డీఎడ్ సీటు రూ.2 లక్షల పైమాటే | In colleges DIETCET fees chargeing rupes 2 lakhs | Sakshi
Sakshi News home page

డీఎడ్ సీటు రూ.2 లక్షల పైమాటే

Published Mon, Nov 25 2013 3:34 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM

In colleges DIETCET fees chargeing rupes 2 lakhs

సాక్షి, అనంతపురం : డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) కళాశాలలు అడ్డగోలు వ్యాపారానికి తెర తీశాయి. యాజమాన్య కోటా సీట్లను మార్కెట్ సరుకులా అమ్ముకుంటున్నాయి. సీటు కావాలంటే రూ.2 లక్షలకు పైగా చెల్లించాల్సిందేనని తెగేసి చెబుతున్నాయి. ప్రస్తుతం జిల్లాలో ప్రభుత్వ డైట్ కళాశాల(బుక్కపట్నం), 35  ప్రైవేటు డీఎడ్ కళాశాలలు ఉన్నాయి. బుక్కపట్నం డైట్‌లో 100, మరో ప్రైవేటు కళాశాలలో 100 సీట్లు చొప్పున ఉన్నాయి. మిగిలిన 34 ప్రైవేటు కళాశాలల్లో 50 చొప్పున సీట్లు ఉన్నాయి.

 అన్ని కళాశాలల్లో కలిపి మొత్తం 1,900  సీట్లు ఉన్నాయి. బుక్కపట్నం డైట్‌లో యాజమాన్య కోటా ఉండదు. మొత్తం వంద సీట్లను కన్వీనర్ కోటా ద్వారానే భర్తీ చేస్తారు. ఇక 35 ప్రైవేటు కళాశాలల్లోని 1,800 సీట్లలో 80 శాతం అంటే  1,440 సీటు ్ల కన్వీనర్ కోటా కింద , మిగిలిన  360 సీట్లు (20 శాతం) యాజమాన్య కోటా కింద భర్తీ చేస్తారు. ఈ ఏడాది జిల్లాలో దాదాపు 30 వేల మంది విద్యార్థులు డైట్ సెట్ రాశారు. 20 వేల మంది వరకు అర్హత సాధించారు. కన్వీనర్ కోటా సీట్లు తక్కువగా ఉండడంతో ప్రైవేటు కళాశాలల్లో యాజమాన్య కోటా సీట్లకు డిమాండ్ పెరిగిపోయింది.
 
 కన్వీనర్ కోటాలో సీటు తెచ్చుకునే విద్యార్థి ఏడాదికి రూ.12,500 ఫీజు మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. ఈ సీట్ల భర్తీ వల్ల యాజమాన్యాలు పెద్దగా లాభపడేది ఉండదు. మూడు రోజులుగా డైట్ సెట్ కౌన్సెలింగ్ జరుగుతోంది. కన్వీనర్ కోటాలో 1,540 సీట్లు (బుక్కపట్నం డైట్‌లోని వంద సీట్లు కలుపుకుని) ఉండగా... ఇప్పటిదాకా 600 భర్తీ అయ్యాయి. ఇంకా 940 మాత్రమే మిగిలివున్నాయి. వీటి కోసం దాదాపు ఐదు వేల మంది విద్యార్థులు వేచి చూస్తున్నారు. కన్వీనర్ కోటాలో సీటు వచ్చే పరిస్థితి లేదని భావిస్తున్న విద్యార్థులు యాజమాన్య కోటాలో చేరేందుకు ప్రైవేటు కళాశాలలను ఆశ్రయిస్తున్నారు.
 
 ఇదే అదునుగా యాజమాన్యాలు సీటు ఖరీదు అమాంతం పెంచేశాయి. రూ.2 లక్షల పైమాట అయితేనే మాట్లాడాలని విద్యార్థులకు తెగేసి చెబుతున్నాయి. కొన్ని కళాశాలల్లో ‘పాస్ గ్యారంటీ’ అనే అంశాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం అందినకాడికి అప్పులు చేసి పిల్లలను డీఎడ్‌లో చేర్పిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను పాటించని కళాశాలలను అనర్హత జాబితాలో చేరుస్తామని ఉన్నతాధికారులు ప్రకటిస్తున్నారే తప్పా... వాస్తవానికి ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదు.
 
 ఎందుకింత డిమాండ్?
 విద్యాహక్కు చట్టం ప్రకారం  సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు డీఎడ్ అభ్యర్థులు మాత్రమే అర్హులు. అన్ని జిల్లాల్లోనూ ఉన్నత పాఠశాలలకంటే ప్రాథమిక పాఠశాలల సంఖ్య ఎక్కువగా ఉంది. దీంతో ప్రతి డీఎస్సీలోనూ ఎస్జీటీ పోస్టులను ఎక్కువగా భర్తీ చేస్తున్నారు.  ఈ క్రమంలో బీఈడీ చదివిన వారికంటే డీఎడ్ అభ్యర్థులకే ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి.

దీంతో ఇంటర్మీడియట్ పూర్తయిన వారు రెండేళ్ల కాలపరిమితి గల డీఎడ్ కోర్సులో చేయడానికి మొగ్గుచూపుతున్నారు. గతంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఉపాధ్యాయ శిక్షణ సంస్థలు (డైట్‌లు) జిల్లాకు ఒకటి మాత్రమే ఉండేవి.  అయితే, గతేడాది డీఎడ్ కళాశాలల నిర్వహణకు సంబంధించిన నిబంధనలను రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ) సరళతరం చేసింది. దీంతో ప్రైవేటు యాజమాన్యాల కింద పలు కళాశాలలు పుట్టుకొచ్చాయి. ఇందులో ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రమూ పాటించడం లేదు. సంబంధిత అధికారులను ‘మేనేజ్’ చేస్తూ విద్యా వ్యాపారాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement