభ్యర్థి) వారితో పోటీ సరికాదు... బీఈడీ, డీఎడ్ బోధనా విధానంలో చాలా మార్పులున్నాయి. కాలేజీలు కూడా డీఎడ్‌కు అవసరమైన మౌలిక వసతులు కల్పించడం లేదు. ప్రయోగాత్మక బోధనా పద్ధతులపై దృష్టి పెట్టడం లేదు. ఇవన్నీ డీఎడ్ అభ్యర్థులకు ఇబ్బంది కలిగించే అంశాలు. ఈ నేపథ్యంలో మా స్థాయి పోస్టులకు బీఈడీ వారినీ పోటీకి తేవడం సరికాదు. – సంజీవ్ వర్థన్ (టెట్‌కు దరఖాస్తు చేసిన డీఎడ్ అభ్యర్థి) -
Telangana: బీఈడీకే దిక్కులేదు.. డీఎడ్ ఎందుకు?
సాక్షి, హైదరాబాద్: కొన్నేళ్ల క్రితం వరకూ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) సీటు కోసం విపరీతమైన పోటీ ఉండేది. కొంతమంది వేరే రాష్ట్రాలకు వెళ్లి మరీ డీఎడ్ తత్సమానమైన కోర్సులు చేసేవాళ్లు. డీఎడ్ చేస్తే ఉపాధ్యాయ పోస్టు (ఎస్జీటీ) గ్యారంటీ అనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఎక్కువ సీట్లు ఉంటున్నాయి.. చేరే విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటోంది. దీంతో డీఎడ్ కాలేజీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది. నాలుగేళ్లలో 112 కాలేజీలు మూతపడ్డాయంటే పరిస్థితి అంచనా వేయొచ్చు. ఇదే ట్రెండ్ కొనసాగితే డీఎడ్ కోర్సు ఉండే అవకాశమే లేదని విద్యా రంగ నిపుణులు అంటున్నారు. డీఎడ్ నాణ్యత పెంచడంతోపాటు, కోర్సు చేస్తే ఉపాధి వస్తుందనే భరోసా ఉండాలంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్స్ సంఖ్య పెంచడంతోపాటు, ప్రైవేటు స్కూళ్లలోనూ ఈ అర్హత ఆధారంగా ఉద్యోగాలు దక్కినప్పుడే ఈ కోర్సు ఆశాజనకంగా ఉంటుందని చెబుతున్నారు. మూతపడుతున్న కాలేజీలు ప్రభుత్వ లెక్కల ప్రకారం 2016–17లో రాష్ట్రంలో 212 డీఎడ్ కాలేజీలున్నాయి. ఇందులో పది ప్రభుత్వ అధీనంలోనివి. మిగతావి ప్రైవేటులో కొనసాగుతున్నాయి. ఇప్పుడు డీఎడ్ కాలేజీలు వందకు పడిపోయాయి. మరిన్ని మూసివేతకు సిద్ధమవుతున్నాయి. కోర్సుల్లో చేరే వాళ్లూ తగ్గుతు న్నారు. 2017–18లో 11,500 సీట్లుంటే, 7,650 మందే చేరారు. 2020–21 నాటికి ఈ సంఖ్య ఇంకా పడిపోయింది. 6,250 సీట్లున్నా 2,828 మందే చేరారు. కొన్ని కాలే జీల్లో 20 మంది కూడా చేరలేదు. కారణాలేంటి? యాజమాన్య కోటా కింద ప్రతీ కాలేజీకి పది సీట్లుంటాయి. కన్వీనర్ కోటా కిందే భర్తీ కానప్పుడు యాజమాన్య కోటా కింద చేరే ప్రసక్తే ఉండదు. కన్వీనర్ కోటా కింద ప్రభుత్వం ఏటా రూ.11 వేల ఫీజు రీయింబర్స్మెంట్ కింద, రూ. 1,500 ఇతర ఖర్చుల కింద కాలేజీలకు ఇస్తుంది. ఇవి సమయానికి అందడం లేదని, దీంతో కాలేజీల నిర్వహణ కష్టమవుతోందని యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. అధ్యాపకులకు వేతనాలు చెల్లించడమే కష్టంగా ఉందని అంటున్నాయి. దీనికితోడు బీఎడ్ చేసిన వారికే ఉపాధి కష్టంగా ఉందని, డీఎడ్ చేస్తే ఏం ప్రయోజనం ఉంటుందని విద్యార్థులు వాపోతున్నారు. పైగా కరోనా తర్వాత ప్రైవేటు స్కూళ్లు ఉపాధ్యాయులకు వేతనాలు అరకొరగా చెల్లిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ టీచర్ల నియామకం జరగలేదు. ఈ కోర్సు పట్ల విద్యార్థుల్లో ఆసక్తి సన్నగిల్లుతోందని నిపుణులు అంటున్నారు. -
వన్నె తగ్గుతోన్న ఉపాధ్యాయ విద్య
తెలుగు రాష్ట్రాల్లో ఉపాధ్యాయ విద్య ప్రాభవం ఏటికేటికీ కొడిగడుతోంది. రెండు దశాబ్దాల కిందట ఉపాధ్యాయ శిక్షణ పొందిన వారికి ఓ భరోసా, ప్రత్యేక గౌరవం ఉండేవి. కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. విచ్చల విడిగా ప్రైవేటు కళాశాలలకు తలుపులు తెరవడమే దీనికి ప్రధాన కారణం. ఏటా డిగ్రీ ప్రాతిపదికగా బీఎడ్, ఇంటర్ ఆధా రంగా డీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలకు ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. అయితే వీటికి దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. పదేళ్ల కిందట లక్షల్లో పోటీపడే అభ్యర్థులు ఇప్పుడు వేలకు పడిపోయారు. ఆంధ్రప్రదేశ్‌లో 2018 లెక్కల ప్రకారం 13 ప్రభుత్వ డైట్ కళాశాలలుండగా 869 ప్రైవేటు యాజ మాన్యం ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. ప్రభుత్వ కళాశాలలకు 1300 సీట్లుండగా ప్రైవేటుకు 44,500 సీట్లను కేటాయిం చారు. తెలంగాణలో 180 డీఎడ్ కళాశా లలకుగాను ప్రభుత్వానికి చెందిన 28 కళాశాలల్లో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో 850 సీట్లుండగా ప్రైవేటు కళాశాలలకు 6,500 సీట్లను మంజూరు చేశారు. ప్రస్తుతం ఈ సీట్లన్నీ పూర్తి స్థాయిలో భర్తీకావడం లేదు. ఏటా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టక పోవడం, నోటిఫికేషన్ విడుదలైనా తక్కువ పోస్టులకు పరిమితం చేయడం, దీనికి కారణం.. గతేడాది సుప్రీంకోర్టు సైతం సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టు లకు బీఎడ్ వారికీ అవకాశమివ్వాలని ఎన్సీటీ ఈని ఆదేశించింది. దీంతో డీఎడ్ కోర్సులో చేరేందుకు అభ్యర్థులు విము ఖత చూపుతున్నారు. పర్యవసానమే ఈ ఏడాది అతి తక్కువగా 19,190 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. 2001–2005 వరకు బీఎడ్ ప్రవేశాలకు గిరాకీ ఉండేది. 2009లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులకు డీఎడ్ వారినే తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు తీర్పు నివ్వడంతో బీఎడ్ కోర్సుకు స్పందన క్రమంగా తగ్గుతూ వస్తోంది. గత పదే ళ్లలో డీఎడ్, బీఎడ్ చేసిన వారు రెండు రాష్ట్రాల్లో కలిపి 9లక్షలకు పైనే ఉంటారు. వీళ్లలో 80 శాతం మంది సర్కారు కొలు వులు రాక ప్రైవేటు విద్యా సంస్థల్లో తక్కువ ఊడిగానికి పనిచేయలేక ఉపా ధ్యాయ వృత్తిని వదిలి ప్రైవేటు రంగా లకు మళ్లారు. ఉపాధ్యాయ విద్యను చుట్టుముట్టిన సమస్యల పరిష్కారానికి ప్రైవేటు కళాశాలల సంఖ్య తగ్గించాలి. జిల్లాకు రెండు, మూడింటికే పరిమితం చేయాలి. బోధనా పద్ధతుల ప్రమాణా లను పెంచాలి. ఏటా నియామకాలు చేపట్టాలి. ప్రైవేటు పాఠశాలలు కనీసం రూ. 15 వేల వేతనమిచ్చేలా చట్టం తీసు కురావాలి. ఇలా చేస్తే ఉపాధ్యాయ విద్యకు మునుపటి వైభవం వస్తుంది. -తిరుమల శ్రీనివాస్ కరుకోల, హైదరాబాద్ సెల్ : 81438 14131 -
టెట్‌కు 1.28 లక్షల దరఖాస్తులు
ఈ నెల 31 వరకు దరఖాస్తుకు గడువు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాసేందుకు ఇప్పటివరకు 1.28 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 15 నుంచి ఫీజు చెల్లింపు, 16వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఈ పది రోజుల్లోనే 1,28,464 మంది టెట్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ఫీజు చెల్లించగా, గురువారం నాటికి 1,17,735 మంది అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించారు. మరోవైపు దరఖాస్తు చేసుకునే గడువు ఈనెల 31వ తేదీ వరకు ఉంది. ఈ వారం రోజుల్లో మరో 1.50 లక్షలకు పైగా దర ఖాస్తులు వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈసారి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్), బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్) చివరి సంవత్సరం చదివే విద్యార్థులకు కూడా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. -
డీఎడ్ ప్రవేశాలకు చివరి దశ కౌన్సెలింగ్ షురూ
బోయపాలెం(యడ్లపాడు) : డిప్లొమో ఇన్ ఎడ్యుకేషన్ తొలి సంవత్సరం ప్రవేశాలకు సోమవారం సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం అయింది. గతేడాది నవంబర్, డిశంబర్ నెలల్లో రెండు విడతలు సర్టిఫికెట్ల పరిశీలన జరిగింది. చివరి విడతగా మొదటి రెండు దశల్లో డీఎడ్ కళాశాలల్లో సీట్లు లభించని వారికి ప్రభుత్వం ప్రత్యేక కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తోంది. ఈ కౌన్సిల్‌కు రెండోదశలో వెబ్ ఆప్షన్లు చేసుకుని సీట్లు లభించని వారికి నేరుగా వారి సెల్ఫోన్లకే సమాచారం డైట్‌సెట్ కన్వీనర్ నుంచి అందింది. సోమవారం డైట్లో జరిగిన సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియకు 29 మంది అభ్యర్థులు ఫీజులు చెల్లించి వివిధ కళాశాలల్లో చేరినట్లు ప్రిన్సిపాల్ ఎన్.రఘుకుమార్ తెలిపారు. కౌన్సెలింగ్ నిమిత్తం డైట్లో రెండు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశామన్నారు. మంగళ, బుధ వారాల్లో కూడా కౌన్సెలింగ్ కొనసాగుతుందన్నారు. -
21 నుంచి డైట్‌సెట్ కౌన్సెలింగ్
ఒంగోలు వన్‌టౌన్ : ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో డిప్లమో ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి (డైట్‌సెట్) ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించి సర్టిఫికెట్లను పరిశీలించాలని విద్యాశాఖ అదనపు డెరైక్టర్ సురేంద్రరెడ్డి జిల్లా విద్యాశాఖాధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి ఆయన వీడియో సమావేశంలో డీఈవోతో మాట్లాడారు. డైట్‌సెట్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే అభ్యర్థులకు వెబ్‌కౌన్సెలింగ్ పూర్తయింది. వెబ్‌కౌన్సెలింగ్‌లో ఆప్షన్లు ఇచ్చిన అభ్యర్థులకు కళాశాలలను కూడా కేటాయించారు. వీరికి ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు సర్టిఫికెట్లు పరిశీలించి తుది ప్రవేశపత్రం (ఫైనల్ అడ్మిషన్ లెటర్) జారీ చేయాలని సురేంద్రరెడ్డి, డీఈఓలు, డైట్ ప్రిన్సిపాల్స్‌ను ఆదేశించారు. ప్రధానంగా డైట్‌సెట్‌లో సీటు సాధించిన విద్యార్థులకు 17 సంవత్సరాలు నిండినదీ లేనిది క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. డీఈడీ ప్రభుత్వ కళాశాలలో సీటు పొందిన వారు రూ.2,345, ప్రైవేట్ కళాశాలలో సీటు పొందిన రూ.12,500 ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.2 లక్షల లోపు, బీసీ అభ్యర్థులకు లక్ష లోపు ఆదాయ ధ్రువీకరణపత్రాలను సమర్పించాలి. జిల్లాలో మైనంపాడులోని జిల్లా విద్యాశిక్షణా సంస్థ (డైట్)లో ఈ నెల 21 నుంచి 23 వరకు డీఈడీ మొదటి సంవత్సరం సీటు పొందిన అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని డైట్ ప్రిన్సిపాల్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న జిల్లా విద్యాశాఖాధికారి బి.విజయభాస్కర్ తెలిపారు. ఈ సర్టిఫికెట్ల పరిశీలనకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. అభ్యర్థులు అన్ని ధ్రువీకరణపత్రాలతో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాలని డీఈవో కోరారు. -
ఇదేం ‘శిక్ష’ణ గురువా
ఏలూరు సిటీ :దేశ భవిష్యత్ తరగతి గదిలో రూపు దిద్దుకుంటుందంటారు. అటువంటి తరగతి గదుల నిర్వాహకులైన ఉపాధ్యాయులను తీర్చిదిద్దవలసిన శిక్షణ కేంద్రంలో బోధించేవారు కరువయ్యారు. గురువులే లేని చదువులతో ఉపాధ్యాయులుగా మారుతున్న వీరంతా విద్యార్థులకు ఎలాంటి దిశా నిరేశం చేస్తారో. పాలకులు, అధికారులకే తెలియాలి. జిల్లాలోని దూబచర్లలోని డైట్ కాలేజీలో పరిస్థితి చూస్తే పాలకులకు విద్యావ్యవస్థపై ఎంతటి గౌరవం ఉందో అర్థమౌతుంది. కనీస సౌకర్యాలను పక్కనబెడితే అసలు అక్కడి డీఎడ్ విద్యార్థులకు ఇస్తున్న శిక్షణ దారుణంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ డైట్ కాలేజీలో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చదువుతున్న విద్యార్థులు 300మంది ఉన్నారు. తెలుగు మీడియంలో రెండు సంవత్సరాలకు 200 మంది, ఉర్దూ మీడియంలో రెండేళ్లకు 100 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి విద్యాబోధన చేసేందుకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 25 మంది అధ్యాపకులు పనిచేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం పని చేస్తున్నది ఐదుగురు మాత్రమే. అంటే ఈ విద్యార్థులకు ఏ మేరకు నాణ్యమైన విద్య అందుతుంతో ఇట్టే అవగతం అవుతోంది. లెక్కకు ఐదుగురున్నా బోధించేది ముగ్గురే! దూబచర్లలోని డైట్ కాలేజీలో ప్రిన్సిపాల్‌తో కలిపి ఇద్దరు రెగ్యులర్ అధ్యాపకులు, ఇద్దరు డెప్యుటేషన్‌పై వచ్చిన అధ్యాపకులు, ఒకరు ట్యూటర్ స్థాయి అధ్యాపకులు ఉన్నారు. ఈ ఐదుగురులోనూ ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న కె.చంద్రకళ గోపన్నపాలెంలోని వ్యాయామ కళాశాలకు ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ మరో రెగ్యులర్ అధ్యాపకులుగా ఉన్న ఏడీవీ ప్రసాద్ జిల్లా పరిషత్ ఉప విద్యాధికారిగా అదనపు బాధ్యతలు మోస్తున్నారు. వీరిద్దరూ ఏ మేరకు విద్యార్థులకు పాఠాలు చెప్పగలరో ఇట్టే తెలిసిపోతోంది. ఇక సైకాలజీ సబ్జెక్టు బోధిస్తున్న ఎన్.సుబ్రహ్మణ్యం డైట్ కాలేజీలోని స్టూడెంట్ హాస్టల్‌కు వార్డెన్గానూ పనిచేస్తున్నారు. ఉర్దూ మీడియం విషయానికి వస్తే రెండు సంవత్సరాలకు కలిపి ఒక్కరే 100 మందికి పాఠాలు బోధిస్తున్నారు. తెలుగు సబ్జెక్టుకు ఒక అధ్యాపకురాలుడెప్యుటేషన్పై పనిచేస్తున్నారు. ట్యూటర్ స్థాయి వ్యక్తితో పాఠాలు చెప్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పాఠాలు నేర్చుకుంటున్న డీఎడ్ విద్యార్థులు కోర్సులు పూర్తిచేసుకుని డీఎస్సీ రాసేసి ఉపాధ్యాయులుగా వచ్చేస్తే ఎలాంటి విద్యాబోధన జరుగుతుందో అంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్పందించని అధికారులు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తాం.. నాణ్యమైన విద్యను అందిస్తామని తరచూ వల్లె వేసే పాలకులు వీటిపై దృష్టి సారించకపోవటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వ నిబంధనల మేరకు అధ్యాపకులను నియమించి, నాణ్యమైన విద్యను అందించాలని కోరుతున్నారు. కనీసం డెప్యుటేషన్‌పైన అయినా అధ్యాపకులను నియమించాలని కోరుతున్నారు. విద్యార్థులు గైడ్లను ఆశ్రయించటం మినహా గత్యంతరం లేని స్థితిలో ఉన్నారు. తాము గొప్పగా చదవాలని ఆశగా డీఎడ్ కోర్సులో చేరితే ఇక్కడ తమకు అన్నీ కష్టాలేనని విద్యార్థులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
కౌన్సెలింగ్ ఊసేది
ఏలూరు సిటీ :డిప్లొమో ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) కౌన్సెలింగ్ కోసం అభ్యర్థులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. విద్యా సంవత్సరం ముగుస్తున్నా సర్కారు కౌన్సెలింగ్ ఊసెత్తకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. మూడేళ్లుగా ఇదే తంతు కొనసాగుతోంది. దీనివల్ల డీఎడ్ కోర్సుల్లో చేరే అభ్యర్థులు విద్యా సంవత్సరాన్ని నష్టపోతున్నారు. కౌన్సెలింగ్ అంశాన్ని పట్టించుకోని ప్రభుత్వం కొత్తగా డీఎడ్ కళాశాలలకుఅనుమతులు మంజూరు చేయడం విమర్శలకు తావిస్తోంది. విద్యార్థుల భవిష్యత్నుదృష్టిలో పెట్టుకుని వెంటనే కౌన్సెలింగ్ నిర్వహించాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. 5వేల మంది ఎదురుచూపు జిల్లాలోని దూబచర్లలో ప్రభుత్వ డైట్ కళాశాల ఉండగా, మరో 29 కళాశాలలు ప్రైవేటు యూజమాన్యాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటిలో ఏటా 1,800 నుంచి 2వేల మంది అభ్యర్థులు డీఎడ్ కోర్సులను అభ్యసిస్తున్నారు. ఈ ఏడాది మరో నాలుగైదు డీఎడ్ కళాశాలలకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వనున్నట్టు సమాచారం. ఎప్పుడో పరీక్షలు రాసి కోర్సుల్లో చేరేందుకు ఆశగా ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వ నిర్వాకం వల్ల నిరాశే మిగులుతోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 5 వేల మంది డీఎడ్ ప్రవేశ పరీక్ష రాసి కౌన్సెలింగ్ కోసం ఎదురు చూస్తున్నారు. విద్యా సంవత్సరం ఆధారంగా డీఎడ్ కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంతో డీఎస్సీ ప్రకటించే నాటికి కోర్సులు పూర్తికాక అభ్యర్థులు ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కోల్పోతున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు దీనిపై దృష్టి సారించాలని అభ్యర్థులు కోరుతున్నారు. -
డీఎడ్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) మొదటి సంవత్సరం ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. 39,778 మంది పరీక్ష రాయగా... 32,973 మంది ఉత్తీర్ణులయ్యారు. అయితే, పాఠశాల విద్య కమిషనర్ ఆమోదం పొందని 14 మైనారిటీ, 52 కొత్త డీఎడ్ కళాశాలలకు చెందిన 3,875 మంది విద్యార్థుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు. మార్కుల రీకౌంటింగ్ కోసం ఈనెల 24 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని, పూర్తి వివరాల కోసం www.bseap.org వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. -
డీసెట్‌లో విజయానికి మార్గాలు..
రెండేళ్ల కాల వ్యవధి గల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కోర్సును కేంద్ర ప్రభుత్వం సిఫార్సు మేరకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఈ)గా పేరు మార్చి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పరీక్ష వివరాలు, అందులో విజయ సాధనకు ఉపయోగపడే ప్రిపరేషన్ వ్యూహాలైపై స్పెషల్ ఫోకస్.. ప్రభుత్వ డైట్లు, ప్రైవేటు ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశానికి డీఈఈ సెట్-2014 నిర్వహిస్తారు. ప్రస్తుతం సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) ఉద్యోగాలను డీఈఈ అభ్యర్థులతోనే భర్తీ చేస్తుండటంతో ఈ కోర్సుకు డిమాండ్ ఏర్పడింది. ఈ ఏడాది డీసెట్‌కు తీవ్ర పోటీ నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో మంచి ర్యాంకు లభిస్తే ప్రభుత్వ కళాశాలలో సీటును చేజిక్కించుకోవచ్చు. అర్హతలు: ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులు డీసెట్ రాసేందుకు అర్హులు. ఇంటర్లో ఓసీ, బీసీ అభ్యర్థులు 45శాతం మార్కులు; ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ చాలెంజ్డ్ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇం టర్లో వృత్తి విద్యా కోర్సులు చదివిన వారు అనర్హులు. వయసు: 2014, సెప్టెంబర్ 1 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. పరీక్ష విధానం: డీసెట్ పరీక్ష ప్రశ్నపత్రం మూడు భాగాలుగా ఉంటుంది. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 మార్కులకు పేపర్ ఉంటుంది. సమయం రెండు గంటలు. 8, 9, 10 తరగతుల సబ్జెక్టుల ఆధారంగా ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. ఈసారి పాత సిలబస్ ప్రకారమే ప్రశ్నపత్రం ఉంటుంది. సబ్జెక్ట్ {పశ్నలు మార్కులు పార్ట్-1 జనరల్ నాలెడ్జ్ 5 5 టీచింగ్ ఆప్టిట్యూడ్ 5 5 పార్ట్-2 తెలుగు 20 20 ఇంగ్లిష్ 10 10 పార్ట్-3 మ్యాథమెటిక్స్ 20 20 ఫిజికల్, బయలాజికల్ సైన్స్ 20 20 సోషల్ 20 20 మొత్తం 100 100 ముఖ్య తేదీలు: దరఖాస్తు ఫీజు చెల్లింపు: మే 5, 2014- మే 17, 2014. ఆన్లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: మే 6, 2014. దరఖాస్తుకు చివరి తేదీ: మే 18, 2014. హాల్టికెట్ల్ డౌన్లోడ్ ప్రారంభం: జూన్ 5, 2014. పరీక్ష తేదీ: జూన్ 15, 2014. పరీక్ష ఫలితాలు: జూన్ 25, 2014. ఏపీ ఆన్లైన్ లేదా ఈసేవ కేంద్రాల్లో రుసుము చెల్లించవచ్చు. మోడల్ టెస్ట్‌లతో మంచి ఫలితం డీసెట్ కోసం ఎనిమిది నుంచి పదో తరగతి వరకు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు బాగా చదివాను. కోచింగ్ సెంటర్లో ప్రతిరోజూ ఒక గ్రాండ్ టెస్టును సాధన చేసేవాడిని. ప్రతివారం మోడల్ టెస్టులు కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల తప్పులను సరిదిద్దుకోవడం తేలికైంది. దీనివల్ల టాప్ ర్యాంకు సాధించగలిగాను. ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు, సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 10.30 వరకు చదివేవాడిని. జీకే కోసం దినపత్రికలు ఉపయోగపడ్డాయి. - గుంటుకు శ్రీనివాసరావు, డైట్‌సెట్-2013 స్టేట్ ఫస్ట్ ర్యాంకర్. ప్రిపరేషన్ ప్రణాళిక తెలుగు ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణం, సంధులు, సమాసాలు, వ్యాకరణ పరిభాష, ఛందస్సు, అలంకారాలు, అర్థాలు, క్రియలు, వ్యుత్పత్త్యార్థాలు, జాతీయాలపై దృష్టిసారించాలి. వీటి నుంచి 2013 డైట్‌సెట్ ప్రశ్నపత్రంలో ఒక్కో అంశం నుంచి రెండు చొప్పున ప్రశ్నలు వచ్చాయి. ఉదా: ‘ఆలోచనాలోచనలు’ గ్రంథాన్ని రచించిన వారెవరు? (దాశరథి). ఉదా: మిళిందం అనగా? (తుమ్మెద). ఇంగ్లిష్ ఈ విభాగంలో వ్యాకరణానికి సంబంధించి 10 ప్రశ్నలు వస్తాయి. గత డైట్ సెట్లో Tenses, Question Tag, Voice, Articles, Parts of Speech, Simple Complex Compound విభాగాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి. Ex: Janardhan is very generous in helping the poor (The underlined word means) a) careful b) kind c) miserly d) cruel Ans: b Be prepared............. the worst a) of b) in c) for d) on Ans: c మ్యాథమెటిక్స్ ఘాతాంకాలు, ఘాత సమీకరణాలు, బహుపదులు, ద్విపద సిద్ధాంతం, సమితులు, శ్రేఢులు, మాత్రికలు, క్షేత్ర గణితం, రేఖాగణితం, వైశ్లేషిక రేఖా గణితం, త్రికోణమితి అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. అకరణీయ సంఖ్యలు, కరణులు, రేఖీయ అసమీకరణాలు, త్రిమితీయ రూపాలు, వృత్తాలు, సాంఖ్యక శాస్త్రం తదితర అంశాలపైనా దృష్టిపెట్టాలి. పదో తరగతి అంశాలపై శ్రద్ధకనబరచాలి. చిట్కా (షార్ట్‌కట్)ల ద్వారా ప్రాక్టీస్ చేస్తే తేలిగ్గా సమాధానాలు గుర్తించవచ్చు. ఉదా: ఒక తలంలోని రేఖకు సమాన దూరంలో ఉన్న అదే తలానికి చెందిన బిందు పథం? ఎ) సరళరేఖ బి) రెండు సమాంతర రేఖలు సి) రెండు ఖండన రేఖలు డి) వృత్తం సమాధానం: బి సైన్స్ ఈ విభాగంలో భౌతిక, రసాయన శాస్త్రాల నుంచి పది ప్రశ్నలు, బయాలజీ నుంచి 10 ప్రశ్నలు వస్తాయి. ఉష్ణం, కాంతి, అయస్కాంతత్వం, ఆధునిక భౌతిక శాస్త్రం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. శుద్ధ గతిక శాస్త్రం, కొలతలు, ధ్వని, ఎలక్ట్రానిక్స్, తరంగ చలనాలు, విద్యుదయస్కాంత వర్ణపటం వంటి అంశాలపైనా దృష్టిసారించాలి.రసాయన శాస్త్రంలో సంకేతాలు, నైట్రోజన్ దాని సమ్మేళనాలు, రసాయన చర్యల వేగాలు, సమతా స్థితి, మూలకాల వర్గీకరణ, ద్రావణాలు వంటి వాటిపై ఎక్కువ దృష్టిసారించాలి. రసాయన సమీకరణాలు, రసాయన బంధం, రసాయన సంయోగ నియమాలు, ఆమ్లాలు-క్షారాలు, నూనెలు- కొవ్వులు మొదలైన అంశాల నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. బయాలజీకి సంబంధించి 9, 10 తరగతులలోని జీవన విధానాలు, పదో తరగతిలోని ప్రత్యుత్పత్తి, పోషణ అంశాలను క్షుణ్నంగా చదివితే ఈ విభాగంలో 80 శాతం మార్కులు స్కోర్ చేయొచ్చు. ఇవి కాకుండా 9వ తరగతిలోని శక్తిమయ ప్రపంచం, సహజ వనరులు; 8వ తరగతిలోని విజ్ఞాన శాస్త్ర చరిత్ర, పరిధి; పదో తరగతిలోని నియంత్రణ- సమన్వయం, హెచ్ఐవీ-ఎయిడ్స్ వంటి అంశాలపైనా దృష్టిసారించాలి. ఉదా: గాయిటర్ వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది? ఎ) అయోడిన్ బి) ఐరన్ సి) ప్రోటీన్లు డి) విటమిన్లు సమాధానం: ఎ ద్వికుంభాకర కటక ప్రయోగంలో మిధ్యా ప్రతిబింబం నిటారుగా పడాలంటే కటకాన్ని ఎలా ఉంచాలి? ఎ) అనంత దూరంలో బి) ఊ2, కటకం మధ్య సి) ఇ2 కంటే దూరం డి) ఇ2, ఊ2ల మధ్య సమాధానం: ఎ ఏ2+ఐ2 2ఏఐ చర్యలో సమతాస్థితి వద్ద పీడనాన్ని పెంచితే ఏమవుతుంది? ఎ) పెరుగుతుంది బి) మార్పుండదు సి) తగ్గును డి) ఏదీకాదు సమాధానం: బి సోషల్ ఈ విభాగంలో భూగోళశాస్త్రం, చరిత్ర, అర్థ శాస్త్రం, పౌరశాస్త్రం నుంచి 5 ప్రశ్నలు చొప్పున మొత్తం 20 ప్రశ్నలు వస్తాయి. భూగోళ శాస్త్రంలో అక్షాంశాలు- రేఖాంశాలు, ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం, ప్రకృతి సిద్ధ మండలాలు, భారతదేశ భూగోళ శాస్త్రం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. చరిత్రలో ప్రాచీన నాగరికతలు, ప్రాచీన ప్రపంచ విప్లవాలు, ఆధునిక ప్రపంచం, భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమం వంటి అంశాలను ఎక్కువగా చదవాలి. పౌరశాస్త్రంలో భారత రాజ్యాంగం; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక స్వపరిపాలన, ఐక్యరాజ్య సమితి, రవాణా విద్య నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆర్థిక శాస్త్రం నుంచి స్థూల అర్థ శాస్త్రం, ద్రవ్యం, బ్యాంకింగ్, డిమాండ్, భారత ఆర్థిక శాస్త్రం ప్రణాళికల నుంచి అధిక ప్రశ్నలు వస్తాయి. ఉదా: బంగ్లాదేశ్‌లో గంగానదిని ఏమని పిలుస్తారు? ఎ) అలకనంద బి) పద్మా సి) యమున డి) మేఘన సమాధానం: బి రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసే సభ్యుల సంఖ్య? (12). లారెంజ్ వక్రరేఖ దేన్ని సూచిస్తుంది? (ఆదాయ అసమానత్వం). ‘సాధించు లేదా గతించు’ నినాదం ఎవరిది? (గాంధీజీ). టీచింగ్ ఆప్టిట్యూడ్ కాబోయే టీచర్‌గా సమాజ స్థితిగతులపై ఉండాల్సిన అవగాహన స్థాయిని, విద్యార్థిలోని బోధన సామర్థ్యాన్ని పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. టీచింగ్ ఆప్టిట్యూడ్ విభాగంలో ఉపాధ్యాయ వృత్తి, తరగతి గది నిర్వహణ, నూతన విద్యా విధానం, పాఠశాల వాతావరణం, బోధన సామర్థ్యం తదితరాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. విద్యార్థి తనను తాను ఉత్తమ ఉపాధ్యాయుడిగా భావించి, తార్కికంగా ఆలోచిస్తే ఈ విభాగంలో ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించవచ్చు. ఉదా: బోధన అనగా? ఎ) విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడం బి) విద్యార్థులలో ప్రవర్తనా మార్పులు తీసుకురావడం సి) తరగతి గదిలో ఉపన్యసించడం డి) విద్యార్థులలో విద్యా విషయక ప్రతిభను ప్రోత్సహించడం సమాధానం: బి జనరల్ నాలెడ్జ్ ఈ విభాగంలో కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ఆర్థిక, రాజకీయ, క్రీడలు, అవార్డుల నుంచి ప్రశ్నలొస్తాయి. స్టాక్ జీకే నుంచి ప్రామాణిక ప్రశ్నలు వస్తాయి. ఉదా: ఒలింపిక్ క్రీడలను ప్రారంభించింది ఎవరు? (గ్రీకులు). భారత దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? (జస్టిస్ ఆర్.ఎం.లోధా). -
డీఈడీ కిలాడీ కాలేజీలు!
మౌలిక సదుపాయాల్లేవు.. బోధన సిబ్బంది లేరు స్కూళ్లు, కాలేజీల్లోనే కోర్సు నిర్వహణ అదే సిబ్బందితో డీఈడీ విద్యా బోధన నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఫీజు రీయింబర్స్మెంట్ రాదంటూ వసూళ్లు సాక్షి, హైదరాబాద్: టీచర్ పోస్టులపై ఆశతో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డీఎడ్)లో చేరుతున్న వారిని ప్రైవేట్ కాలేజీలు నిలువు దోపిడీ చేస్తున్నాయి! యాజమాన్య కోటా సీటును లక్షన్నర వరకు అమ్ముకుంటున్న యాజమాన్యాలు కాలేజీల నిర్వహణలోనూ అడ్డదారులు తొక్కుతున్నాయి. మౌలిక సదుపాయాలు, సిబ్బంది లేకుండానే కాలేజీలను నిర్వహిస్తున్నాయి. సిబ్బంది ఉండరు.. విద్యార్థులు రారు! రాష్ట్రంలోని 50 శాతం డీఎడ్ కాలేజీల్లో ల్యాబ్ సదుపాయాలు లేవు. పక్కా భవనాలు లేవు. రేకుల షెడ్లు, స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్, బీఎడ్ కాలేజీల్లోని రెండు గదుల్లో రెండేళ్ల డీఎడ్ కోర్సును నెట్టుకొస్తున్నాయి. మెరుగైన విద్యా బోధన, నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిచ్చాయి. కొన్ని కాలేజీల్లోనైతే అసలు బోధనా సిబ్బందే కనిపించడం లేదని.. మరికొన్ని కాలేజీల్లోనైతే విద్యార్థులు కూడా లేరని విద్యాశాఖ తనిఖీల్లోనే వెల్లడైంది. డీఎడ్ కాలేజీల అక్రమాలపై విద్యాశాఖకు ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 650 వరకున్న ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో దాదాపు 100కు పైగా కాలేజీలపై ఫిర్యాదులు అందాయి. అక్రమ మార్గంలో నిర్వహిస్తున్న కాలేజీలు దాదాపు 250కి పైగా ఉన్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు అంచనా వేశారు. కన్వీనర్ కోటాలో సీటు వచ్చినా.. కన్వీనర్ కోటాలో డీఎడ్ సీటు వచ్చినా విద్యార్థులను చేర్చుకునేందుకు యాజమాన్యాలు డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. చిత్తూరు, ప్రకాశం, కర్నూలు, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఒరిజినల్ సర్టిఫికెట్లు లేవని, ఫీజు రీయింబర్స్మెంట్ రాదంటూ విద్యార్థులను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మరికొన్ని కాలేజీలైతే మీరు రావాల్సిన పని లేదని హాజరు మినహాయింపు ఇతర ఖర్చుల పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి కనీసం రూ. 10 వేలు వసూలు చేసినట్లు సమాచారం. ముడుపుల మాయ! ఓ కాలేజీకి రెన్యువల్ అవకాశం ఇవ్వాలంటే రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ) నేతృత్వంలో ఆర్జేడీ, డీఈఓ, డైట్ ప్రిన్సిపాల్ నేతృత్వంలో తనిఖీలు జరపాలి. కానీ వాస్తవాలను పట్టించుకోకుండా సర్టిఫై చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఏటా తనిఖీల తతంగంలో భారీ మొత్తంలో ముడుపులు ముడుతున్నట్లు ఆరోపణలున్నాయి. కాలేజీల అక్రమాలకు మరికొన్ని ఉదాహరణలు.. గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఒకే క్యాంపస్‌లో ఏడు కాలేజీలున్నాయి. అన్నింటికీ ఒకటే అడ్రస్. బీఎడ్, బీఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఫార్మా-డీ, డీఎంఎల్టీ, ఐటీఐతోపాటు డీఎడ్‌ను నిర్వహిస్తున్నారు. ప్రకాశం, చిత్తూరు, కర్నూలు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. కొన్నిచోట్ల స్కూళ్లలో, మరికొన్ని చోట్ల కాలేజీల్లో, ఇంకొన్ని చోట్ల ఇంజనీరింగ్ కళాశాలల్లో డీఎడ్ కాలేజీలు ఉన్నాయి. ఆ క్యాంపస్‌లోని అన్ని కాలేజీలకు సిబ్బంది అంతా ఒకరే. కాలేజీలకు అనుమతులు, రెన్యువల్స్ దరఖాస్తు చేసుకున్నపుడు సిబ్బంది పేర్లు కాగితాలపై చూపిస్తున్నారు. తనిఖీలు చేస్తే సిబ్బంది ఒకరిద్దరే ఉంటున్నారు. నిబంధనల ప్రకారం ప్రిన్సిపాల్‌తో కలిపి 8 మంది బోధనా సిబ్బంది ఉండాలి. సొంత వెబ్సైట్ ఉండాలి. కళాశాల భవనం, సిబ్బంది, విద్యార్థుల వివరాలను చూపాలి. 70 శాతం కాలేజీలకు వెబ్‌సైటే లేదు. కొన్ని కాలేజీలు స్థలాలు, భవనాలకు సంబంధించి ఫోర్జరీ డాక్యుమెంట్లు అందజేసిన ట్లు సమాచారం. కొన్ని చోట్ల కాలేజీలే లేవు. వాటిని ఎక్కడ నిర్వహిస్తున్నారో అంతుబట్టదు. స్కూళ్లు, కాలేజీల్లో నిర్వహిస్తున్న డీఎడ్ కోర్సుకు ఆయా కాలేజీల్లోని సిబ్బందినే బోధకులుగా చూపుతున్నారు. -
డీఎడ్ సీటు రూ.2 లక్షల పైమాటే
సాక్షి, అనంతపురం : డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) కళాశాలలు అడ్డగోలు వ్యాపారానికి తెర తీశాయి. యాజమాన్య కోటా సీట్లను మార్కెట్ సరుకులా అమ్ముకుంటున్నాయి. సీటు కావాలంటే రూ.2 లక్షలకు పైగా చెల్లించాల్సిందేనని తెగేసి చెబుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ డైట్ కళాశాల(బుక్కపట్నం), 35 ప్రైవేటు డీఎడ్ కళాశాలలు ఉన్నాయి. బుక్కపట్నం డైట్లో 100, మరో ప్రైవేటు కళాశాలలో 100 సీట్లు చొప్పున ఉన్నాయి. మిగిలిన 34 ప్రైవేటు కళాశాలల్లో 50 చొప్పున సీట్లు ఉన్నాయి. అన్ని కళాశాలల్లో కలిపి మొత్తం 1,900 సీట్లు ఉన్నాయి. బుక్కపట్నం డైట్లో యాజమాన్య కోటా ఉండదు. మొత్తం వంద సీట్లను కన్వీనర్ కోటా ద్వారానే భర్తీ చేస్తారు. ఇక 35 ప్రైవేటు కళాశాలల్లోని 1,800 సీట్లలో 80 శాతం అంటే 1,440 సీటు ్ల కన్వీనర్ కోటా కింద , మిగిలిన 360 సీట్లు (20 శాతం) యాజమాన్య కోటా కింద భర్తీ చేస్తారు. ఈ ఏడాది జిల్లాలో దాదాపు 30 వేల మంది విద్యార్థులు డైట్ సెట్ రాశారు. 20 వేల మంది వరకు అర్హత సాధించారు. కన్వీనర్ కోటా సీట్లు తక్కువగా ఉండడంతో ప్రైవేటు కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లకు డిమాండ్ పెరిగిపోయింది. కన్వీనర్ కోటాలో సీటు తెచ్చుకునే విద్యార్థి ఏడాదికి రూ.12,500 ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ సీట్ల భర్తీ వల్ల యాజమాన్యాలు పెద్దగా లాభపడేది ఉండదు. మూడు రోజులుగా డైట్ సెట్ కౌన్సెలింగ్ జరుగుతోంది. కన్వీనర్ కోటాలో 1,540 సీట్లు (బుక్కపట్నం డైట్‌లోని వంద సీట్లు కలుపుకుని) ఉండగా... ఇప్పటిదాకా 600 భర్తీ అయ్యాయి. ఇంకా 940 మాత్రమే మిగిలివున్నాయి. వీటి కోసం దాదాపు ఐదు వేల మంది విద్యార్థులు వేచి చూస్తున్నారు. కన్వీనర్ కోటాలో సీటు వచ్చే పరిస్థితి లేదని భావిస్తున్న విద్యార్థులు యాజమాన్య కోటాలో చేరేందుకు ప్రైవేటు కళాశాలలను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా యాజమాన్యాలు సీటు ఖరీదు అమాంతం పెంచేశాయి. రూ.2 లక్షల పైమాట అయితేనే మాట్లాడాలని విద్యార్థులకు తెగేసి చెబుతున్నాయి. కొన్ని కళాశాలల్లో ‘పాస్ గ్యారంటీ’ అనే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం అందినకాడికి అప్పులు చేసి పిల్లలను డీఎడ్‌లో చేర్పిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను పాటించని కళాశాలలను అనర్హత జాబితాలో చేరుస్తామని ఉన్నతాధికారులు ప్రకటిస్తున్నారే తప్పా... వాస్తవానికి ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు. ఎందుకింత డిమాండ్? విద్యాహక్కు చట్టం ప్రకారం సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు డీఎడ్ అభ్యర్థులు మాత్రమే అర్హులు. అన్ని జిల్లాల్లోనూ ఉన్నత పాఠశాలలకంటే ప్రాథమిక పాఠశాలల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ప్రతి డీఎస్సీలోనూ ఎస్జీటీ పోస్టులను ఎక్కువగా భర్తీ చేస్తున్నారు. ఈ క్రమంలో బీఈడీ చదివిన వారికంటే డీఎడ్ అభ్యర్థులకే ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. దీంతో ఇంటర్మీడియట్ పూర్తయిన వారు రెండేళ్ల కాలపరిమితి గల డీఎడ్ కోర్సులో చేయడానికి మొగ్గుచూపుతున్నారు. గతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు (డైట్లు) జిల్లాకు ఒకటి మాత్రమే ఉండేవి. అయితే, గతేడాది డీఎడ్ కళాశాలల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) సరళతరం చేసింది. దీంతో ప్రైవేటు యాజమాన్యాల కింద పలు కళాశాలలు పుట్టుకొచ్చాయి. ఇందులో ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రమూ పాటించడం లేదు. సంబంధిత అధికారులను ‘మేనేజ్’ చేస్తూ విద్యా వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నాయి. -
డీఎడ్ కళాశాలల జాబితా ఖరారు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 2013-14 విద్యా సంవత్సరంలో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డీఎడ్) కోర్సులో ప్రవేశాలు నిర్వహించే కళాశాలల జాబితాను విద్యాశాఖ ఖరారు చేసింది. 667 డీఎడ్ కాలేజీల్లో 35,250 సీట్లను భర్తీ చేయాలని నిర్ణయించింది. ఇందులో కన్వీనర్ కోటాలో 28,830 సీట్లను భర్తీ చేస్తారు. మేనేజ్మెంట్ కోటాలో యాజమాన్యాలు 6,420 సీట్లను భర్తీ చేయనున్నాయి. 25 ప్రభుత్వ డీఎడ్ కాలేజీల్లోని 3,150 సీట్లతోపాటు 642 ప్రైవేట్ కాలేజీల్లోని 25,680 సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు డైట్‌సెట్-2013 కన్వీనర్ సురేందర్‌రెడ్డి తెలిపారు. విద్యార్థులు ఈనెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునేందుకు ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 19వ తేదీన సీట్లను కేటాయిస్తామని వెల్లడించారు. సీట్లు పొందిన వారు సంబంధిత జిల్లాల్లోని డైట్ కాలేజీల్లో ఈనెల 23వ తేదీనుంచి 26లోగా నిర్ణీత ర్యాంకు ప్రకారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరు కావాలని సూచించారు. 27వ తేదీ నుంచి తరగతులు ప్రారంభం అవుతాయి. రెండో దశ డీఎడ్ కౌన్సెలింగ్‌ను డిసెంబర్ 2వ తేదీనుంచి 19 వరకు నిర్వహిస్తారు. డిసెంబర్ 2వ తేదీ నుంచి 4 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. 10వ తేదీన సీట్లు కేటాయిస్తారు. 16వ తేదీ నుంచి 19 వరకు కౌన్సెలింగ్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపడతారు. ఇంకా సీట్లు మిగిలితే డిసెంబర్ 27వ తేదీ నుంచి 30 వరకు చివరి దశ కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. 27వ తేదీ నుంచి 29 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం ఇచ్చి 30వ తేదీన సీట్లు కేటాయిస్తారు. -
డీఎడ్ భర్తీ వివరాలన్నీ వెబ్సైట్లలో..
యాజమాన్య కోటా అడ్మిషన్లపై డీఎడ్ కాలేజీలకు విద్యాశాఖ ఆదేశాలు సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) యాజమాన్య కోటా సీట్ల భర్తీకి సంబంధించిన అన్ని వివరాలనూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని, పారదర్శకంగా అడ్మిషన్లు చేపట్టాలని కాలేజీలకు విద్యాశాఖ స్పష్టం చేసింది. దరఖాస్తు ఫారాలను, ప్రవేశాల కోసం వచ్చే దరఖాస్తులు, అభ్యర్థుల వివరాలను, మెరిట్ వివరాలను తప్పనిసరిగా వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రైవేటు డీఎడ్ కాలే జీల యాజమాన్యాలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. యాజమాన్య కోటా సీట్ల భర్తీలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను అందులో పొందుపరిచింది. యాజమాన్య కోటా భర్తీకి మార్గదర్శకాలు: అభ్యర్థులకు ఇంటర్లో 50 శాతం కంటే తక్కువ మార్కులు ఉండకూడదు. యాజమాన్యాలు రెండు పెద్ద పత్రికల్లో సీట్ల భర్తీకి ప్రకటన జారీ చేయాలి.. అందులో కాలేజీ పూర్తి చిరునామా, దరఖాస్తుల విక్రయం, స్వీకరణ గడువు, వెబ్సైట్ పూర్తి వివరాలు ఉండాలి. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు కనీసం 10 రోజులు గడువు ఇవ్వాలి. దరఖాస్తు ఫారాలను అందజేసే, స్వీకరించే వారి వివరాలు ఇవ్వాలి. కాలేజీ వెబ్సైట్లో, డైట్‌సెట్ వెబ్సైట్లోనూ దరఖాస్తు ఫారాన్ని అందుబాటులో ఉంచాలి. విద్యార్థులు దరఖాస్తులను డౌన్లోడ్ చేసుకుని సంబంధిత కాలేజీలో రిజిస్టర్డ్ పోస్టు లేదా స్వయంగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. దరఖాస్తు స్వీకరించాక రసీదు ఇవ్వాలి. రోజువారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలను, మెరిట్ ప్రకారం విద్యార్థుల జాబితాలను ప్రవేశాలు పూర్తయ్యేవరకు కళాశాల వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలి. ఆ జాబితాను డైట్‌సెట్ కన్వీనర్‌కు అందజేయాలి. అనంతరం ప్రవేశాలు చేపట్టాలి. సీటు కేటాయించాక 7 రోజులలోగా విద్యార్థి చేరకపోతే ఆ తరువాత మెరిట్లో ఉన్న విద్యార్థికి ప్రవేశం కల్పించాలి. కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ ముగిశాక మేనేజ్మెంట్ కోటా సీట్లను భర్తీ చేయడానికి వీలులేదు. ఆలోగానే, అర్హులైన వారినే చేర్చుకోవాలి. ఈ నిబంధనలు పాటించకపోతే యాజమాన్యంపై చర్యలు తప్పవు. అనర్హులను చేర్చుకుంటే వారిని పరీక్షలకు అనుమతించరు. 11 నుంచి డీఎడ్ కౌన్సెలింగ్.. డీఎడ్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి 11వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 11నుంచి 14వ తేదీ వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 19న అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు. 23 నుంచి 26 వరకు ప్రవేశాలకు గడువు.. 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. మిగిలిపోయిన, విద్యార్థులు చేరని సీట్ల భర్తీకి డిసెంబరు 2 నుంచి 19వ తేదీ వరకు రెండో దశ కౌన్సెలింగ్‌ను, డిసెంబరు 27 నుంచి 30వ తేదీ వరకు చివరి దశ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తారు. -
11 నుంచి డీఎడ్ కౌన్సెలింగ్
షెడ్యూలు జారీ చేసిన విద్యాశాఖ 11 నుంచి 14 వరకూ వెబ్ ఆప్షన్లు, 19న సీట్ల కేటాయింపు 27న తరగతులు ప్రారంభం డిసెంబర్ 2 నుంచి రెండోదశ, 27 నుంచి చివరి దశ కౌన్సెలింగ్ సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం విద్యాశాఖ ఎట్టకేలకు గురువారం షెడ్యూలు జారీ చేసింది. మొదటి దశ కౌన్సెలింగ్‌ను ఈ నెల 11 నుంచి చేపట్టనున్నట్లు ఈ మేరకు డైట్‌సెట్ (డీఈఈసెట్) చైర్మన్ డాక్టర్ జి.వాణీమోహన్, కన్వీనర్ ఆర్.సురేందర్‌రెడ్డి వెల్లడించారు. కళాశాలల జాబితా, ర్యాంకుల వారీ వివరాలు, ప్రవేశాలకు సంబంధించిన పూర్తి సమాచారం, ప్రక్రియను ఈ నెల 10వ తేదీన తమ వెబ్సైట్ (http://dietcet.cgg.gov.in)లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు 11వ తేదీ నుంచి వెబ్సైట్ ద్వారా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొన్నారు. డైట్‌సెట్-2013లో అర్హత సాధించిన దాదాపు 2.71 లక్షల మంది అభ్యర్థులు నాలుగు నెలలుగా కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల డీఎడ్ కోర్సులో కౌన్సెలింగ్ ద్వారా 30 వేలకుపైగా సీట్లను భర్తీ చేయనున్నారు. మైనారిటీ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రత్యేక షెడ్యూలు జారీ కానుంది. ఇదీ షెడ్యూలు... నవంబర్ 11 నుంచి 26 వరకూ మొదటి దశ కౌన్సెలింగ్ 11 నుంచి 14 వరకూ వెబ్ ఆప్షన్లు 19న సీట్ల కేటాయింపు 23 నుంచి 26 వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 27న తరగతులు ప్రారంభం డిసెంబర్ 2 నుంచి 19 వరకూ రెండో దశ కౌన్సెలింగ్ 2 నుంచి 4 వరకూ వెబ్ ఆప్షన్లు 10న సీట్ల కేటాయింపు 16 నుంచి 19 వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ 27 నుంచి 30 వరకూ చివరి దశ కౌన్సెలింగ్ 27 నుంచి 29 వరకూ వెబ్ ఆప్షన్లు 30న సీట్ల కేటాయింపు -
డీఎడ్ లో ప్రవేశాలకు 11 నుంచి కౌన్సిలింగ్
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో ప్రవేశాలకు నవంబరు రెండో వారంలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం 630 వరకున్న డీఎడ్ కాలేజీల రెన్యువల్స్ పూర్తి కావచ్చింది. దీంతో నవంబరు నాలుగో తేదీ నాటికి అనుమతులు లభించిన కాలేజీలు అన్నింటిలో నవంబర్ 11నుంచి కౌన్సెలింగ్ చేపట్టేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీనిపై ప్రాథమిక విద్యా ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం విద్యాశాఖ అధికారులతో చర్చించి, కౌన్సెలింగ్ నిర్వహణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో డైట్‌సెట్-2013లో అర్హత సాధించి డీఎడ్‌లో ప్రవేశాల కోసం మూడు నెలలుగా ఎదురుచూస్తున్న 2.71 లక్షల మంది అభ్యర్థులకు ఎట్టకేలకు ఊరట లభించనుంది. సాధారణ కాలేజీలు, మైనారిటీ కాలేజీల్లోనూ ఒకేసారి కౌన్సెలింగ్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ‘మెరిట్’కే మేనేజ్మెంట్ కోటా: మేనేజ్మెంట్ కోటా సీట్లను మెరిట్ అభ్యర్థులకే కేటాయించేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీకి యాజమాన్యాలు నోటిఫికేషన్ జారీ చేసి ప్రవేశాలు చేపట్టాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని ఇష్టమొచ్చిన వారిని 20 శాతం మేనేజ్మెంట్ కోటా సీట్లల్లో చేర్చుకున్న పలు యాజమాన్యాలు ఇకపై అలా చేయడం కుదరదు. కచ్చితంగా మెరిట్ విధానాన్ని పాటించాల్సిందే. ప్రతి కళాశాల తమ వెబ్సైట్లో దరఖాస్తు ఫారాన్ని తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి. వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. దరఖాస్తులను నిరాకరించడానికి, మెరిట్ అభ్యర్థులకు సీటును నిరాకరించడానికి వీల్లేదు. తమ కాలేజీలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న, సీట్లు కేటాయించిన వారి వివరాలు తమ కళాశాల వెబ్సైట్లో పొందుపరచాలి. తద్వారా యాజ మాన్య కోటా సీట్ల భర్తీలో మరింత పారదర్శకత పెంచాలని విద్యాశాఖ భావిస్తోంది. ఈ నిబంధనలను పాటించని కాలేజీలపై విద్యా చట్టం ప్రకారం చర్యలు చేపట్టనుంది. అవసరమైతే ఆయా కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి సిఫారసు చే యనుంది. మరోవైపు యాజమాన్యాలకు ఐదు నుంచి పదేళ్లకు ఒకసారి రెన్యువల్ తీసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఉన్నతాధికారులు కాలేజీ రెన్యువల్ గడువును పదేళ్లకోసారి చేయాలని భావిస్తున్నారు. దీనిపై ఒకటీ రెండు రోజుల్లో తుది నిర్ణయం వెలువడనుంది. డీఎడ్ ప్రవేశాల షెడ్యూల్ వెబ్ ఆప్షన్లు: నవంబర్ 11నుంచి 14వ తేదీ వరకు సీట్ల కేటాయింపు: 19వ తేదీ సర్టిఫికెట్ల వెరిఫికేషన్: 23-26వ తేదీ వరకు తరగతుల ప్రారంభం: 27వ తేదీ -
ఇదేం మైండ్‘సెట్’?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డీఎడ్) కాలేజీలకు అనుమతుల(రెన్యువల్స్) జారీలో జరుగుతున్న జాప్యం డైట్‌సెట్ అభ్యర్థులకు శాపంగా మారుతోంది. ఏటా ఇదే తంతు కొనసాగుతుండటంపై లక్షలాది మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జూలైలోనే డీఎడ్ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఇంతవరకు కనీసం కౌన్సెలింగ్‌కు కూడా మోక్షం కలగలేదు. దీంతో 2.5 లక్షల మందికి పైగా అభ్యర్థులకు ఆందోళన చెందుతున్నారు. కాలేజీలకు అనుమతుల విషయంలో గత ఏడాది కూడా ఇలాగే జాప్యం జరిగింది. నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ ఉన్నారా..? వసతులు ఎలా ఉన్నాయి..? తదితర అంశాలపై ఓసారి తనిఖీ చేశారు. కానీ కాలేజీలను మళ్లీ తనిఖీ చేయాలంటూ మంత్రి ఆదేశించడంతో గతేడాది ఆలస్యంగా (ఈ ఏడాది ఫిబ్రవరిలో) అడ్మిషన్లు చేపట్టాల్సి వచ్చింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ అనుభవంతో కనీసం ఈ విద్యా సంవత్సరమైనా సకాలంలో ప్రవేశాలు చేపడతారని భావించినా... పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. రెండు విడతల్లో కాలేజీలన్నింటికీ అనుమతి ఇవ్వాలని అధికారులు ముందుగా ప్రతిపాదనలు (కాలేజీల పేర్లతో కూడిన రెండు జాబితాలు) పంపితే.. వాటిని పక్కనబెట్టారు. అలా కాకుండా ఒక్కో కాలేజీకి సంబంధించి ఒక్కో ఫైలు వేర్వేరుగా (జాబితా కాకుండా దేనికదే) పంపించాలని ఆదేశించారు. ఆ జాబితాలో ఒక్కో కాలేజీకి అనుమతి ఇస్తుండటంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. నెలరోజుల కిందట ఈ అనుమతుల జారీ ప్రక్రియ మొదలైనా ఇప్పటికీ పూర్తి కాలేదు.కనీసం రూ.30 వేలు ఇవ్వాల్సిందే: కాలేజీల రెన్యువల్స్ విషయంలో మంత్రి శైలజానాథ్ పేరుతో ఆయన అనుచరులే వసూళ్లకు దిగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ముడుపులివ్వనిదే అనుమతి రాదని, తాము ఓకే అంటేనే మంత్రి సంతకం చేస్తారని ఒక్కో కాలేజీ యాజమాన్యం నుంచి రూ.30 వేల చొప్పున మంత్రి అనుచరులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. 630 వరకున్న ప్రైవేటు డీఎడ్ కాలేజీల రెన్యువల్స్ వ్యవహారంలో భారీగా ముడుపులు దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.