టీఎస్‌పీఎస్సీ ద్వారానే టీచర్ల నియామకం | Teachers Recruitment to be Done Through TSPSC Now, Telangana DSC Cancelled | Sakshi
Sakshi News home page

టీఎస్‌పీఎస్సీ ద్వారానే టీచర్ల నియామకం

Published Thu, May 19 2016 2:27 AM | Last Updated on Fri, May 25 2018 5:44 PM

టీఎస్‌పీఎస్సీ ద్వారానే టీచర్ల నియామకం - Sakshi

టీఎస్‌పీఎస్సీ ద్వారానే టీచర్ల నియామకం

- భర్తీ బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు
- డీఎస్సీల నేతృత్వంలో ఎంపిక విధానం రద్దు
- ‘విద్యాశాఖ, మోడల్ స్కూళ్ల’ భర్తీ కూడా కమిషన్ ద్వారానే...
- హేతుబద్ధీకరణపై విద్యాశాఖ కసరత్తు, ఆ తర్వాతే తేలనున్న ఖాళీల లెక్కలు
- పాఠశాలల రేషనలైజేషన్‌తో తగ్గనున్న పోస్టులు
- అసెంబ్లీకిచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటే కష్టమే.. 4 వేల స్కూళ్లు మూతపడే ప్రమాదం
- జిల్లాకు నాలుగైదు వందల పోస్టులు మాత్రమే వచ్చే అవకాశం

 
సాక్షి, హైదరాబాద్:
రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ బాధ్యతలను ప్రభుత్వం టీఎస్‌పీఎస్సీకి అప్పగించింది. జిల్లా ఎంపిక కమిటీల (డీఎస్సీ) నేతృత్వంలో ఇప్పటివరకు కొనసాగుతున్న భర్తీ విధానాన్ని రద్దు చేసింది. ఇకపై జిల్లా ఎంపిక కమిటీల స్థానంలో టీఎస్‌పీఎస్సీ ఉపాధ్యాయ పోస్టుల నియామకాలు జరుగుతాయని వెల్లడించింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆచార్య బుధవారం జీవో 19 జారీ చేశారు. పాఠశాల విద్యా డెరైక్టర్ అధీనంలోని అన్ని రకాల డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ ఉపాధ్యాయ పోస్టులను (స్కూల్ అసిస్టెంట్, లాంగ్వేజ్ పండిట్, సెకండరీ గ్రేడ్ టీచర్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్) టీఎస్‌పీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అలాగే తెలంగాణ మోడల్ స్కూళ్లలోని ప్రిన్సిపల్స్, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులను కూడా టీఎస్‌పీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని పేర్కొన్నారు.

ఇందుకు అవసరమైన చర్యలు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి, పాఠశాల విద్యా డెరైక్టర్, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ డెరైక్టర్ కలిసి చేపట్టాలని అందులో వివరించారు. రాష్ట్రంలోని వివిధ గురుకుల విద్యాలయాల సొసైటీల పరిధిలోని గురుకుల టీచర్ పోస్టులను టీఎస్‌పీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పాఠశాల విద్యా డెరైక్టరేట్, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్‌టీ), జిల్లాల డీఈవోలపై కొంత మేరకు పని ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. అయితే పోస్టింగ్‌ల కౌన్సెలింగ్ ప్రక్రియ మాత్రం పాఠశాల విద్యా డెరైక్టర్ నేతృత్వంలో జిల్లాల వారీగా జిల్లా కలెక్టర్లు, జిల్లాల డీఈవోలే చేపట్టాల్సి ఉంటుందని అధికార వర్గాలు వెల్లడించాయి.

హేతుబద్ధీకరణపై ఏం చేద్దాం?
రాష్ట్రంలో విద్యార్థుల్లేని పాఠశాలలను మూసివేయడం, విద్యార్థులు ఎక్కువ మంది ఉన్న చోటికి ఉపాధ్యాయులను పంపించేందుకు చేపట్టాల్సిన హేతుబద్ధీకరణపై విద్యాశాఖ తర్జనభర్జన పడుతోంది. పాఠశాలలను మూసివేయడంపై సుప్రీంకోర్టు సీరియస్ కావడంతో ఆందోళనలో పడింది. ఈ నేపథ్యంలో హేతుబద్ధీకరణ ఎలా చేపట్టాలన్న అంశాన్ని ఇంకా తేల్చుకోలేకపోతోంది. టీచర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలన్నా.. ముందుగా టీచర్లు, స్కూళ్ల హేతుబద్ధీకరణ చేపట్టాల్సి ఉంది. ఆ తర్వాతే భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయ ఖాళీలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గతంలో విద్యాశాఖ తేల్చిన లెక్కల ప్రకారం 10,961 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇవి కాకుండా ఈ నాలుగైదు నెలల్లోనూ ఖాళీ అయిన పోస్టులు ఉన్నాయి. అయితే హేతుబద్ధీరణ చేపడితే అన్ని పోస్టుల అవసరం ఉండకపోవచ్చని అధికారులు పేర్కొంటున్నారు.

జిల్లాకు నాలుగైదు వందలే?
20 మందిలోపు పిల్లలున్న స్కూళ్లను టీచర్లను ఇవ్వాలా? వద్దా? ఇస్తే ఎంత మంది పిల్లలున్న స్కూళ్లకు టీచర్లను ఇవ్వాలి? పిల్లలు అసలే లేని స్కూళ్లను మూసేలా? వద్దా? అన్న అంశాలను విద్యాశాఖ తేల్చాల్సిన అవసరం ఉంది. 20 మందిలోపు పిల్లలున్న స్కూళ్లను కొనసాగించడం కష్టమని, ఇది ఆర్థికంగా భారం కూడా అవుతోందని విద్యాశాఖ ఇటీవల అసెంబ్లీకి సమర్పించిన వివరణ పత్రంలో పేర్కొంది. ప్రాథమికోన్నత పాఠశాలల వ్యవస్థను రద్దు చేయాలని కూడా ప్రతిపాదించింది. ఇవన్నీ చేస్తే దాదాపు 4 వేల స్కూళ్లు మూతపడనుండగా, మరో వేయి ప్రాథమికోన్నత పాఠశాలలను ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం విద్యాశాఖ ఈ అంశాలన్నింటిపై హేతుబద్ధీకరణ మార్గదర్శకాల్లో స్పష్టత ఇచ్చి రేషనలైజేషన్ చేపట్టాలి. అప్పుడే వాస్తవంగా భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య తేలనుంది. అసెంబ్లీకి ఇచ్చిన వివరణ పత్రం ఆధారంగా చేస్తే మాత్రం ప్రతి జిల్లాలో నాలుగైదు వందలకు మించి పోస్టులు రాకపోవచ్చని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

పోస్టుల భర్తీలో డిస్క్రిప్టివ్, డెమాన్‌స్ట్రేషన్!
విద్యాశాఖ రూపొందించిన వివరణ పత్రం ప్రకారం ఉపాధ్యాయ నియామకాల విధానంలో మార్పులు రానున్నాయి. దాని ప్రకారం ఇప్పటివరకు ఉన్న ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్న ప్రశ్నపత్రాన్ని డిస్క్రిప్టివ్ విధానంలో ఇచ్చే అవకాశం ఉంది. దీనికితోడు క్లాస్‌రూమ్ డెమాన్‌స్ట్రేషన్ కూడా అమలు చేయాలని పేర్కొంది. అయితే ఈ మార్పులను ఇప్పుడే తెస్తారా? మున్ముందు తీసుకు వస్తారా? అన్నది తేలాల్సి ఉంది. మరోవైపు గురుకుల పాఠశాలల పోస్టుల భర్తీలో డెమాన్‌స్ట్రేషన్ విధానం అమల్లోకి తెచ్చే కసరత్తు జరుగుతోంది. దాని ప్రకారం చూస్తే విద్యాశాఖలోనూ అమలు చేసే అవకాశం ఉంది.

కేబినెట్ ఆమోదించిన పోస్టులు ఇవీ.. (హేతుబద్ధీకరణ తర్వాత ఈ సంఖ్య మారనుంది)
 
 విభాగం                        పోస్టులు
 గిరిజన సంక్షేమ గురుకుల స్కూళ్లలో    350
 గిరిజన సంక్షేమ గురుకుల కాలేజీల్లో    65
 విద్యాశాఖ గురుకులాల స్కూళ్లలో    267
 విద్యాశాఖ గురుకుల కాలేజీల్లో    6
 సాంఘిక సంక్షేమ గురుకుల  స్కూళ్లలో    889
 బీసీ సంక్షేమ గురుకుల స్కూళ్లలో    249
 బీసీ సంక్షేమ గురుకుల కాలేజీల్లో    57
 డైట్ కాలేజీల్లో    78
 బీఎడ్ కాలేజీల్లో    18
 మోడల్ స్కూళ్లలో ప్రిన్సిపల్స్    86
 మోడల్ స్కూళ్లలో పీజీటీ    331
 మోడల్ స్కూళ్లలో టీజీటీ    300
 
 ప్రభుత్వ/జిల్లా పరిషత్ స్కూళ్లలోని ఖాళీలివీ
 జిల్లా    ఖాళీలు
 అదిలాబాద్    1,818
 నిజామాబాద్    944
 కరీంనగర్    666
 మెదక్    1,257
 హైదరాబాద్    763
 రంగారెడ్డి    1,442
 మహబూబ్‌నగర్        2,024
 నల్లగొండ    689
 వరంగల్    634
 ఖమ్మం    724
 మొత్తం    10,961

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement