7 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తాం
హైదరాబాద్: ఈ ఏడాది 17 వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. అందుకోసం నోటిఫికేషన్ జారీచేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ)కి విజ్ఞప్తి చేసినట్లు ఆయన స్పష్టంచేశారు. గురువారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ సభ్యులు వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ విషయం తెలిపారు. ఇటీవల కొత్తగా 8 వేల ఉపధ్యాయ పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చామని, అయితే అర్హతకు సంబంధించిన విషయంలో అభ్యర్థుల విన్నపం మేరకు వాటిని నిలుపుదల చేశామన్నారు. ప్రాథమిక విద్యపై ప్రభుత్వం దృష్టిసారించనున్నట్లు కడియం తెలిపారు.
2017–18 నుంచి అంగన్‌వాడీ కేంద్రాలను కూడా ప్రాథమిక పాఠశాలల స్థాయికి తీసుకురావాలని భావిస్తున్నామని, ఆయా కేంద్రాలను ప్లే స్కూళ్లుగా తయారుచేస్తామని పేర్కొన్నారు. బాలికల కోసం 300 గురుకుల పాఠశాలలు కేటాయించామన్నారు. అందులో 30 ఎస్సీ బాలికల కోసం కేటాయించామన్నారు. ప్రతీ నియోజకవర్గానికి ఒక మహిళా డిగ్రీ కళాశాల ఏర్పాటుచేయాలని సీఎం నిర్ణయించారని చెప్పారు.