ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని పాత పది జిల్లాల ప్రకారమే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపడతామని ప్రకటిస్తూ.. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం సవరణ నోటిఫికేషన్ జారీ చేసింది. 8,792 ఉపాధ్యాయ పోస్టుల్లో ఈ జిల్లాల వారీగా, కేటగిరీలవారీగా అందుబాటులో ఉండే వాటి వివరాలను వెల్లడించింది. దరఖాస్తుల గడువును ఈ నెల 30వరకు పొడిగించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు పాత జిల్లాల ప్రకారం తమ స్థానిక జిల్లాను ఎంపిక చేసుకునేందుకు ‘డిస్ట్రిక్ట్ ఎడిట్’ఆప్షన్‌ను వెబ్‌సైట్లో పొందుపరుస్తున్నట్లు తెలిపింది. ఇక ఫిబ్రవరి 24–28 తేదీల మధ్య వివిధ పోస్టుల భర్తీ పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
హైకోర్టు ఆదేశాల మేరకు..
టీఎస్‌పీఎస్సీ రాష్ట్రంలో 31 కొత్త జిల్లాల ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ‘టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్టు (టీఆర్‌టీ) నోటిఫికేషన్’జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిపై కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించగా.. 31 జిల్లాల వారీగా భర్తీ రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని స్పష్టం చేసింది. పాత 10 జిల్లాల ప్రకారమే టీచర్ పోస్టులను భర్తీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు పాత జిల్లాల ప్రకారమే పోస్టుల భర్తీకి వీలుగా టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ను సవరించింది. పాత జిల్లాలు, కేటగిరీల వారీగా పోస్టుల వివరాలను అభ్యర్థులు tspsc.gov.in వెబ్‌సైట్‌లో పొందవచ్చని వెల్లడించింది. అభ్యర్థులు పోస్టుల వివరాలను సరిచూసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తుల గడువును ఈనెల 30వ తేదీ వరకు పొడిగించింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ కొత్తగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని సూచించింది. వారు ఇప్పటికే ఇచ్చిన జిల్లాల వారీ ప్రాధాన్యాలను మార్చుకోవచ్చని.. ఇందుకోసం వెబ్‌సైట్‌లో ‘డిస్ట్రిక్ట్ ఎడిట్’ఆప్షన్ లింకును ప్రత్యేకంగా పొందుపరుస్తున్నట్లు తెలిపింది. ఈనెల 15 నుంచి 26వ తేదీ వరకు వెబ్‌సైట్‌లోని ఆ లింకు ద్వారా తమ జిల్లాల ఆప్షన్‌ను ఇచ్చుకోవాలని సూచించింది. అలాగే హైకోర్టు ఆదేశాల మేరకు.. డీఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) చదివినవారు సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు, బీఎడ్ (స్పెషల్ ఎడ్యుకేషన్) చేసిన వారు స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని వివరించింది.
నాలుగు జిల్లాల మైదాన ప్రాంతాల్లో తక్కువగా ఎస్జీటీ పోస్టులు
పాత పది జిల్లాల ప్రకారం పోస్టులను ఇచ్చినా... నాలుగు జిల్లాల్లోని మైదాన ప్రాంతాల్లో ఎస్జీటీ పోస్టుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఖమ్మంలో కేవలం 7 పోస్టులు మాత్రమే ఉండగా, వరంగల్‌లో 20, నల్లగొండలో 40, కరీంనగర్‌లో 74 పోస్టులు ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో మైదాన ప్రాంతంలో పీఈటీ పోస్టులు కేవలం 8 మాత్రమే ఉండగా, లాంగ్వేజ్ పండిట్ పోస్టులూ తక్కువగా ఉన్నాయి. ఫిజికల్ డైరెక్టర్ (పీడీ) పోస్టులు నాలుగు జిల్లాల్లో మాత్రమే ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment