మారని నేలరాతలు
– అసౌకర్యాల మధ్య డీఎడ్ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్ : అధికారుల నిర్వాకంతో అతి తక్కువ సంఖ్యలో పరీక్షలు రాస్తున్న డీఎడ్ విద్యార్థులకు నేలరాతలు తప్పలేదు. 2 వేల మంది హాజరయ్యే డీఎడ్ పరీక్షలు నేలపై కూర్చోబెట్టి రాయిస్తుండడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎక్కడో కాదు జిల్లా కేంద్రంలోనే ఈ దుస్థితి నెలకొంది. 2014–16 బ్యాచ్ డీఎడ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 3 నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షలు రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతున్నాయి.
జిల్లా వ్యాప్తంగా అనంతపురం నగరంలో మూడు, పెనుకొండ, బుక్కపట్నం, కదిరి, తాడిపత్రి, గుంతకల్లు, కళ్యాణదుర్గంలో ఒక్కో కేంద్రం ఏర్పాటు చేశారు. నగరంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ నగరపాలక ఉన్నత పాఠశాలలో సుమారు 250 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ఒక గదిలో మాత్రమే ఫర్నీచర్ ఏర్పాటు చేశారు. తక్కిన గదుల్లో నేలపై కూర్చొని విద్యార్థులు పరీక్ష రాయాల్సి వచ్చింది. గంటల పాటు కింద కూర్చోవాలంటే చాలా ఇబ్బందిగా ఉందని విద్యార్థులు వాపోతున్నారు. అధికారులు ఈ కేంద్రాన్ని పర్యవేక్షించినా తగినంత ఫర్నీచరు ఏర్పాటు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.