యాజమాన్య కోటా అడ్మిషన్లపై డీఎడ్ కాలేజీలకు విద్యాశాఖ ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) యాజమాన్య కోటా సీట్ల భర్తీకి సంబంధించిన అన్ని వివరాలనూ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచాలని, పారదర్శకంగా అడ్మిషన్లు చేపట్టాలని కాలేజీలకు విద్యాశాఖ స్పష్టం చేసింది. దరఖాస్తు ఫారాలను, ప్రవేశాల కోసం వచ్చే దరఖాస్తులు, అభ్యర్థుల వివరాలను, మెరిట్ వివరాలను తప్పనిసరిగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రైవేటు డీఎడ్ కాలే జీల యాజమాన్యాలకు విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. యాజమాన్య కోటా సీట్ల భర్తీలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను అందులో పొందుపరిచింది.
యాజమాన్య కోటా భర్తీకి మార్గదర్శకాలు: అభ్యర్థులకు ఇంటర్‌లో 50 శాతం కంటే తక్కువ మార్కులు ఉండకూడదు. యాజమాన్యాలు రెండు పెద్ద పత్రికల్లో సీట్ల భర్తీకి ప్రకటన జారీ చేయాలి.. అందులో కాలేజీ పూర్తి చిరునామా, దరఖాస్తుల విక్రయం, స్వీకరణ గడువు, వెబ్‌సైట్ పూర్తి వివరాలు ఉండాలి. విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు కనీసం 10 రోజులు గడువు ఇవ్వాలి. దరఖాస్తు ఫారాలను అందజేసే, స్వీకరించే వారి వివరాలు ఇవ్వాలి. కాలేజీ వెబ్‌సైట్‌లో, డైట్‌సెట్ వెబ్‌సైట్‌లోనూ దరఖాస్తు ఫారాన్ని అందుబాటులో ఉంచాలి. విద్యార్థులు దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకుని సంబంధిత కాలేజీలో రిజిస్టర్డ్ పోస్టు లేదా స్వయంగా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. దరఖాస్తు స్వీకరించాక రసీదు ఇవ్వాలి.
రోజువారీగా వచ్చిన దరఖాస్తుల వివరాలను, మెరిట్ ప్రకారం విద్యార్థుల జాబితాలను ప్రవేశాలు పూర్తయ్యేవరకు కళాశాల వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలి. ఆ జాబితాను డైట్‌సెట్ కన్వీనర్‌కు అందజేయాలి. అనంతరం ప్రవేశాలు చేపట్టాలి. సీటు కేటాయించాక 7 రోజులలోగా విద్యార్థి చేరకపోతే ఆ తరువాత మెరిట్‌లో ఉన్న విద్యార్థికి ప్రవేశం కల్పించాలి. కన్వీనర్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియ ముగిశాక మేనేజ్‌మెంట్ కోటా సీట్లను భర్తీ చేయడానికి వీలులేదు. ఆలోగానే, అర్హులైన వారినే చేర్చుకోవాలి. ఈ నిబంధనలు పాటించకపోతే యాజమాన్యంపై చర్యలు తప్పవు. అనర్హులను చేర్చుకుంటే వారిని పరీక్షలకు అనుమతించరు.
11 నుంచి డీఎడ్ కౌన్సెలింగ్..
డీఎడ్ కోర్సుల్లో కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి 11వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. 11నుంచి 14వ తేదీ వరకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. 19న అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు. 23 నుంచి 26 వరకు ప్రవేశాలకు గడువు.. 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. మిగిలిపోయిన, విద్యార్థులు చేరని సీట్ల భర్తీకి డిసెంబరు 2 నుంచి 19వ తేదీ వరకు రెండో దశ కౌన్సెలింగ్‌ను, డిసెంబరు 27 నుంచి 30వ తేదీ వరకు చివరి దశ కౌన్సెలింగ్‌ను నిర్వహిస్తారు.
డీఎడ్ భర్తీ వివరాలన్నీ వెబ్‌సైట్లలో..
Published Fri, Nov 8 2013 2:13 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement