టెట్‌కు పెరిగిన దరఖాస్తులు | Increased applications to tet | Sakshi
Sakshi News home page

టెట్‌కు పెరిగిన దరఖాస్తులు

Published Thu, Jul 6 2017 1:49 AM | Last Updated on Tue, Sep 5 2017 3:17 PM

Increased applications to tet

- గతేడాది కంటే 12 వేల దరఖాస్తులు అధికం
ఈ నెల 23న ఉపాధ్యాయ అర్హత పరీక్ష
17 నుంచి హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌కు అవకాశం
 
సాక్షి, హైదరాబాద్‌: ఈ నెల 23న నిర్వహించనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్షకు (టెట్‌) భారీగా దరఖాస్తులు వచ్చాయి. గతేడాది మే 22న నిర్వహించిన టెట్‌కు 3,40,567 మంది అభ్యర్థులు హాజరు కాగా, ఈనెల 23న జరిగే టెట్‌కు హాజరయ్యేందుకు రాష్ట్రవ్యాప్తంగా 3,52,816 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది కంటే ఈసారి దాదాపు 12 వేల మంది అధికంగా దరఖాస్తు చేసుకున్నారు. అందులో పేపర్‌–1 పరీక్ష రాసేందుకు 96,551 మంది దరఖాస్తు చేసుకోగా, పేపర్‌–2 పరీక్ష రాసేందుకు 2,41,169 మంది దరఖాస్తు చేసుకున్నారు. రెండు పేపర్లూ రాసేందుకు 15,096 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

వారు ఈనెల 17 నుంచి వెబ్‌సైట్‌ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు చర్యలు చేపట్టారు. ఈనెల 23న పేపర్‌–1 ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 వరకు, పేపర్‌–2 మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 వరకు నిర్వహించేందుకు టెట్‌ కన్వీనర్‌ బి.శేషుకుమారి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పరీక్ష కేంద్రాల ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లోనూ టెట్‌ పరీక్షలను నిర్వహణకు అవసరమైన పరీక్ష కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. వచ్చే నెల 5న టెట్‌ ఫలితాలు విడుదల చేయనున్నారు.
 
రంగారెడ్డిలో అత్యధికం
టెట్‌కు రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా అభ్యర్థులు హాజరు కానున్నారు. రంగారెడ్డి జిల్లా పరిధిలో ఏర్పాటు చేసే పరీక్ష కేంద్రాల్లో 60,452 మంది హాజరయ్యే అవకాశముంది.  ఖమ్మం జిల్లాలోని కేంద్రాల్లో 30,741 మంది హాజరుకానున్నారు. అతి తక్కువగా 1,488 మంది యాదాద్రిలో హాజరు కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement