రెండేళ్ల కాల వ్యవధి గల డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కోర్సును కేంద్ర ప్రభుత్వం సిఫార్సు మేరకు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఈ)గా పేరు మార్చి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నేపథ్యంలో పరీక్ష వివరాలు, అందులో విజయ సాధనకు ఉపయోగపడే ప్రిపరేషన్ వ్యూహాలైపై స్పెషల్ ఫోకస్..
ప్రభుత్వ డైట్‌లు, ప్రైవేటు ఎలిమెంటరీ టీచర్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సులో ప్రవేశానికి డీఈఈ సెట్-2014 నిర్వహిస్తారు. ప్రస్తుతం సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్‌జీటీ) ఉద్యోగాలను డీఈఈ అభ్యర్థులతోనే భర్తీ చేస్తుండటంతో ఈ కోర్సుకు డిమాండ్ ఏర్పడింది. ఈ ఏడాది డీసెట్‌కు తీవ్ర పోటీ నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇందులో మంచి ర్యాంకు లభిస్తే ప్రభుత్వ కళాశాలలో సీటును చేజిక్కించుకోవచ్చు.
అర్హతలు:
ఇంటర్మీడియెట్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులు డీసెట్ రాసేందుకు అర్హులు. ఇంటర్‌లో ఓసీ, బీసీ అభ్యర్థులు 45శాతం మార్కులు; ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ చాలెంజ్డ్ అభ్యర్థులు 40 శాతం మార్కులు సాధించి ఉండాలి. ఇం టర్‌లో వృత్తి విద్యా కోర్సులు చదివిన వారు అనర్హులు.
వయసు: 2014, సెప్టెంబర్ 1 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి.
పరీక్ష విధానం:
డీసెట్ పరీక్ష ప్రశ్నపత్రం మూడు భాగాలుగా ఉంటుంది. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 100 మార్కులకు పేపర్ ఉంటుంది. సమయం రెండు గంటలు. 8, 9, 10 తరగతుల సబ్జెక్టుల ఆధారంగా ప్రశ్నపత్రాన్ని రూపొందిస్తారు. ఈసారి పాత సిలబస్ ప్రకారమే ప్రశ్నపత్రం ఉంటుంది.
సబ్జెక్ట్ {పశ్నలు మార్కులు
పార్ట్-1
జనరల్ నాలెడ్జ్ 5 5
టీచింగ్ ఆప్టిట్యూడ్ 5 5
పార్ట్-2
తెలుగు 20 20
ఇంగ్లిష్ 10 10
పార్ట్-3
మ్యాథమెటిక్స్ 20 20
ఫిజికల్, బయలాజికల్ సైన్స్ 20 20
సోషల్ 20 20
మొత్తం 100 100
ముఖ్య తేదీలు:
దరఖాస్తు ఫీజు చెల్లింపు: మే 5, 2014- మే 17, 2014.
ఆన్‌లైన్ దరఖాస్తుకు ప్రారంభ తేదీ: మే 6, 2014.
దరఖాస్తుకు చివరి తేదీ: మే 18, 2014.
హాల్‌టికెట్ల్ డౌన్‌లోడ్ ప్రారంభం: జూన్ 5, 2014.
పరీక్ష తేదీ: జూన్ 15, 2014.
పరీక్ష ఫలితాలు: జూన్ 25, 2014.
ఏపీ ఆన్‌లైన్ లేదా ఈసేవ కేంద్రాల్లో రుసుము చెల్లించవచ్చు.
మోడల్ టెస్ట్‌లతో మంచి ఫలితం
డీసెట్ కోసం ఎనిమిది నుంచి పదో తరగతి వరకు ఉన్న రాష్ట్ర ప్రభుత్వ పాఠ్యపుస్తకాలు బాగా చదివాను. కోచింగ్ సెంటర్‌లో ప్రతిరోజూ ఒక గ్రాండ్ టెస్టును సాధన చేసేవాడిని. ప్రతివారం మోడల్ టెస్టులు కూడా ప్రాక్టీస్ చేయడం వల్ల తప్పులను సరిదిద్దుకోవడం తేలికైంది. దీనివల్ల టాప్ ర్యాంకు సాధించగలిగాను. ఉదయం ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు, సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి 10.30 వరకు చదివేవాడిని. జీకే కోసం దినపత్రికలు ఉపయోగపడ్డాయి.
- గుంటుకు శ్రీనివాసరావు,
డైట్‌సెట్-2013
స్టేట్ ఫస్ట్ ర్యాంకర్.
ప్రిపరేషన్ ప్రణాళిక
తెలుగు
ప్రభుత్వ పాఠ్యపుస్తకాల్లోని వ్యాకరణం, సంధులు, సమాసాలు, వ్యాకరణ పరిభాష, ఛందస్సు, అలంకారాలు, అర్థాలు, క్రియలు, వ్యుత్పత్త్యార్థాలు, జాతీయాలపై దృష్టిసారించాలి. వీటి నుంచి 2013 డైట్‌సెట్ ప్రశ్నపత్రంలో ఒక్కో అంశం నుంచి రెండు చొప్పున ప్రశ్నలు వచ్చాయి.
ఉదా: ‘ఆలోచనాలోచనలు’ గ్రంథాన్ని రచించిన వారెవరు? (దాశరథి).
ఉదా: మిళిందం అనగా? (తుమ్మెద).
ఇంగ్లిష్
ఈ విభాగంలో వ్యాకరణానికి సంబంధించి 10 ప్రశ్నలు వస్తాయి. గత డైట్ సెట్‌లో Tenses, Question Tag, Voice, Articles, Parts of Speech, Simple Complex Compound విభాగాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి.
Ex: Janardhan is very generous in helping the poor (The underlined word means)
a) careful b) kind
c) miserly d) cruel
Ans: b
Be prepared............. the worst
a) of b) in c) for d) on
Ans: c
మ్యాథమెటిక్స్
ఘాతాంకాలు, ఘాత సమీకరణాలు, బహుపదులు, ద్విపద సిద్ధాంతం, సమితులు, శ్రేఢులు, మాత్రికలు, క్షేత్ర గణితం, రేఖాగణితం, వైశ్లేషిక రేఖా గణితం, త్రికోణమితి అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. అకరణీయ సంఖ్యలు, కరణులు, రేఖీయ అసమీకరణాలు, త్రిమితీయ రూపాలు, వృత్తాలు, సాంఖ్యక శాస్త్రం తదితర అంశాలపైనా దృష్టిపెట్టాలి. పదో తరగతి అంశాలపై శ్రద్ధకనబరచాలి. చిట్కా (షార్ట్‌కట్)ల ద్వారా ప్రాక్టీస్ చేస్తే తేలిగ్గా సమాధానాలు గుర్తించవచ్చు.
ఉదా:
ఒక తలంలోని రేఖకు సమాన దూరంలో ఉన్న అదే తలానికి చెందిన బిందు పథం?
ఎ) సరళరేఖ బి) రెండు సమాంతర రేఖలు
సి) రెండు ఖండన రేఖలు డి) వృత్తం
సమాధానం: బి
సైన్స్
ఈ విభాగంలో భౌతిక, రసాయన శాస్త్రాల నుంచి పది ప్రశ్నలు, బయాలజీ నుంచి 10 ప్రశ్నలు వస్తాయి. ఉష్ణం, కాంతి, అయస్కాంతత్వం, ఆధునిక భౌతిక శాస్త్రం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. శుద్ధ గతిక శాస్త్రం, కొలతలు, ధ్వని, ఎలక్ట్రానిక్స్, తరంగ చలనాలు, విద్యుదయస్కాంత వర్ణపటం వంటి అంశాలపైనా దృష్టిసారించాలి.రసాయన శాస్త్రంలో సంకేతాలు, నైట్రోజన్ దాని సమ్మేళనాలు, రసాయన చర్యల వేగాలు, సమతా స్థితి, మూలకాల వర్గీకరణ, ద్రావణాలు వంటి వాటిపై ఎక్కువ దృష్టిసారించాలి. రసాయన సమీకరణాలు, రసాయన బంధం, రసాయన సంయోగ నియమాలు, ఆమ్లాలు-క్షారాలు, నూనెలు- కొవ్వులు మొదలైన అంశాల నుంచి కూడా ప్రశ్నలు వస్తాయి. బయాలజీకి సంబంధించి 9, 10 తరగతులలోని జీవన విధానాలు, పదో తరగతిలోని ప్రత్యుత్పత్తి, పోషణ అంశాలను క్షుణ్నంగా చదివితే ఈ విభాగంలో 80 శాతం మార్కులు స్కోర్ చేయొచ్చు. ఇవి కాకుండా 9వ తరగతిలోని శక్తిమయ ప్రపంచం, సహజ వనరులు; 8వ తరగతిలోని విజ్ఞాన శాస్త్ర చరిత్ర, పరిధి; పదో తరగతిలోని నియంత్రణ- సమన్వయం, హెచ్‌ఐవీ-ఎయిడ్స్ వంటి అంశాలపైనా దృష్టిసారించాలి.
ఉదా:
గాయిటర్ వ్యాధి దేని లోపం వల్ల వస్తుంది?
ఎ) అయోడిన్ బి) ఐరన్
సి) ప్రోటీన్‌లు డి) విటమిన్లు
సమాధానం: ఎ
ద్వికుంభాకర కటక ప్రయోగంలో మిధ్యా ప్రతిబింబం నిటారుగా పడాలంటే కటకాన్ని ఎలా ఉంచాలి?
ఎ) అనంత దూరంలో బి) ఊ2, కటకం మధ్య
సి) ఇ2 కంటే దూరం డి) ఇ2, ఊ2ల మధ్య
సమాధానం: ఎ
ఏ2+ఐ2 2ఏఐ చర్యలో సమతాస్థితి వద్ద పీడనాన్ని పెంచితే ఏమవుతుంది?
ఎ) పెరుగుతుంది బి) మార్పుండదు
సి) తగ్గును డి) ఏదీకాదు
సమాధానం: బి
సోషల్
ఈ విభాగంలో భూగోళశాస్త్రం, చరిత్ర, అర్థ శాస్త్రం, పౌరశాస్త్రం నుంచి 5 ప్రశ్నలు చొప్పున మొత్తం 20 ప్రశ్నలు వస్తాయి. భూగోళ శాస్త్రంలో అక్షాంశాలు- రేఖాంశాలు, ఆంధ్రప్రదేశ్ భూగోళ శాస్త్రం, ప్రకృతి సిద్ధ మండలాలు, భారతదేశ భూగోళ శాస్త్రం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. చరిత్రలో ప్రాచీన నాగరికతలు, ప్రాచీన ప్రపంచ విప్లవాలు, ఆధునిక ప్రపంచం, భారతదేశ స్వాతంత్య్ర ఉద్యమం వంటి అంశాలను ఎక్కువగా చదవాలి. పౌరశాస్త్రంలో భారత రాజ్యాంగం; కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక స్వపరిపాలన, ఐక్యరాజ్య సమితి, రవాణా విద్య నుంచి ప్రశ్నలు వస్తాయి. ఆర్థిక శాస్త్రం నుంచి స్థూల అర్థ శాస్త్రం, ద్రవ్యం, బ్యాంకింగ్, డిమాండ్, భారత ఆర్థిక శాస్త్రం ప్రణాళికల నుంచి అధిక ప్రశ్నలు వస్తాయి.
ఉదా:
బంగ్లాదేశ్‌లో గంగానదిని ఏమని పిలుస్తారు?
ఎ) అలకనంద బి) పద్మా
సి) యమున డి) మేఘన
సమాధానం: బి
రాజ్యసభకు రాష్ట్రపతి నామినేట్ చేసే సభ్యుల సంఖ్య? (12).
లారెంజ్ వక్రరేఖ దేన్ని సూచిస్తుంది?
(ఆదాయ అసమానత్వం).
‘సాధించు లేదా గతించు’ నినాదం ఎవరిది?
(గాంధీజీ).
టీచింగ్ ఆప్టిట్యూడ్
కాబోయే టీచర్‌గా సమాజ స్థితిగతులపై ఉండాల్సిన అవగాహన స్థాయిని, విద్యార్థిలోని బోధన సామర్థ్యాన్ని పరీక్షించేలా ప్రశ్నలు ఉంటాయి. టీచింగ్ ఆప్టిట్యూడ్ విభాగంలో ఉపాధ్యాయ వృత్తి, తరగతి గది నిర్వహణ, నూతన విద్యా విధానం, పాఠశాల వాతావరణం, బోధన సామర్థ్యం తదితరాలకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. విద్యార్థి తనను తాను ఉత్తమ ఉపాధ్యాయుడిగా భావించి, తార్కికంగా ఆలోచిస్తే ఈ విభాగంలో ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించవచ్చు.
ఉదా: బోధన అనగా?
ఎ) విద్యార్థులకు జ్ఞానాన్ని అందించడం
బి) విద్యార్థులలో ప్రవర్తనా మార్పులు తీసుకురావడం
సి) తరగతి గదిలో ఉపన్యసించడం
డి) విద్యార్థులలో విద్యా విషయక ప్రతిభను ప్రోత్సహించడం
సమాధానం: బి
జనరల్ నాలెడ్జ్
ఈ విభాగంలో కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ఆర్థిక, రాజకీయ, క్రీడలు, అవార్డుల నుంచి ప్రశ్నలొస్తాయి. స్టాక్ జీకే నుంచి ప్రామాణిక ప్రశ్నలు వస్తాయి.
ఉదా: ఒలింపిక్ క్రీడలను ప్రారంభించింది ఎవరు?
(గ్రీకులు).
భారత దేశ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరు? (జస్టిస్ ఆర్.ఎం.లోధా).
డీసెట్‌లో విజయానికి మార్గాలు..
Published Thu, May 8 2014 12:04 AM | Last Updated on Sat, Sep 2 2017 7:03 AM
Advertisement
Advertisement