నిరుద్యోగులకు సర్కారీ ‘పరీక్ష’! | Syllabus for teacher jobs has increased a lot Time is short for Study | Sakshi
Sakshi News home page

నిరుద్యోగులకు సర్కారీ ‘పరీక్ష’!

Published Fri, Jul 12 2024 3:57 AM | Last Updated on Fri, Jul 12 2024 10:27 AM

Syllabus for teacher jobs has increased a lot Time is short for Study

డీఎస్సీ, గ్రూప్‌–2 పరీక్షల తేదీలపై నిరుద్యోగులు, విద్యార్థుల్లో ఆందోళన

వచ్చే వారం నుంచే ఉపాధ్యాయ నియామక పరీక్షలు.. 

అవి ముగుస్తున్న సమయంలోనే గ్రూప్‌–2 పరీక్షలు 

చాలా మంది నిరుద్యోగులు రెండింటికీ పోటీ పడుతున్నవారే.. 

పైగా దరఖాస్తుల ప్రక్రియ ముగిశాక నెలరోజుల్లోపే డీఎస్సీ పరీక్ష 

ప్రిపరేషన్‌కు సమయం లేదంటూ అభ్యర్థుల ఆందోళన 

కనీసం రెండు, మూడు నెలలు సమయం ఇవ్వాలనే డిమాండ్లు 

డీఎస్సీ వాయిదా వేయాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళనలు 

వెబ్‌సైట్లో డీఎస్సీ హాల్‌టికెట్లు 

కొంత సమయం ఇస్తే బాగుండేది: ప్రొఫెసర్‌ కోదండరాం

వారం రోజుల్లో మొదలుకానున్న డీఎస్సీ పరీక్షలు.. అవి ముగిశాక రెండు రోజుల్లోనే గ్రూప్‌–2 పరీక్షలు.. ప్రిపరేషన్‌కు సమయం సరిపోని పరిస్థితి.. దీంతో డీఎస్సీ పరీక్షల తేదీలను మార్చాలంటూ అభ్యర్థుల ఆందోళనలు.. ఏమాత్రం వెనక్కితగ్గకుండా పరీక్షల నిర్వహణకే మొగ్గుచూపుతున్న సర్కారు.. ఆందోళనలు చేస్తున్న అభ్యర్థులు, విద్యార్థి సంఘాలపై పోలీసుల లాఠీచార్జీలు.. కాస్త సమయం ఇస్తే బాగుంటుందంటున్న విద్యావేత్తలు.. సమస్యకు పరిష్కారం చూపడం మానేసి లాఠీచార్జీలు ఏమిటంటూ హక్కుల కార్యకర్తల నిలదీతలు.. 

.. రాష్ట్రంలోని నిరుద్యోగుల్లో ఆందోళన, ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుతో నెలకొన్న పరిస్థితి ఇది. సర్కారు ఉద్యోగాల భర్తీ హర్షణీయమే అయినా.. నిరుద్యోగుల డిమాండ్లు, విజ్ఞప్తుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలన్న సూచనలు వస్తున్నాయి.

సిలబస్‌ ఎక్కువ.. సమయం తక్కువ 
టీచర్‌ ఉద్యోగాలకు సంబంధించి సిలబస్‌ బాగా పెరిగింది. మొత్తం 14 సబ్జెక్టులు చదవాలి. కానీ సమయం మాత్రం తక్కువగా ఉంది. రోజుకో సబ్జెక్ట్‌ పూర్తి చేయడం ఎలా? ఇది ఆందోళన రేపుతోంది. పరీక్ష గడువును కనీసం మూడు నెలలు పొడిగించాలి.  
– ఐ.సుజిత, డీఎస్సీ అభ్యర్థి, సూర్యాపేట జిల్లా

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామక పరీక్షల (డీఎస్సీ)కు సమయం ముంచుకొస్తోంది. ఈ నెల 18వ తేదీ నుంచి సబ్జెక్టుల వారీగా పరీక్షలు ప్రారంభం కానున్నాయి. కంప్యూటర్‌ ఆధారి తంగా పరీక్షలు నిర్వహించనున్న ప్రభుత్వం.. ఆ దిశగా ఆన్‌లైన్‌ కేంద్రాలను సైతం ఎంగేజ్‌ చేసుకుంది. డీఎస్సీ పరీక్షలు ఆగస్టు 5వ తేదీతో పూర్తికానుండగా.. ఆగస్టు 7, 8 తేదీల్లో గ్రూప్‌–2 పరీక్షలు జరగనున్నాయి. వరుసగా పరీక్షలు ఉండటంతో అభ్యర్థులపై తీవ్ర ఒత్తిడి ఉంటుందనే వాదన వస్తోంది. 

సమయం తక్కువగా ఉండటంతో.. 
రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ కోసం ఈ ఏడాది మార్చిలో నోటిఫికేషన్‌ వెలువడింది. దరఖాస్తుల స్వీకరణ  మార్చి 4 నుంచి జూన్‌ 20వ తేదీ వరకు కొనసాగింది. సాధారణంగా పోటీ పరీక్షలకు సిద్ధంకావడానికి కనీసం 45 రోజులు ఉండాలి. కానీ ఉపాధ్యాయ నియామక పరీక్షకు కనీసం నెల రోజుల వ్యవధి కూడా ఇవ్వకుండా పరీక్షల తేదీలు నిర్ణయించడంపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో గ్రూప్‌–2 ఉద్యోగాల భర్తీ కోసం 2022 డిసెంబర్‌లో నోటిఫికేషన్‌ విడుదలైంది. ఆ పరీక్షలు పలుమార్లు వాయిదా పడ్డాయి. తాజా తేదీలను ప్రకటించిన టీజీపీఎస్సీ.. ఈసారి పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదంటూ షెడ్యూల్‌ విడుదల చేసింది. ఈ రెండు పరీక్షలు దాదాపు ఒకే సమయంలో జరుగుతుండటంతో.. రెండింటికీ సిద్ధమవుతున్న వారికి ఇబ్బందిగా మారింది. 

ఆందోళనలకు దిగుతున్న అభ్యర్థులు 
ప్రిపరేషన్‌కు సమయం తక్కువగా ఉందని.. ఉపాధ్యాయ నియామక పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ అభ్యర్థులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు. టెట్‌ పరీక్ష ఫలితాలను కూడా వారం క్రితమే విడుదల చేశారని.. డీఎస్సీకి ఎలా సిద్ధం కావాలని ప్రశ్నిస్తున్నారు. అయితే మరో వారం రోజుల్లో డీఎస్సీ పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో... వాయిదా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విముఖంగా ఉన్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. ఈ క్రమంలోనే డీఎస్సీ పరీక్షల హాల్‌ టికెట్లను వెబ్‌సైట్లో పెట్టిందని పేర్కొంటున్నాయి. 

రెండు నెలలు వాయిదా వేయాలి 
ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు. కానీ దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన నెలలోపే రిక్రూట్‌మెంట్‌ పరీక్షలు నిర్వహిస్తామనడం సరికాదు. కనీసం 45 రోజులు సమయం ఇవ్వాలి. తక్కువ సమయంలో పరీక్షలకు ఎలా సిద్ధమవాలో అర్థంకాని పరిస్థితి. ఇది అభ్యర్థులను తీవ్ర ఒత్తిడిలోకి నెట్టడమే. టీచర్‌ నియామక పరీక్షలను కనీసం రెండు నెలలు వాయిదా వేస్తే మేలు జరుగుతుంది. 
– కేశమోని మనోజ్‌గౌడ్, రంగారెడ్డి జిల్లా (డీఎస్సీ, గ్రూప్‌–2 పరీక్షల అభ్యర్ధి) 

పరీక్షలు వాయిదా వేయాలంటే.. పోలీసులతో కొట్టిస్తున్నారు 
డీఎస్సీ పరీక్షలకు కాస్త సమయం ఇవ్వాలని నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతుంటే స్పందించని సీఎం.. నిరుద్యోగులపై మాత్రం లాఠీచార్జి చేయిస్తున్నారు. ప్రజాపాలన అంటే.. నిరుద్యోగులపై లాఠీచార్జి చేయడం, ఇచి్చన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేయడమేనా? 25వేల టీచర్‌ ఉద్యోగాలతో నోటిఫికేషన్‌ ఇస్తానన్న సీఎం రేవంత్‌.. కేవలం 11 వేలకే టీచర్‌ పోస్టులను పరిమితం చేశారు. పైగా విద్యార్థులకు ప్రిపరేషన్‌కు తగిన సమయం కూడా ఇవ్వకపోవడం సరికాదు 
– గెల్లు శ్రీనివాస్, బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు 

కొంత సమయం ఇస్తే బాగుండేది 
టెట్‌ ఫలితాలు వెల్లడించిన తర్వాత కొంత సమయం ఇచ్చి ఉపాధ్యాయ నియామక పరీక్షలు నిర్వహిస్తే బాగుండేది. అలాగాకుండా ముందే షెడ్యూల్‌ ప్రకటించి, తర్వాత టెట్‌ ఫలితాలు ఇవ్వడంతో అభ్యర్థుల్లో కొంత ఆందోళన నెలకొంది. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని కొందరు ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో కలుగజేసుకుని సమస్యను పరిష్కరిస్తే అభ్యర్థులకు ఊరట కలుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికే జాబ్‌ కేలండర్‌ ప్రకటించడానికి సన్నాహాలు చేస్తోంది. గ్రూప్‌–1 పరీక్షలు సవ్యంగా నిర్వహించిందన్న పేరు వచి్చంది. ఇలాంటి సమయంలో చిన్న చిన్న పొరపాట్ల వల్ల నిరుద్యోగుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 
– ప్రొఫెసర్‌ కోదండరామ్, టీజేఎస్‌ అధ్యక్షుడు 

లాఠీచార్జీలు కాదు.. సమస్యను పరిష్కరించాలి 
రాష్ట్రంలో వివిధ పోటీ పరీక్షలను వాయిదా వేయాలంటూ విద్యార్థులు, నిరుద్యోగుల నుంచి విజ్ఞప్తులు వస్తున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం అఖిలపక్ష భేటీ నిర్వహించి రాజకీయ పారీ్టల అభిప్రాయాలు తీసుకుంటే మంచిది. పదేళ్లపాటు ఉద్యోగాల కోసం వేచి ఉండటంతో నిరుద్యోగ యువతలో ఆతృత, ఆందోళన పెరిగాయి. వరుస పరీక్షల నిర్వహణ షెడ్యూల్, ఇప్పటికే ప్రకటించిన పోటీపరీక్షల రీషెడ్యూల్‌పై టీజీపీఎస్సీ నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉంది. 

పరీక్షలు వాయిదా వేయాలంటూ ఎవరైనా కోర్టుకు వెళితే.. కోర్టు స్టే ఇస్తే మొత్తం సమస్య మొదటికి వచ్చే అవకాశాలున్నాయి. అందువల్ల ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి. నిరుద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వపరంగా స్పందించడమో లేక ఉద్యమిస్తున్న సంఘాల ప్రతినిధులతో చర్చించి సమస్య పరిష్కారానికి నచ్చజెప్పడమో చేయాలి. కానీ అందుకు విరుద్ధంగా లాఠీచార్జీలు, దాడులకు దిగడం మంచిది కాదు. దీనితో అసలు సమస్య పోయి పోలీసులు దాడులకు దిగారంటూ మరో సమస్య తెరపైకి వస్తోంది. 
– ప్రొఫెసర్‌ హరగోపాల్, హక్కుల కార్యకర్త, విద్యావేత్త 

వెబ్‌సైట్లో డీఎస్సీ హాల్‌టికెట్లు 
డీఎస్సీ పరీక్షల హాల్‌టికెట్లను గురువారం రాత్రి వెబ్‌సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అభ్యర్థులు www. schooledu. telangana. gov. in   వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని పాఠశాల విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 11,062 టీచర్‌ పోస్టుల భర్తీ కోసం సుమారు 2.8 లక్షల దరఖాస్తులు వచ్చాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement