► 8,452 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ పచ్చజెండా
► రెండు మూడ్రోజుల్లో నోటిఫికేషన్
► పాత జిల్లాల వారీగానే ఉద్యోగ ప్రకటన?
► ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు
► వారంలోగా ఖాళీల వివరాలన్నీ ఇవ్వండి
► అన్ని ప్రభుత్వ శాఖలకు ఆర్థిక శాఖ నోట్
సాక్షి, హైదరాబాద్
నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న డీఎస్సీ నోటిఫికేషన్‌కు మార్గం సుగమమైంది. అతి త్వరలో నోటిఫికేషన్ జారీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ చర్యలు వేగవంతం చేసింది. 8,452 టీచర్ ఉద్యోగాల భర్తీకి ఆర్థికశాఖ లైన్ క్లియర్ చేసింది. దీంతో రెండు మూడ్రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి 8,792 టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ ఆర్థిక శాఖ తాజాగా అందులో 340 పోస్టులకు కోత పెట్టింది.
ఇక ఖాళీలపై కసరత్తు!
టీఎస్‌పీఎస్సీ ద్వారా జారీ అవుతున్న నోటిఫికేషన్లకు ఆటంకాలు ఎదురవడం, కోర్టు కేసులతో సవరణలు చేయాల్సి రావడంతో సీఎం కేసీఆర్ ఈ అంశంపై దృష్టి సారించారు. ఇకపై విడుదల చేసే నోటిఫికేషన్లను జాగ్రత్తగా జారీ చేయాలని అధికారులను ఇప్పటికే ఆదేశించారు. దీంతో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పలుసార్లు ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహించారు. ముందుగా కొత్త జిల్లాల ప్రాతిపదికన నోటిఫికేషన్ ఇవ్వాలని భావించారు. కానీ జోనల్ వ్యవస్థ రద్దు కాకుండా కొత్త జిల్లాల ప్రాతిపదికన నోటిఫికేషన్ జారీ చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయని భావించిన అధికారులు ఆ ఆలోచనను విరమించుకున్నారు.
దీంతో పాత జిల్లాల వారీగానే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దీంతోపాటు ఇతర అంశాలపై కూడా విద్యాశాఖ అధికారులు సుదీర్ఘ కసరత్తు చేసి ఆర్థిక శాఖకు నివేదిక పంపారు. ఇప్పటికే 8,452 ఉద్యోగాలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. టీఎస్‌పీఎస్సీ విజ్ఞప్తి మేరకు తాజాగా మరోసారి జీవో జారీ చేసింది.
ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీ ఏర్పాట్లు పూర్తిచేసి రెండు మూడు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు వచ్చే రెండేళ్లలో 85 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో కొత్తగా ఖాళీల వివరాలను వారంలోగా ఇవ్వాలని కోరుతూ ఆర్థిక శాఖ అన్ని శాఖలకు నోట్ పంపింది. ఇప్పటికే పలు శాఖల్లో 49,500 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఇవిగాక రిటైర్మెంట్ల కారణంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో 20 వేలకు పైగా ఖాళీలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
డీఎస్సీకి లైన్‌క్లియర్!
Published Thu, Sep 7 2017 4:02 AM | Last Updated on Tue, Sep 12 2017 2:04 AM
Advertisement
Advertisement