సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) మంగళవారం సవరణ నోటిఫికేషన్ జారీ చేయనుంది. తొలి నోటిఫికేషన్‌లో పేర్కొన్నట్లుగా 31 జిల్లాలవారీగా కాకుండా... పాత 10 జిల్లాల ప్రకారం కేటగిరీల వారీగా పోస్టులు, రోస్టర్ కమ్ రిజర్వేషన్ వివరాలను ప్రకటించనుంది. వాస్తవానికి పది జిల్లాల ప్రకారం పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఇటీవల మెమో జారీ చేసింది. దీనిపై టీఎస్‌పీఎస్సీకి లేఖ రాసింది. అయితే 31 జిల్లాల వారీగా ఇచ్చిన జీవోను హైకోర్టు తప్పుపట్టినందున.. ఇప్పుడు 10 జిల్లాల వారీగా భర్తీ కోసం జీవోనే ఇవ్వాల్సి ఉంటుందనే ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి నిర్ణయానికి వచ్చారు. దీనిపై కడియం శ్రీహరి అధికారులతో మాట్లాడారు. అనంతరం సోమవారం రాత్రి జీవో జారీ అయింది. పాత పది జిల్లాల ప్రకారం పోస్టులను భర్తీ చేయాలని అందులో టీఎస్‌పీఎస్సీకి సూచించారు. ప్రభుత్వం సూచించే అధికారి నియామక పత్రాలు అందజేస్తారని స్పష్టం చేశారు.
వివరాలు ఇప్పటికే సిద్ధం
సవరణపై ప్రభుత్వం జీవో జారీ చేయడంతో టీఎస్‌పీఎస్సీ తదుపరి కార్యాచరణపై దృష్టి సారించింది. ఇప్పటికే విద్యాశాఖ నుంచి పాత 10 జిల్లాల వారీగా, కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు, రోస్టర్ కమ్ రిజర్వేషన్ వివరాలను తీసుకుంది. వాటి పరిశీలనను కూడా పూర్తయిన నేపథ్యంలో.. మంగళవారమే టీచర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్‌కు సవరణ ప్రకటన ఇవ్వనుంది. అందులోనే పాత పది జిల్లాల వారీగా ఉండే పోస్టుల వివరాలు, కేటగిరీలు, రోస్టర్, రిజర్వేషన్ వివరాలను వెల్లడించనుంది.
ఫిబ్రవరిలో పరీక్షలు
పది జిల్లాల ప్రకారం భర్తీ చేయనున్న 8,792 పోస్టులకు పరీక్షలను ఫిబ్రవరి 24 నుంచి 28వ తేదీల మధ్య నిర్వహించేలా టీఎస్‌పీఎస్సీ షెడ్యూల్‌ను సిద్ధం చేసింది. కేటగిరీల వారీగా, తేదీల వారీగా పరీక్ష తేదీలను సవరణ ప్రకటనలో వెల్లడించే అవకాశముంది. లేదా ఆ తర్వాత ప్రకటిస్తారు. మొత్తంగా మే నాటికి ఫలితాలను ప్రకటించి, ఎంపికైన అభ్యర్థుల జాబితాలను ఆయా జిల్లాలకు పంపించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
దరఖాస్తుల గడువు మళ్లీ పెంపు
ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి దరఖాస్తుల గడువును ఈనెల 30 వరకు పొడిగించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. వాస్తవానికి గత నెల 30తోనే దరఖాస్తుల గడువు ముగిసింది. అయితే కోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 15 వరకు గడువిచ్చారు. తాజాగా మరో 15 రోజులు పొడిగించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివిన వివరాలు వారి దరఖాస్తుల్లో ఉన్నందున.. వాటి ప్రకారం వారు పాత జిల్లాల్లో ఏ జిల్లాకు లోకల్ అవుతారన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకునే అవకాశముంది. లేదంటే వివరాలను ఎడిట్ చేసే ఆప్షన్‌ను కల్పించే వీలుంది. ఈ అంశంపై సవరణ ప్రకటనతో స్పష్టత రానుంది.
Comments
Please login to add a commentAdd a comment