పేపర్–2లో ఢమాల్!
టెట్ ఫలితాలు విడుదల
► పేపర్–1లో మాత్రం స్వల్పంగా పెరిగిన అర్హులు
► విత్‌హెల్డ్‌లో 1,632 మంది ఫలితాలు
► పేపర్–1లో టాప్ రాజన్న సిరిసిల్ల జిల్లా..
► పేపర్–2లో మంచిర్యాల టాప్
► ‘విత్‌హెల్డ్’వారి ఫలితాలనూ పరిశీలిస్తామన్న పాఠశాల విద్యా కమిషనర్
► వారు తగిన కారణాలు చూపుతూ దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడి
సాక్షి, హైదరాబాద్
ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు వెల్లడయ్యాయి. పాఠశాల విద్యా డైరెక్టరేట్‌లో శుక్రవారం పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ ఈ ఫలితాలను విడుదల చేశారు. టెట్ పేపర్–1లో గత టెట్ కంటే అర్హుల శాతం పెరగగా... పేపర్–2లో అర్హుల శాతం బాగా తగ్గిపోయింది. పేపర్–1లో గతేడాది 54.45 శాతం మంది అర్హత సాధించగా.. ఈసారి 57.37 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. పేపర్–2లో గతేడాది 25.04 శాతం మంది ఉత్తీర్ణులవగా.. ఈసారి 19.51 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. పేపర్–1లో అత్యధికంగా 74.27 అర్హుల శాతంతో రాజన్న సిరిసిల్ల జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. 48.40 శాతం మందితో రంగారెడ్డి జిల్లా చివరి స్థానంలో ఉంది. పేపర్–2లో 24.02 శాతం అర్హులతో మంచిర్యాల జిల్లా తొలిస్థానంలో పొందగా.. 16.80 శాతంతో సిద్దిపేట జిల్లా చివరి స్థానంలో ఉంది. ఇక పేపర్–1, పేపర్–2లలో 150 గరిష్ట మార్కులకు గాను పలువురు అభ్యర్థులు అత్యధికంగా 136 వరకు కూడా సాధించినట్లు తెలిసింది.
వెయిటేజీ నేపథ్యంలో..
ఉపాధ్యాయ నియామక పరీక్షల్లో టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఉండటంతో.. మార్కులు పెంచుకునేందుకు పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. 150 మార్కులకు నిర్వహించిన ఈ పరీక్షల్లో జనరల్ అభ్యర్థులు కనీసంగా 60 శాతం మార్కులు, బీసీలు 50 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు 40 శాతం మార్కులు సాధిస్తేనే అర్హత సాధించినట్లుగా పరిగణనలోకి తీసుకుంటారు. అయితే వరుసగా టెట్‌లలో పేపర్–1లో అర్హుల సంఖ్య దాదాపుగా పెరుగుతుండగా.. పేపర్–2లో మాత్రం తగ్గిపోతూ వస్తోంది. ఈసారి అత్యంత తక్కువగా కేవలం 19.51 శాతం ఉత్తీర్ణత మాత్రమే నమోదైంది. పరీక్షలో ఇంటర్మీడియట్ స్థాయి సిలబస్‌తో కూడిన ప్రశ్నలు ఇవ్వడంతో అర్హత శాతం తగ్గినట్లు చెబుతున్నారు.
పేపర్–1లో పెరిగిన ఉత్తీర్ణత
డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) అభ్యర్థులకు సంబంధించిన పేపర్–1 పరీక్షకు 1,11,647 మంది దరఖాస్తు చేసుకోగా.. 98,848 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 56,708 మంది (57.37 శాతం) అర్హత సాధించారు.
పేపర్–2లో తగ్గిన అర్హులు
బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), పండిట్ కోర్సులు చేసిన అభ్యర్థులకు నిర్వహించిన పేపర్–2కు 2,56,265 మంది దరఖాస్తు చేసుకోగా... 2,30,932 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 45,055 మంది (19.51శాతం) మాత్రమే అర్హత సాధించారు. ఇందులో గణితం–సైన్స్ విభాగంలో 1,11,018 మంది పరీక్ష రాయగా.. 20,323 మంది (18.31 శాతం) అర్హత సాధించారు. సాంఘిక శాస్త్రం విభాగంలో 1,19,914 మంది పరీక్ష రాయగా.. 24,732 మంది (20.62 శాతం) అర్హత సా«ధించారు.
విత్ హెల్డ్‌పై పరిశీలనకు కమిటీ
టెట్ ఓఎంఆర్ జవాబు పత్రంలో అభ్యర్థి వివరాలను పొందుపర్చకపోవడం, తప్పుడు వివరాలు ఇవ్వడం, డబుల్ బబ్లింగ్ చేయడం వంటి తప్పిదాలకు పాల్పడిన 1,632 మంది అభ్యర్థుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టినట్లు పాఠశాల విద్యా కమిషనర్ కిషన్ వెల్లడించారు. అవి ఎవరికి సంబంధించిన జవాబు పత్రాలన్నది గుర్తించడం కష్టమని.. అయితే ఏదైనా ప్రత్యేక కారణంతో అభ్యర్థులెవరైనా దరఖాస్తు చేసుకుంటే పరిశీలన జరుపుతామని తెలిపారు. ఇందుకోసం కమిటీని ఏర్పాటు చేశామన్నారు.