త్వరలోనే డీఎస్సీ!
- వారంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై స్పష్టత
- 17న విద్యాశాఖ ప్రత్యేక సమావేశం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8,792 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమవుతోంది. దీనిపై వచ్చే వారంలో స్పష్టత రానుంది. ఉపాధ్యాయ నియామక నిబంధనలు, నియామకాలు కొత్త జిల్లాల వారీగా చేపట్టాలా, పాత జిల్లాల వారీగానా అన్న అంశాలపై ఈనెల 17న జరిగే సమావేశంలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. అలాగే ఈ పోస్టుల రోస్టర్, రిజర్వేషన్ తదితర వివరాలను కూడా వచ్చే వారంలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)కి పంపించేందుకు చర్యలు చేపడుతోంది.
టీచర్ పోస్టుల భర్తీ అంశంపై ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి శుక్రవారం విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్య కమిషనర్ కిషన్, అదనపు డైరెక్టర్ శ్రీహరి తదితరులతో సచివాలయంలో సమీక్షించారు. ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్, ఉపాధ్యాయ నియామకాల నియమ నిబంధనలపై ఈ సందర్భంగా చర్చించినట్లు తెలిసింది. ఉపాధ్యాయ నియామకాల నిబంధనల రూపకల్పనలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్‌సీటీఈ) మార్గదర్శకాల ప్రకారమే అర్హతలను నిర్ణయించాలని అధికారులకు కడియం సూచించినట్లు తెలిసింది.
ఎక్కువగా ఎస్జీటీ పోస్టులే..
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 8,792 పోస్టుల భర్తీ కోసం కొద్దిరోజుల కిందే విద్యా శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. అందులో 7,892 పోస్టులు తెలుగు మీడియం కాగా.. మిగతా 900 పోస్టులు ఉర్దూ మీడియం స్కూళ్లకు సంబంధించినవి. మొత్తంగా భర్తీ చేసే పోస్టుల్లో ఎస్జీటీ పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. అయితే టీచర్ పోస్టుల భర్తీని జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ)ల ద్వారా కాకుండా టీఎస్‌పీఎస్సీ ఆధ్వర్యంలో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పోస్టులన్నీ జిల్లా స్థాయికి సంబంధించిన పోస్టులు.
కానీ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటైన నేపథ్యంలో.. పాత జిల్లాల వారీగా భర్తీ చేయాలా? కొత్త జిల్లాల వారీగా భర్తీ చేయాలా అన్న సందేహం తలెత్తడంతో భర్తీ ప్రక్రియ ముందుకు కదలకుండా నిలిచిపోయింది. తాజాగా టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన అంశాలు, ఇబ్బందులపై ఈ నెల 17న ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఆధ్వర్యంలో సమావేశం జరుగనుంది. ఆ సమావేశంలో ఆయా అంశాలపై స్పష్టత రానుంది. మరోవైపు ఈ టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి రోస్టర్, రిజర్వేషన్ వివరాలను విద్యా శాఖ అధికారులు సిద్ధం చేస్తున్నారు. వాటిని వచ్చే వారంలో టీఎస్‌పీఎస్సీకి పంపించనున్నారు.
ఏకీకృత సర్వీసుపై అభిప్రాయ సేకరణ
ఇక ఉపాధ్యాయుల ఏకీకృత సర్వీసు రూల్స్‌పై న్యాయ శాఖ, సాధారణ పరిపాలన శాఖల అభిప్రాయాలు తీసుకోవాలని సమావేశంలో నిర్ణయించారు. అంతేగాకుండా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఉపాధ్యాయ సంఘాల జేఏసీలతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను తీసుకోవాలని పాఠశాల విద్య కమిషనర్ కిషన్‌ను ఆదేశించారు.
జూన్ 1 నుంచే బడులు!
వచ్చే విద్యా సంవత్సరంలో జూన్ 12వ తేదీ నుంచి కాకుండా జూన్ 1వ తేదీ నుంచే పాఠశాలలను ప్రారంభించేలా ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేస్తోంది. సాధారణంగా ఏప్రిల్ 23వ తేదీ పాఠశాలలకు చివరి పనిదినం కాగా.. ఆ నెల 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులుగా అమలు చేస్తున్నారు. అయితే జూన్ 2వ తేదీన పాఠశాలల్లో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు జూన్ 1వ తేదీ నుంచే స్కూళ్లను ప్రారంభించాలని భావిస్తోంది.
ఇందుకోసం వార్షిక పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిని కూడా ఏటా ఏప్రిల్ 11లోగానే పూర్తి చేసి, 12వ తేదీ నుంచే వేసవి సెలవులు ఇచ్చేలా విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ ఫైలుకు ఆమోదం లభించగానే ఒకటి రెండు రోజుల్లో ఉత్తర్వులు జారీ కానున్నాయి. జూన్ 11లోగా అన్ని తరగతుల పరీక్షలు పూర్తి చేసేలా అకడమిక్ కేలండర్‌ను అమలు చేయనున్నారు.