diet cet
-
మారని నేలరాతలు
– అసౌకర్యాల మధ్య డీఎడ్ పరీక్షలు అనంతపురం ఎడ్యుకేషన్ : అధికారుల నిర్వాకంతో అతి తక్కువ సంఖ్యలో పరీక్షలు రాస్తున్న డీఎడ్ విద్యార్థులకు నేలరాతలు తప్పలేదు. 2 వేల మంది హాజరయ్యే డీఎడ్ పరీక్షలు నేలపై కూర్చోబెట్టి రాయిస్తుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎక్కడో కాదు జిల్లా కేంద్రంలోనే ఈ దుస్థితి నెలకొంది. 2014–16 బ్యాచ్ డీఎడ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 3 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అనంతపురం నగరంలో మూడు, పెనుకొండ, బుక్కపట్నం, కదిరి, తాడిపత్రి, గుంతకల్లు, కళ్యాణదుర్గంలో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేశారు. నగరంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగరపాలక ఉన్నత పాఠశాలలో సుమారు 250 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఒక గదిలో మాత్రమే ఫర్నీచర్ ఏర్పాటు చేశారు. తక్కిన గదుల్లో నేలపై కూర్చొని విద్యార్థులు పరీక్ష రాయాల్సి వచ్చింది. గంటల పాటు కింద కూర్చోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందని విద్యార్థులు వాపోతున్నారు. అధికారులు ఈ కేంద్రాన్ని పర్యవేక్షించినా తగినంత ఫర్నీచరు ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
డైట్ సెట్ అభ్యర్థులకు 2న ప్రత్యేక కౌన్సెలింగ్
బుక్కపట్నం : 2016 డైట్ సెట్ అభ్యర్థులకు అక్టోబర్ 2న స్పెషల్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు డైట్ ప్రిన్సిపాల్ జనార్దన్‌నెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తేదీ సీట్లు కేటాయింపు జరుగుతుందని, సీట్లు కేటాయించిన వారు 4,5 తేదీల్లో డైట్లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావాలన్నారు. అలాగే జిల్లాలోని అన్ని ప్రయివేట్ డీఎడ్ కళశాలలకు శుక్రవారం నుంచి వచ్చే నెల 12వ తేదీ వరకు దసరా సెలవులు ఉంటాయని ఆయన తెలిపారు. -
18 నుంచి డైట్‌సెట్ రెండో కౌన్సెలింగ్
అంగలూరు (గుడ్లవల్లేరు): డైట్ సెట్– 2016 రెండో విడత కౌన్సెలింగ్ ఈ నెల 18వ తేదీ నుంచి జరుగనుందని ప్రభుత్వ జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ (డైట్) ప్రిన్సిపాల్ జి.వెంకటేశ్వరరావు శనివారం తెలిపారు. 19 నుంచి 21 వరకు కాలేజీలను ఎంపిక చేసుకోవచ్చని చెప్పారు. 22 నుంచి 28వ తేదీ వరకు సీట్ల కేటాయింపు జరుగుతుందని చెప్పారు. 29వ తేదీన అలాట్మెంట్ లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. డైట్లో 30, 31వ తేదీల్లో సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని పేర్కొన్నారు. -
డైట్ సీట్ల భర్తీకి కౌన్సెలింగ్
అంగలూరు (గుడ్లవల్లేరు) : జిల్లాలోని డైట్ సీట్ల భర్తీకి 223 దరఖాస్తులను స్వీకరించి నట్లు అంగలూరు ప్రభుత్వ జిల్లా ఉపాధ్యాయ శిక్షణా సంస్థ(డైట్) ప్రిన్సిపాల్ జి. వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం నుంచి డైట్లో జిల్లాకు సంబంధించిన సీట్లకు ఆయన కౌన్సిలింగ్ చేపట్టారు. జిల్లాలోని 32డైట్లు ఉన్నాయన్నారు. వాటిలోని 2,750సీట్లలో తొలి విడతగా 1,458 సీట్లను కేటాయించారని తెలిపారు. మేనేజ్మెంట్ సీట్లు 530 ఉన్నాయని చెప్పారు. ఆన్లైన్లో ఏ అభ్యర్థులకు ఏ సమయం కేటాయిస్తే ఆ సమయంలోనే కౌన్సిలింగ్‌కు రావాలని సూచించారు. వచ్చేటపుడు, ప్రొవిజినల్ ఎలాట్మెంట్ లెటర్, ఆన్లైన్ అప్లికేషన్ లెటర్, డైట్‌సెట్ ర్యాంకు కార్డు, 10వ తరగతి మార్క్స్ లిస్ట్, ఇంటర్మీడియట్ మార్క్స్ లిస్ట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్(టీసీ), 4నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు , కుల ధృవీకరణ సర్టిఫికెట్(మీ–సేవా ద్వారా తీసుకున్నవి), ఆదాయ ధృవీకరణ సర్టిఫికెట్ లేదా రేష్కార్డు జిరాక్స్(రేషన్‌కార్డు అయితే వెరిఫికేషన్ ఆఫీసర్‌కు ఒరిజినల్ కార్డు చూపించాలి), ³హెచ్‌సీ, స్పోర్ట్, ఆర్మీ కోటా అభ్యర్థులు సంబంధిత సర్టిఫికెట్లు ఈ కింది ధృవపత్రాలను తీసుకురావాలని కోరారు. -
డీఎడ్ ప్రవేశాల మార్గదర్శకాల్లో సవరణలు
ఎస్సీ, ఎస్టీలకు 45శాతం మార్కులు ఉండాల్సిందే సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో ప్రవేశాలకు గత ఏడాది జారీ చేసిన మార్గదర్శకాల్లో ప్రభుత్వం పలు మార్పులు తీసుకువచ్చింది. ఈ మేరకు ప్రాథమిక విద్య ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య గురువారం జీఓ జారీచేశారు. డైట్‌సెట్ రాసే (డీఈఈ సెట్) జనరల్ అభ్యర్థులకు ఇంటర్లో 50 శాతం మార్కులు ఉండాలని గతంలోనే పేర్కొన్నా.. ఇక ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు కూడా 45 శాతం మార్కులు ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఉత్తర్వుల్లోని మరిన్ని సవరణలు - మేనేజ్మెంట్ కోటాలో చేరే విద్యార్థి కచ్చితంగా డీఈఈసెట్లో ర్యాంకు సాధించాలి. - మైనారిటీ కాలేజీ యాజమాన్యాలు రెగ్యులర్ కౌన్సెలింగ్‌లో కాకుండా తాము ప్రత్యేక కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు చేపట్టాలంటే నిర్ణీత గడువులోగా మైనారిటీ హోదా సర్టిఫికెట్తో పాఠశాల విద్యా కమిషనర్‌కు దరఖాస్తు చేసుకోవాలి. - నాన్‌మైనారిటీ విద్యా సంస్థల్లో కౌన్సెలింగ్ తరువాత మిగిలిపోయిన సీట్ల వివరాలను 15రోజుల్లోగా డీఈఈసెట్ కన్వీనర్‌కు తెలియజేయాలి. - మైనారిటీ కాలేజీల్లో సీట్లను భర్తీ చేయాల్సిన పూర్తి బాధ్యత కన్వీనర్దే. - భర్తీ అయినవి, మిగులు సీట్ల వివరాలు అన్నీ జూలై రెండో వారం నుంచి నాలుగో వారంలోగా సంబంధిత అధికారులు నివేదించాలి. -
జూన్ 15న డీఈఈ సెట్
* మే 17వరకు ఫీజు చెల్లింపు.. నోటిఫికేషన్ జారీ సాక్షి, హైదరాబాద్: రెండేళ్ల డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో (డీ ఎడ్) ప్రవేశాల కోసం నిర్వహించే డీఈఈసెట్-2014కు పాఠశాల విద్యాశాఖ మంగళవారం నోటిఫికేషన్ జారీ చేసింది. జూన్ 15వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని పేర్కొంది. అభ్యర్థులు మే 5 నుంచి 17వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని, మే 6 నుంచి 18వ తేదీ వరకు ఆన్లైన్లో (http://dietcet.cgg.gov.in) దరఖాస్తులను సబ్మిట్ చేయవచ్చని డైట్‌సెట్ చైర్మన్, కన్వీనర్ ఎం.జగదీశ్వర్, సురేందర్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తులకు సంబంధించిన పూర్తి వివరాలను మే 5 నుంచి తమ వెబ్సైట్లో పొందవచ్చన్నారు. పాత సిలబస్ ప్రకారమే ఈసారి డీఈఈ సెట్‌ను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. -
నేటి నుంచి డైట్‌సెట్ కౌన్సెలింగ్
నెల్లూరు సిటీ, న్యూస్‌లైన్ : జిల్లాలో సోమవారం నుంచి డైట్‌సెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభంకానుంది. అభ్యర్థులు ఏ కేంద్రానికీ వెళ్లాల్సిన అవసరం లేదు. సొంత కంప్యూటర్లు, ఇంటర్నెట్ కేఫ్‌ల నుంచి ఆప్షన్లు ఎం చుకోవచ్చు. కోరుకున్న మూడు కళాశాలలను వరుస క్రమంలో పొందుపరుచుకోవాల్సి ఉంది. 15వ తేదీ వరకు వె బ్ ఆప్షన్లకు గడువు ఉంది. ప్రతిభ, ర్యాంకుల ఆధారంగా ఈ నెల 1న సీటు కేటాయిస్తారు. సీటు పొందినవారికి సమాచారం ఇస్తారు. వారు మాత్రమే 23న ఇందుకూరుపేట మం డలం పల్లిపాడులోని ప్రభుత్వ డైట్ కళాశాలలో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంది. ఈ నెల 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. అన్నిసెట్లకు భిన్నంగా.. అన్ని ప్రవేశపరీక్షలకు భిన్నంగా డైట్‌సెట్ కౌన్సెలింగ్‌లో తొలుత వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమవుతోంది. సాధరణంగా కౌన్సెలింగ్‌లలో ముందుగా సర్టిఫికెట్ల పరిశీలన, వెబ్ఆప్షన్ల ప్రక్రియ, కళాశాలల కేటాయింపు... ఇలా ఉంటుంది వరుసక్రమం. డైట్‌సెట్‌లో మాత్రం సీటు లభించాకే, జిల్లావ్యాప్తంగా ఒక్క పల్లిపాడు ప్రభుత్వ డైట్ కళాశాలలోనే సర్టిఫికెట్ల పరిశీలన చేపడుతున్నారు. స్వీకరించిన సర్టిఫికెట్లు, ఇతర వివరాలను సంబంధిత కళాశాలలకు పంపుతారు. జిల్లాలో 6500 మంది డైట్‌సెట్ పరీక్షకు హాజరై ర్యాంకులు సాధించి ఉన్నారు. జిల్లాలో 12 ప్రైవేట్ కళాశాలలున్నాయి. ఒక్కో కళాశాలలో 50 సీట్లు ఉన్నాయి. వీటిలో 40 సీట్లు కన్వీనర్ కోటా కింద, పది సీట్లు యాజమాన్య కోటా కింద ఉంటాయి. పల్లెపాడులో ఉన్న ప్రభుత్వ డైట్ కళాశాలలో మాత్రం 150 సీట్లు ఉన్నాయి. గతేడాది వరకు జిల్లాలో 11 ప్రైవేటు కళాశాలల్లో కలిపి 550 సీట్లు ఉండేవి. ఈ ఏడాది శ్రీహర్ష ఎడ్యుకేషనల్ సొసైటీకి కొత్తగా ప్రభుత్వం అనుమతి మంజూరు చేయడంతో మరో 50 సీట్లు అదనంగా అభించాయి. -
ఇదేం మైండ్‘సెట్’?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రైవేటు డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డీఎడ్) కాలేజీలకు అనుమతుల(రెన్యువల్స్) జారీలో జరుగుతున్న జాప్యం డైట్‌సెట్ అభ్యర్థులకు శాపంగా మారుతోంది. ఏటా ఇదే తంతు కొనసాగుతుండటంపై లక్షలాది మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది జూలైలోనే డీఎడ్ ప్రథమ సంవత్సరం తరగతులు ప్రారంభం కావాల్సి ఉన్నా.. ఇంతవరకు కనీసం కౌన్సెలింగ్‌కు కూడా మోక్షం కలగలేదు. దీంతో 2.5 లక్షల మందికి పైగా అభ్యర్థులకు ఆందోళన చెందుతున్నారు. కాలేజీలకు అనుమతుల విషయంలో గత ఏడాది కూడా ఇలాగే జాప్యం జరిగింది. నిబంధనల ప్రకారం ఫ్యాకల్టీ ఉన్నారా..? వసతులు ఎలా ఉన్నాయి..? తదితర అంశాలపై ఓసారి తనిఖీ చేశారు. కానీ కాలేజీలను మళ్లీ తనిఖీ చేయాలంటూ మంత్రి ఆదేశించడంతో గతేడాది ఆలస్యంగా (ఈ ఏడాది ఫిబ్రవరిలో) అడ్మిషన్లు చేపట్టాల్సి వచ్చింది. దీంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆ అనుభవంతో కనీసం ఈ విద్యా సంవత్సరమైనా సకాలంలో ప్రవేశాలు చేపడతారని భావించినా... పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. రెండు విడతల్లో కాలేజీలన్నింటికీ అనుమతి ఇవ్వాలని అధికారులు ముందుగా ప్రతిపాదనలు (కాలేజీల పేర్లతో కూడిన రెండు జాబితాలు) పంపితే.. వాటిని పక్కనబెట్టారు. అలా కాకుండా ఒక్కో కాలేజీకి సంబంధించి ఒక్కో ఫైలు వేర్వేరుగా (జాబితా కాకుండా దేనికదే) పంపించాలని ఆదేశించారు. ఆ జాబితాలో ఒక్కో కాలేజీకి అనుమతి ఇస్తుండటంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. నెలరోజుల కిందట ఈ అనుమతుల జారీ ప్రక్రియ మొదలైనా ఇప్పటికీ పూర్తి కాలేదు.కనీసం రూ.30 వేలు ఇవ్వాల్సిందే: కాలేజీల రెన్యువల్స్ విషయంలో మంత్రి శైలజానాథ్ పేరుతో ఆయన అనుచరులే వసూళ్లకు దిగుతున్నట్లు ఆరోపణలున్నాయి. ముడుపులివ్వనిదే అనుమతి రాదని, తాము ఓకే అంటేనే మంత్రి సంతకం చేస్తారని ఒక్కో కాలేజీ యాజమాన్యం నుంచి రూ.30 వేల చొప్పున మంత్రి అనుచరులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. 630 వరకున్న ప్రైవేటు డీఎడ్ కాలేజీల రెన్యువల్స్ వ్యవహారంలో భారీగా ముడుపులు దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.