తన సర్టిఫికెట్‌ను తగులబెడుతున్న లింగస్వామి
సాక్షి, హైదరాబాద్: ఈయన పేరు లింగస్వామి.. ఎంఏ, ఎంఈడీ పూర్తి చేశాడు. టీచర్ పోస్టుల భర్తీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఎట్టకేలకు సర్కారు టీఆర్‌టీ నోటిఫికేషన్ ఇచ్చింది. దాన్ని చూసిన లింగస్వామికి నిరాశే ఎదురైంది. ఎందుకంటే నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం డిగ్రీలో 45 శాతం మార్కులు ఉన్న వారే దరఖాస్తుకు అర్హులు. మిగతా అన్ని కోర్సుల్లో మంచి మార్కులు సాధించినా డిగ్రీలో మాత్రం 45 శాతం మార్కులు లేవు. ఉద్యోగం వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఆ ఆవేదనతో ఏం చేయాలో తెలియక తన బీఈడీ సర్టిఫికెట్‌ను కాల్చేశాడు. తగలబెడుతున్న వీడియోను సామాజిక మాధ్యమంలో పెట్టాడు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరు గ్రామానికి చెందిన లింగస్వామిది నిరుపేద కుటుంబం. క్వారీలో పనిచేసుకుంటూ దూరవిద్యలో డిగ్రీ చదివాడు. 44 శాతం మార్కులతో పాసయ్యా డు. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఈడీ) పూర్తి చేశాడు. ఎంఏ ఎకనామిక్స్‌లో 70 శాతం కన్నా ఎక్కువ మార్కులతో పాసై, ఎంఈడీ కూడా పూర్తి చేశాడు. లక్షల రూపాయలు అప్పులు చేసి మరీ ఉపాధ్యాయ నియామకాల కోసం సన్నద్ధమయ్యాడు. తీరా నోటిఫికేషన్ చూసి తీవ్ర మనోవేదనకు గురవుతున్నాడు. ఇది ఒక్క లింగస్వామిదే కాదు.. రాష్ట్రంలో వేలాది మంది బీఈడీ అభ్యర్థుల ఆవేదన.
బీఈడీ సర్టిఫికెట్ అమ్మకం మరవకముందే..
బీఈడీ సర్టిఫికెట్‌ను ఫేస్‌బుక్‌లో అమ్మకానికి పెట్టిన అశోక్ సంఘటన మరవకముందే లింగస్వామి సర్టిఫికెట్‌ను కాల్చడం కలకలం రేపుతోంది. డిగ్రీలో మార్కులు తక్కువ ఉన్నాయన్న సాకుతో పరీక్షకు అనర్హులను చేయడం అన్యాయమని బీఈడీ అభ్యర్థులు వాపోతున్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) నిబంధనలకు వక్రభాష్యం చెప్పి అధికారులు తమను రోడ్డున పడేస్తున్నారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో లేదు..
ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో ఎన్‌సీటీఈ పేరుతో విద్యాశాఖ అధికారులు రూపొందించిన నిబంధనలపై అభ్యర్థులు మండిపడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2012 డీఎస్సీలో ఈ నిబంధనల్లేవు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌లో కూడా ఈ నిబంధనలు పెట్టలేదు. డిగ్రీ ఉత్తీర్ణులై ఉంటే చాలన్న నిబంధనలతో ఉపాధ్యాయ నియామకాలను చేపట్టింది. తెలంగాణలో మాత్రం ఎన్‌సీటీఈ నిబంధనల పేరుతో అభ్యర్థుల జీవితాలతో అధికారులు చెలగాటమాతున్నారని వాపోతున్నారు.
ప్రభుత్వం తలచుకుంటే..
8,792 పోస్టుల భర్తీకి జారీ చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొన్న నిబంధనలు వేల మంది బీఈడీ అభ్యర్థులను రోడ్డుపాలు చేస్తున్నాయి. డిగ్రీలో నిర్ణీత మార్కుల్లేవన్న సాకుతో టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులుగా మిగిలిపోతున్నారు. ఎన్‌సీటీఈ 2014లో బీఈడీ అభ్యర్థుల విషయంలో రెండు రకాల నిబంధనలను పొందుపరిచింది. అందులో జనరల్ అభ్యర్థులకు డిగ్రీలో 50 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 శాతం) ఉండాలన్న నిబంధన ఒకటైతే.. 2002, 2007 ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం డిగ్రీలో జనరల్ అభ్యర్థులకు 45 శాతం మార్కులు (ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 శాతం) ఉండాలని మరో నిబంధన పొందుపరిచింది. అలాగే డిగ్రీ అయినా లేదా పీజీ అయినా సరే వర్తిస్తుందని పేర్కొంది. కానీ డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాల్సిందేనని అధికారులు మొండిగా వ్యవహరిస్తున్నారని అభ్యర్థులు వాపోతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం తలచుకుంటే తమకు న్యాయం జరుగుతుందని పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఈ విషయంలో పునరాలోచించాలని కోరుతున్నారు. 2002, 2007 ఎ¯న్‌సీటీఈ నిబంధనలను పరిగణనలోకి తీసుకొని ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment