డీఈడీ కిలాడీ కాలేజీలు! | DEd Colleges quit Quality standards in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

డీఈడీ కిలాడీ కాలేజీలు!

Published Mon, Dec 2 2013 3:10 AM | Last Updated on Sat, Sep 2 2017 1:10 AM

డీఈడీ కిలాడీ కాలేజీలు!

డీఈడీ కిలాడీ కాలేజీలు!

  • మౌలిక సదుపాయాల్లేవు.. బోధన సిబ్బంది లేరు
  •      స్కూళ్లు, కాలేజీల్లోనే కోర్సు నిర్వహణ
  •      అదే సిబ్బందితో డీఈడీ విద్యా బోధన
  •      నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు
  •      ఫీజు రీయింబర్స్‌మెంట్ రాదంటూ వసూళ్లు
  • సాక్షి, హైదరాబాద్: టీచర్ పోస్టులపై ఆశతో డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(డీఎడ్)లో చేరుతున్న వారిని ప్రైవేట్ కాలేజీలు నిలువు దోపిడీ చేస్తున్నాయి! యాజమాన్య కోటా సీటును లక్షన్నర వరకు అమ్ముకుంటున్న యాజమాన్యాలు కాలేజీల నిర్వహణలోనూ అడ్డదారులు  తొక్కుతున్నాయి.  మౌలిక సదుపాయాలు, సిబ్బంది లేకుండానే కాలేజీలను నిర్వహిస్తున్నాయి.
     
    సిబ్బంది ఉండరు.. విద్యార్థులు రారు!
    రాష్ట్రంలోని 50 శాతం డీఎడ్ కాలేజీల్లో ల్యాబ్ సదుపాయాలు లేవు. పక్కా భవనాలు లేవు. రేకుల షెడ్‌లు, స్కూళ్లు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, ఇంజనీరింగ్, బీఎడ్ కాలేజీల్లోని రెండు గదుల్లో రెండేళ్ల డీఎడ్ కోర్సును నెట్టుకొస్తున్నాయి. మెరుగైన విద్యా బోధన, నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిచ్చాయి. కొన్ని కాలేజీల్లోనైతే అసలు బోధనా సిబ్బందే కనిపించడం లేదని.. మరికొన్ని కాలేజీల్లోనైతే విద్యార్థులు కూడా లేరని విద్యాశాఖ తనిఖీల్లోనే వెల్లడైంది. డీఎడ్ కాలేజీల అక్రమాలపై విద్యాశాఖకు ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 650 వరకున్న ప్రైవేటు డీఎడ్ కాలేజీల్లో దాదాపు 100కు పైగా కాలేజీలపై ఫిర్యాదులు అందాయి.  అక్రమ మార్గంలో నిర్వహిస్తున్న కాలేజీలు దాదాపు 250కి పైగా ఉన్నట్లు విద్యాశాఖ ఉన్నతాధికారులు అంచనా వేశారు.
     
    కన్వీనర్ కోటాలో సీటు వచ్చినా..
    కన్వీనర్ కోటాలో డీఎడ్ సీటు వచ్చినా విద్యార్థులను చేర్చుకునేందుకు యాజమాన్యాలు డబ్బులు వసూలు చేస్తున్నట్లు  ఫిర్యాదులు అందాయి. చిత్తూరు, ప్రకాశం, కర్నూలు, నల్లగొండ జిల్లాల్లోని కొన్ని కాలేజీల యాజమాన్యాలు ఒరిజినల్ సర్టిఫికెట్లు లేవని, ఫీజు రీయింబర్స్‌మెంట్ రాదంటూ విద్యార్థులను బెదిరించి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. మరికొన్ని కాలేజీలైతే మీరు రావాల్సిన పని లేదని  హాజరు మినహాయింపు ఇతర ఖర్చుల పేరుతో  ఒక్కో విద్యార్థి నుంచి కనీసం రూ. 10 వేలు వసూలు చేసినట్లు సమాచారం.
     
    ముడుపుల మాయ!
    ఓ కాలేజీకి రెన్యువల్ అవకాశం ఇవ్వాలంటే రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి(ఎస్‌సీఈఆర్‌టీ) నేతృత్వంలో ఆర్జేడీ, డీఈఓ, డైట్ ప్రిన్సిపాల్ నేతృత్వంలో తనిఖీలు జరపాలి. కానీ వాస్తవాలను పట్టించుకోకుండా సర్టిఫై చేస్తున్నట్లు విమర్శలున్నాయి. ఏటా తనిఖీల తతంగంలో భారీ మొత్తంలో ముడుపులు ముడుతున్నట్లు ఆరోపణలున్నాయి.
     
     కాలేజీల అక్రమాలకు మరికొన్ని ఉదాహరణలు..

    •      గుంటూరు జిల్లా నరసరావుపేటలో ఒకే క్యాంపస్‌లో ఏడు కాలేజీలున్నాయి. అన్నింటికీ ఒకటే అడ్రస్. బీఎడ్, బీఫార్మసీ, ఎం.ఫార్మసీ, ఫార్మా-డీ, డీఎంఎల్‌టీ, ఐటీఐతోపాటు డీఎడ్‌ను నిర్వహిస్తున్నారు.  
    •      ప్రకాశం, చిత్తూరు, కర్నూలు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. కొన్నిచోట్ల స్కూళ్లలో, మరికొన్ని చోట్ల కాలేజీల్లో, ఇంకొన్ని చోట్ల ఇంజనీరింగ్ కళాశాలల్లో డీఎడ్ కాలేజీలు ఉన్నాయి. ఆ క్యాంపస్‌లోని అన్ని కాలేజీలకు సిబ్బంది అంతా ఒకరే.
    •      కాలేజీలకు అనుమతులు, రెన్యువల్స్ దరఖాస్తు చేసుకున్నపుడు సిబ్బంది పేర్లు కాగితాలపై చూపిస్తున్నారు.  తనిఖీలు చేస్తే సిబ్బంది ఒకరిద్దరే ఉంటున్నారు.
    •      నిబంధనల ప్రకారం ప్రిన్సిపాల్‌తో కలిపి 8 మంది బోధనా సిబ్బంది ఉండాలి. సొంత వెబ్‌సైట్ ఉండాలి.  కళాశాల భవనం, సిబ్బంది, విద్యార్థుల వివరాలను చూపాలి. 70 శాతం కాలేజీలకు వెబ్‌సైటే లేదు.  
    •      కొన్ని కాలేజీలు స్థలాలు, భవనాలకు సంబంధించి ఫోర్జరీ డాక్యుమెంట్లు అందజేసిన ట్లు సమాచారం. కొన్ని  చోట్ల కాలేజీలే లేవు. వాటిని ఎక్కడ నిర్వహిస్తున్నారో అంతుబట్టదు.
    •      స్కూళ్లు, కాలేజీల్లో నిర్వహిస్తున్న డీఎడ్ కోర్సుకు ఆయా కాలేజీల్లోని సిబ్బందినే బోధకులుగా చూపుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement