సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డీఎడ్) కాలేజీలకు అనుమతుల(రెన్యువల్స్) జారీలో జరుగుతున్న జాప్యం డైట్‌సెట్ అభ్యర్థులకు శాపంగా మారుతోంది. ఏటా ఇదే తంతు కొనసాగుతుండటంపై లక్షలాది మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జూలైలోనే డీఎడ్ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఇంతవరకు కనీసం కౌన్సెలింగ్‌కు కూడా మోక్షం కలగలేదు. దీంతో 2.5 లక్షల మందికి పైగా అభ్యర్థులకు ఆందోళన చెందుతున్నారు.
కాలేజీలకు అనుమతుల విషయంలో గత ఏడాది కూడా ఇలాగే జాప్యం జరిగింది. నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ ఉన్నారా..? వసతులు ఎలా ఉన్నాయి..? తదితర అంశాలపై ఓసారి తనిఖీ చేశారు. కానీ కాలేజీలను మళ్లీ తనిఖీ చేయాలంటూ మంత్రి ఆదేశించడంతో గతేడాది ఆలస్యంగా (ఈ ఏడాది ఫిబ్రవరిలో) అడ్మిషన్లు చేపట్టాల్సి వచ్చింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ అనుభవంతో కనీసం ఈ విద్యా సంవత్సరమైనా సకాలంలో ప్రవేశాలు చేపడతారని భావించినా... పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. రెండు విడతల్లో కాలేజీలన్నింటికీ అనుమతి ఇవ్వాలని అధికారులు ముందుగా ప్రతిపాదనలు (కాలేజీల పేర్లతో కూడిన రెండు జాబితాలు) పంపితే.. వాటిని పక్కనబెట్టారు. అలా కాకుండా ఒక్కో కాలేజీకి సంబంధించి ఒక్కో ఫైలు వేర్వేరుగా (జాబితా కాకుండా దేనికదే) పంపించాలని ఆదేశించారు.
ఆ జాబితాలో ఒక్కో కాలేజీకి అనుమతి ఇస్తుండటంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. నెలరోజుల కిందట ఈ అనుమతుల జారీ ప్రక్రియ మొదలైనా ఇప్పటికీ పూర్తి కాలేదు.కనీసం రూ.30 వేలు ఇవ్వాల్సిందే: కాలేజీల రెన్యువల్స్ విషయంలో మంత్రి శైలజానాథ్ పేరుతో ఆయన అనుచరులే వసూళ్లకు దిగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ముడుపులివ్వనిదే అనుమతి రాదని, తాము ఓకే అంటేనే మంత్రి సంతకం చేస్తారని ఒక్కో కాలేజీ యాజమాన్యం నుంచి రూ.30 వేల చొప్పున మంత్రి అనుచరులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. 630 వరకున్న ప్రైవేటు డీఎడ్ కాలేజీల రెన్యువల్స్ వ్యవహారంలో భారీగా ముడుపులు దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఇదేం మైండ్‘సెట్’?
Published Mon, Oct 14 2013 12:29 AM | Last Updated on Fri, Sep 1 2017 11:38 PM
Advertisement