డీఎస్సీ.. ఐదో ‘సారీ’  | Postponed the notification of DSC to be released today | Sakshi
Sakshi News home page

డీఎస్సీ.. ఐదో ‘సారీ’ 

Published Wed, Oct 10 2018 4:03 AM | Last Updated on Wed, Oct 10 2018 4:03 AM

Postponed the notification of DSC to be released today - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి బుధవారం విడుదల కావాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్‌ మరోసారి వాయిదా పడింది. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు లేకపోవడంతో షెడ్యూల్‌ ప్రకారం బుధవారం నోటిఫికేషన్‌ వెలువడే అవకాశం లేదని, ఈ నెలాఖరుకు కానీ ప్రకటన విడుదల చేయలేమని విద్యాశాఖాధికారులు స్పష్టం చేశారు. ఇలా ముందుగా షెడ్యూల్‌ ప్రకటించి నోటిఫికేషన్‌ విడుదల చేయకుండా వాయిదా వేయడం ప్రభుత్వానికి ఇది కొత్తకాదు. గత రెండేళ్లలో ఇది ఐదోసారి కావడం గమనార్హం. డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న లక్షలాది మంది నిరుద్యోగులు ప్రభుత్వ తాజా తీరుతో తీవ్ర నిరాశానిస్పృహలకు గురవుతున్నారు. ప్రభుత్వం తమ జీవితాలతో ఆడుకుంటోందని మండిపడుతున్నారు. పదో తేదీన నోటిఫికేషన్‌ ఇస్తామని ఈనెల 5న మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించడం తెలిసిందే. నవంబర్‌ 30న డీఎస్సీ పరీక్ష, వచ్చే జనవరి 3న ఫలితాలు విడుదల చేస్తామని షెడ్యూల్‌ తేదీలనూ ఆయన ఆర్భాటంగా ప్రకటించారు. అయితే షరామామూలుగానే ఈసారి కూడా నోటిఫికేషన్‌ విడుదల వాయిదా పడింది. 

పోస్టులకు కోతపెట్టినా.. భర్తీ చేయకుండా కాలయాపన 
ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ప్రభుత్వం తొలి నుంచి నిరుద్యోగులతో దోబూచులాడుతోంది. ఏటా డీఎస్సీ వేస్తామని, ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించినా గత నాలుగేళ్లలో ఒకే ఒక్కసారి ప్రభుత్వం డీఎస్సీని నిర్వహించింది. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు ప్రకటనలు చేస్తూ కాలయాపన చేస్తోంది. మంత్రి గంటాతోపాటు సీఎం చంద్రబాబు కూడా ఇటీవల కాలంలో డీఎస్సీ నిర్వహిస్తామని చెబుతూ వచ్చారు. మంత్రి గంటా గత రెండేళ్లలో ఐదుసార్లు షెడ్యూల్‌ ప్రకటించినా నోటిఫికేషన్‌ మాత్రం విడుదల కాలేదు. 2014 నాటికే దాదాపు 22 వేల పోస్టుల వరకు ఖాళీగా ఉన్నా కేవలం 10,313 పోస్టులను మాత్రమే భర్తీ చేసింది. ఆ తర్వాత రిటైర్మెంట్లతో కలుపుకుంటే మళ్లీ ఖాళీ పోస్టుల సంఖ్య 30 వేలకు పైగా చేరింది.

అయినా గత మూడేళ్లలో ఒక్క పోస్టూ భర్తీచేయలేదు. 2014 డీఎస్సీని రెండేళ్లకు కానీ పూర్తిచేయలేదు. ఏడాదిన్నర క్రితం మంత్రి గంటా విశాఖలో మాట్లాడుతూ 22 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటి భర్తీకి డీఎస్సీ నిర్వహిస్తామని ప్రకటించారు. నోటిఫికేషన్‌ మాత్రం ఇవ్వలేదు. ఇటీవల 14,300 పోస్టులు భర్తీ అని, తర్వాత 12,370 పోస్టులని, మరోసారి 10,351 పోస్టులు భర్తీ చేస్తామని ప్రకటించారు. డీఎస్సీ నోటిఫికేషన్‌ తేదీలనూ వెల్లడించారు. అయినా నోటిఫికేషన్‌ జాడ మాత్రం లేదు. ఈ మధ్యన రెండుసార్లు టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్టు (టెట్‌)ను నిర్వహించారు. వీటికి దాదాపు 5 లక్షల మంది హాజరయ్యారు. వీరంతా గత కొన్నేళ్లుగా వివిధ కోచింగ్‌ సెంటర్లలో అటు టెట్‌కు, డీఎస్సీకి వేర్వేరుగా వేలాది రూపాయలు వెచ్చించి శిక్షణ పొందుతున్నారు. ఎప్పుడు నోటిఫికేషన్‌ వస్తుందా అని ఎదురు చూస్తున్న వీరికి తాజా పరిణామాలు తీరని నిరాశను మిగిల్చాయి.  

సీఎం అనుమతి లేక గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వని ఆర్థిక శాఖ 
14,300 పోస్టుల భర్తీకి అనుమతుల కోసం విద్యా శాఖ ఫైలును ఆర్థిక శాఖ అనుమతికి పంపినా చంద్రబాబు నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రాకపోవడంతో దానికి గతేడాది కాలంగా మోక్షం లభించలేదు. ఎట్టకేలకు ఇటీవల ఆర్థిక శాఖ విద్యాశాఖకు 6,100 (5వేల పోస్టులు జడ్పీ, 1100 పోస్టులు మున్సిపల్‌ స్కూళ్లు) పోస్టుల భర్తీకి అనుమతించింది. వీటితోపాటు 3,175 గురుకుల స్కూళ్ల పోస్టుల భర్తీకి నిర్ణయించింది. ఆర్థిక శాఖ జీవో సెప్టెంబర్‌ 19న విడుదలై 20 రోజులు దాటినా ఈ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల కాలేదు. దాదాపు 30 వేలకు పైగా ఖాళీలుండగా 6,100 పోస్టులను ఎక్కడెక్కడ సర్దుబాటు చేయాలో అర్థంకాక తలపట్టుకున్న అధికారులు ఎట్టకేలకు రోస్టర్‌ పాయింట్లను తేల్చి ప్రభుత్వానికి నివేదించారు. ఈసారి ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులు కూడా అర్హులేనని ఎన్‌సీఈఆర్‌టీ పేర్కొనడంతో ఆ పోస్టుల వరకు టెట్‌ కమ్‌ టీఆర్టీని పెట్టాల్సి ఉంటుందని అధికారులు కసరత్తు చేశారు. స్కూల్‌ అసిస్టెంట్లు, పీఈటీలు, భాషా పండితులకు డీఎస్సీ నిర్వహించాలని భావించారు. ఈ పోస్టుల భర్తీపై ప్రభుత్వం సమగ్ర ఉత్తర్వులు ఇవ్వాల్సి ఉన్నా ఇప్పటివరకు ఇవ్వలేదు. మరోవైపు మున్సిపల్‌ పోస్టులకు సంబంధించి కూడా స్పష్టత లేదు. ఇలాంటి తరుణంలో ఏ మార్గంలో ముందుకు వెళ్లాలో మంగళవారం రాత్రి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు లేకపోవడంతో నోటిఫికేషన్‌ విడుదలపై విద్యాశాఖ చేతులెత్తేసింది.  

సంక్షేమ శాఖల పోస్టులపైనా తేల్చని సర్కారు 
సంక్షేమ గురుకుల పాఠశాలల పోస్టులను కూడా డీఎస్సీ ద్వారానే భర్తీ చేయాలా? లేదా వాటిని ఆయా శాఖల ద్వారానే నియామకం చేయాలా? అనే దానిపైనా ప్రభుత్వం తేల్చలేదు. మరోవైపు వేలాది పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నా ప్రభుత్వం కేవలం 47 పోస్టులను మాత్రమే విడుదల కానున్న డీఎస్సీకి కేటాయించడంపై అభ్యర్థులు ఆందోళనలు చేపట్టారు. అదనపు పోస్టులను ఈ డీఎస్సీలో ప్రకటించాలంటే వాటికి మళ్లీ ఆర్థిక శాఖ అనుమతి రావాల్సి ఉంది. పీఈటీ పోస్టుల సంఖ్య పెరిగితే ఎస్జీటీ పోస్టుల్లో కోతపడక తప్పదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పోస్టుల సంఖ్య భారీగా కుదించుకుపోవడంతో నిరుద్యోగులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొన్ని జిల్లాల్లో వేలాది మంది నిరుద్యోగులు పోస్టుల కోసం ప్రిపేరవుతుండగా అక్కడ పది లోపు పోస్టులు కూడా లేకపోవడంతో నిరాశలో మునిగిపోతున్నారు. ఇన్నేళ్లు కష్టపడి కోచింగ్‌లు తీసుకొని సన్నద్ధమవుతుంటే ఒకటీ అరా పోస్టులు కేటాయించి ప్రభుత్వం తమను మోసగిస్తోందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. 

మంత్రి గంటా ప్రకటనల తీరు ఇదీ..
ఎన్నికలకు ముందు ఏటా డీఎస్సీ అని ప్రకటించిన టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ మాట మరిచింది. అప్పటి నుంచి డీఎస్సీపై మంత్రి గంటా శ్రీనివాసరావు ఇదిగో డీఎస్సీ, అదిగో డీఎస్సీ అని ప్రకటన చేయడమే తప్ప నోటిఫికేషన్‌ మాత్రం రాలేదు. 
- 2014, జూలై 3న టెట్‌ రద్దు చేస్తున్నామని, ఏటా డీఎస్సీని నిర్వహిస్తామని తొలి ప్రకటన చేశారు.  
2014, జూలై 6న సెప్టెంబర్‌ 5న డీఎస్సీ నోటిఫికేషన్‌ అంటూ ప్రకటించారు. తీరా నోటిఫికేషన్‌ వెలువడలేదు. చివరకు 2015, సెప్టెంబర్‌లో టీఆర్టీ నోటిఫికేషన్‌ రాగా 2016 చివర్లో గానీ ఎంపికైనవారికి నియామక ఉత్తర్వులు ఇవ్వలేదు. 
2017, ఆగస్టులో 22 వేల పోస్టులకు త్వరలో డీఎస్సీ అని విశాఖపట్నంలో విలేకరుల సమావేశంలో మంత్రి గంటా ప్రకటన చేశారు. 
2017, డిసెంబర్‌ 7న విజయవాడలో మీడియా సమావేశంలో 2018 డీఎస్సీ షెడ్యూలును మంత్రి గంటా విడుదల చేశారు. డిసెంబర్‌ 15న నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ప్రకటించారు. 12,370 పోస్టులను భర్తీ చేస్తామని, 2018 మార్చి 23, 24, 25 తేదీల్లో రాతపరీక్షలు ఉంటాయని పేర్కొన్నారు. 
డిసెంబర్‌లో ప్రకటన రాకపోగా అదే నెలలో 2018, జనవరి సంక్రాంతి నాటికి పండగ కానుకగా డీఎస్సీని ప్రకటిస్తామని ప్రకటన చేశారు. అయితే జనవరి గడిచిపోయినా డీఎస్సీ ప్రకటన ఊసేలేదు.  
వేసవి సెలవుల్లో డీఎస్సీని పూర్తిచేసి స్కూళ్లు తెరిచే నాటికి నియామక ఉత్తర్వులు ఇస్తామని పలుమార్లు పేర్కొన్నా జూన్‌ దాటిపోయినా షెడ్యూల్‌ రాలేదు. 
తాజాగా 14,300 పోస్టులు భర్తీ చేస్తామని ఒకసారి, 10,351 పోస్టులని మరోసారి పేర్కొంటూ త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు 
చివరకు 6,100 పోస్టులకు ఈ నెల 10న నోటిఫికేషన్‌ ఇవ్వనున్నామంటూ ఈ నెల 5న షెడ్యూల్‌ ప్రకటించారు. దీన్ని కూడా విడుదల చేయలేక వాయిదా వేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement