సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో ప్రవేశాలకు నవంబరు రెండో వారంలో కౌన్సెలింగ్ నిర్వహించేందుకు విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. ప్రస్తుతం 630 వరకున్న డీఎడ్ కాలేజీల రెన్యువల్స్ పూర్తి కావచ్చింది. దీంతో నవంబరు నాలుగో తేదీ నాటికి అనుమతులు లభించిన కాలేజీలు అన్నింటిలో నవంబర్ 11నుంచి కౌన్సెలింగ్ చేపట్టేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. దీనిపై ప్రాథమిక విద్యా ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య మంగళవారం విద్యాశాఖ అధికారులతో చర్చించి, కౌన్సెలింగ్ నిర్వహణకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో డైట్‌సెట్-2013లో అర్హత సాధించి డీఎడ్‌లో ప్రవేశాల కోసం మూడు నెలలుగా ఎదురుచూస్తున్న 2.71 లక్షల మంది అభ్యర్థులకు ఎట్టకేలకు ఊరట లభించనుంది. సాధారణ కాలేజీలు, మైనారిటీ కాలేజీల్లోనూ ఒకేసారి కౌన్సెలింగ్ నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది.
‘మెరిట్’కే మేనేజ్‌మెంట్ కోటా: మేనేజ్‌మెంట్ కోటా సీట్లను మెరిట్ అభ్యర్థులకే కేటాయించేలా విద్యాశాఖ చర్యలు చేపడుతోంది. మేనేజ్‌మెంట్ కోటా సీట్ల భర్తీకి యాజమాన్యాలు నోటిఫికేషన్ జారీ చేసి ప్రవేశాలు చేపట్టాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని ఇష్టమొచ్చిన వారిని 20 శాతం మేనేజ్‌మెంట్ కోటా సీట్లల్లో చేర్చుకున్న పలు యాజమాన్యాలు ఇకపై అలా చేయడం కుదరదు. కచ్చితంగా మెరిట్ విధానాన్ని పాటించాల్సిందే. ప్రతి కళాశాల తమ వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫారాన్ని తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలి.
వ్యక్తిగతంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. దరఖాస్తులను నిరాకరించడానికి, మెరిట్ అభ్యర్థులకు సీటును నిరాకరించడానికి వీల్లేదు. తమ కాలేజీలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న, సీట్లు కేటాయించిన వారి వివరాలు తమ కళాశాల వెబ్‌సైట్‌లో పొందుపరచాలి. తద్వారా యాజ మాన్య కోటా సీట్ల భర్తీలో మరింత పారదర్శకత పెంచాలని విద్యాశాఖ భావిస్తోంది. ఈ నిబంధనలను పాటించని కాలేజీలపై విద్యా చట్టం ప్రకారం చర్యలు చేపట్టనుంది. అవసరమైతే ఆయా కాలేజీల గుర్తింపును రద్దు చేయాలని జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలికి సిఫారసు చే యనుంది. మరోవైపు యాజమాన్యాలకు ఐదు నుంచి పదేళ్లకు ఒకసారి రెన్యువల్ తీసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఉన్నతాధికారులు కాలేజీ రెన్యువల్ గడువును పదేళ్లకోసారి చేయాలని భావిస్తున్నారు. దీనిపై ఒకటీ రెండు రోజుల్లో తుది నిర్ణయం వెలువడనుంది.
డీఎడ్ ప్రవేశాల షెడ్యూల్
వెబ్ ఆప్షన్లు: నవంబర్ 11నుంచి 14వ తేదీ వరకు
సీట్ల కేటాయింపు: 19వ తేదీ
సర్టిఫికెట్ల వెరిఫికేషన్: 23-26వ తేదీ వరకు
తరగతుల ప్రారంభం: 27వ తేదీ
డీఎడ్ లో ప్రవేశాలకు 11 నుంచి కౌన్సిలింగ్
Published Wed, Oct 30 2013 2:53 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement