సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభుత్వం చేసిన ప్రకటన లక్షలాది మంది నిరుద్యోగులకు తీరని నిరాశ మిగిల్చింది. మరోవైపు పోస్టుల ఖాళీలపై సుప్రీం కోర్టు కళ్లకూ సర్కారు గంతలు కడుతోంది. రాష్ట్రంలో 9,259 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని ఈ ఏడాది జూలై నాటికి భర్తీ చేస్తామని ప్రభుత్వం ఇదివరకే సుప్రీంకోర్టుకు నివేదించింది. ఆ నివేదికలో ప్రభుత్వం పేర్కొన్న ఖాళీలన్నీ ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ పాఠశాలలకు సంబంధించినవి మాత్రమే. జూలై దాటిపోయి సెప్టెంబర్ వచ్చినా ఇప్పటివరకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆర్థిక శాఖ ద్వారా జారీ చేసిన జీవో 153లో టీచర్ పోస్టుల భర్తీకి ఇచ్చిన ఖాళీలు 9,275గా పేర్కొన్నారు. అయితే ఇందులో ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్ స్కూళ్లలోని ఖాళీల సంఖ్య కేవలం 5 వేలు మాత్రమే. సుప్రీంకోర్టుకు నివేదించిన వాటిలో 4,259 పోస్టులకు ప్రభుత్వం కోతపెట్టింది. మున్సిపల్ పోస్టులు 1,100, గిరిజన గురుకులాల్లో 750, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 500, ఆశ్రమ పాఠశాలాల్లో 300, బీసీ గురుకులాల్లో 350, ఏపీఆర్‌ఈఐ సొసైటీ పోస్టులు 175 కలిపి మొత్తం 9,275 పోస్టులు చూపించింది. సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలోని ఖాళీలను కాకుండా ఇతర శాఖల ఖాళీలను చూపించి మొత్తం అన్నీ భర్తీ చేస్తున్నట్లుగా సుప్రీంకోర్టు కళ్లకు సర్కారు గంతలు కడుతోంది.
కేంద్రానికిచ్చిన నివేదికలో 30 వేలకు పైగా ఖాళీలు
రాష్ట్రంలో సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) కింద విద్యాభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నిధుల కోసం ఇచ్చే నివేదికలో ఎస్‌ఎస్‌ఏ అధికారులు రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల ఖాళీల గురించి పొందుపరిచారు. అందులో జెడ్పీ, మండల పరిషత్ స్కూళ్లలో ప్రాథమిక పాఠశాలల్లో 11,576 పోస్టులు, యూపీ స్కూళ్లలో 2,040 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చూపించారు. ఇక హైస్కూళ్లలో 34.52 శాతం ఖాళీలున్నట్లు పేర్కొన్నారు. జెడ్పీల పరిధిలో హైస్కూళ్లు 4,641 ఉన్నాయి. ఇందులోని ఖాళీలనూ కలుపుకున్నా మొత్తం ఖాళీలు 30 వేలకు పైగానే ఉంటాయని చెబుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా జెడ్పీ, ప్రభుత్వ, మున్సిపల్ విభాగాల్లో హైస్కూళ్లు 5,234 ఉన్నాయి. ఇందులో ఒక్కో స్కూల్లో కనిష్టంగా 15 మంది వరకు టీచర్లు ఉండాలని అంచనా వేసుకున్నా మొత్తం 78,510 మంది ఉండాలి. కానీ ప్రస్తుతం పనిచేస్తున్న వారి సంఖ్య పాఠశాల విద్యాశాఖ గణాంకాల ప్రకారం 70,358 మంది మాత్రమే. అంటే హైస్కూళ్లలోనే 8,152 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేలుతోంది. ఉపాధ్యాయ సంఘాల అంచనా ప్రకారం 22 వేలకు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నా జెడ్పీ స్కూళ్లకు సంబంధించి కేవలం 5 వేల పోస్టుల భర్తీకి మాత్రమే అనుమతించడం అన్యాయమని నిరుద్యోగులు వాపోతున్నారు.
కన్వర్షన్‌కూ అనుమతి ఇవ్వని ప్రభుత్వం
గతంలో దాదాపు 4 వేలకు పైగా స్కూళ్లను హేతుబద్ధీకరణ పేరిట ప్రభుత్వం మూసేసింది. ఇందులో మిగిలిన పోస్టుల్లో ఎస్జీటీ విభాగంలోని 3,290 పోస్టులను కన్వర్షన్ చేయాలని ప్రభుత్వాన్ని అధికారులు కోరారు. అయితే దీన్ని కూడా ప్రభుత్వం తిరస్కరించింది. ఈ పోస్టులు కన్వర్షన్ అయితే పీఈటీ, మ్యూజిక్ తదితర విభాగాల్లో పోస్టులు వేయాలనుకున్నారు. ఇంతకు ముందు దాదాపు 1,000 పీఈటీ పోస్టులు వేస్తామని కూడా మంత్రి గంటా ప్రకటించారు. కానీ తాజాగా ఇచ్చిన పోస్టుల్లో వాటి సంఖ్య కేవలం 23 మాత్రమే.
Comments
Please login to add a commentAdd a comment